visitation
-
రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి, ప్రతినిధి, సూర్యాపేట: కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు రానున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం మంత్రితో పాటు ఆయన భార్య సునీత.. సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతో షిని పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు సీఎం కేసీఆర్ వారి నివాసానికి వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంతో పాటు గ్రూప్–1 ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్ స్వయంగా కల్నల్ కుటుంబ సభ్యులకు అందజేస్తారన్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. భవిష్యత్‌లో వారి కుటుంబ అవసరాల రీత్యా రూ.5 కోట్ల నగదు, నివాస స్థలాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. అయితే ఇంటిస్థలం అన్నది సూర్యాపేటలోనా లేక హైదరాబాద్‌లోనా అన్నది సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల ఇష్టానుసారంగా ప్రభుత్వం నిర్ణయం తీసు కుంటుందని తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఉన్నారు. వాడపల్లి సంగమంలో సంతోష్‌బాబు అస్థికల నిమజ్జనం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి కృష్ణా – మూసీ సం గమంలో కల్నల్ సంతోష్ అస్థికలను శనివా రం కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. సంతోష్ తండ్రి ఉపేందర్, తల్లి మంజులతో పాటు భార్య సంతోషి, కొడుకు, కూతురు ప్రత్యేక వాహనంలో వాడపల్లికి వచ్చారు. పడవలో సంగమం వద్దకు వెళ్లి వేదమంత్రాల నడుమ అస్థికలను నిమజ్జనం చేశారు. -
దాడులకు పాల్పడితే కఠినచర్యలు: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: ప్రేమోన్మాది పాశవిక దాడిలో గాయపడి.. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తేజస్వినిని శనివారం డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..విద్యార్థినిపై దాడి ఘటన దురదృష్టకరమని..తేజశ్విని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన ప్రేమోన్మాదిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. తేజస్వినికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను డిప్యూటీ సీఎం కోరారు. భవిష్యత్‌లో విద్యార్థినికి భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా ఇటువంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని.. కఠినంగా వ్యవహరిస్తామని ఆళ్ల నాని హెచ్చరించారు. -
ఎమ్మెల్యే రమణమూర్తి రాజుకు పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్ర చికిత్స చేయించుకున్న యలమంచిలి ఎమ్మెల్యే యువీ రమణమూర్తి రాజును శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాథ్ , గొల్ల బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, మల్లా విజయప్రసాద్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, విప్ బూడి ముర్తాల నాయుడు, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తదితరులు పరామర్శించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యే రమణమూర్తికి అభినందలు తెలిపారు. సత్తి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు.. సతీ వియోగంతో బాధపడుతున్న విశాఖ వైఎస్సార్సీపీ నేత సత్తి రామకృష్ణారెడ్డిని శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాథ్ గొల్ల బాబూరావు, చెట్టి ఫాల్గుణ, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, విఎంఆర్డీఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, సమన్వయకర్తలు మల్లా విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు, అనకాపల్లి పార్ల మెంట్ అధ్యక్షుడు శరగడం చిన అప్పనాయుడు, కొయ్యా ప్రసాద రెడ్డి, కొండా రాజీవ్ గాంధీ, ఫరూఖీ తదితరులు.. ఇటీవల మృతిచెందిన సత్తి రామకృష్ణారెడ్డి సతీమణి కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలల వేసి నివాళుర్పించారు. -
బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటాం
సాక్షి, విశాఖపట్నం: టగ్ బోటు అగ్ని ప్రమాదంలో గాయపడి.. మై క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్ పరామర్శించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమలు నిప్పుల కుంపటిగా ఉండకూడని.. భద్రత చర్యలు పాటించాలన్నారు. సంఘటన దురదృష్టకరమని.. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను చెప్పామన్నారు. ప్రమాదంపై విచారణ జరుగతుందని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై హెచ్‌పీసీఎల్, పోర్ట్ అధికారులతో మాట్లాడతామని అవంతి తెలిపారు. -
అనితను పరామర్శించిన మంత్రి
సాక్షి, బోథ్: పోడు భూముల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరిస్తారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోథ్ మండలం కోర్టా(కే) గ్రామంలో, గాయపడిన కాగజ్ నగర్ అటవీ రేంజ్ ఆఫీసర్ అనితను మంత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని.. అధైర్యపడవద్దని అనితను, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యంగా నిలబడి దాడిని ఎదుర్కొని, అనిత తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిందని కొనియాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అడవుల నరికివేత, ఆక్రమణల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని... అడవులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తించాలన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవన్న, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు అనిల్ జాదవ్, మల్లికార్జున్ రెడ్డి, జివి రమణ, పాకాల రాంచందర్, అటవీ శాఖ అధికారులు ఉన్నారు. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించిన బాలినేని
-
పరామర్శలోనూ రాజకీయాలా?
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించి, దానిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం తగదని గోవా సీఎం మనోహర్ పారికర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. మంగళవారం పారికర్‌ను పరామర్శించిన అనంతరం రాహుల్‌గాంధీ కోచిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ తమ మధ్య రఫేల్ కుంభకోణంపై చర్చ జరిగిందని వెల్లడించిన విషయం విదితమే. అనిల్ అంబానీకి ప్రయోజనం కలిగించేందుకు మోదీ ప్రయత్నించారని, ఈ విషయంలో పారికర్ తనకు సంబం ధం లేదని తెలిపారని రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పనాజీలోని గోవా అసెంబ్లీ భవనంలో పారికర్ మాట్లాడుతూ ‘రాహుల్‌తో నా భేటీ కేవలం అయిదు నిమిషాలు మాత్రమే జరిగింది. ఆ భేటీలో రాహుల్ రఫేల్‌పై మాట్లాడలేదు. అసలు భేటీలో ఆ అంశమే ప్రస్తావనకు రాలేదు’ అని స్పష్టం చేశారు. తనతో జరిగిన పరామర్శ భేటీని కూడా రాహుల్ అల్పమైన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా రాహుల్‌పై మండిపడ్డారు. -
కరుణానిధికి రాష్ట్రపతి పరామర్శ
సాక్షి, చెన్నై: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఆదివారం మధ్యాహ్నం చెన్నై వచ్చిన ఆయన, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌తో కలిసి నేరుగా ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రికి వెళ్లారు. కరుణానిధిని పరామర్శించిన అనంతరం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళిలతో రాష్ట్రపతి కాసేపు మాట్లాడారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కోవింద్ ట్విట్టర్లో తెలిపారు. జూలై 28 నుంచి కరుణానిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు నేతలు ఆయనను పరామర్శించడం తెలిసిందే. కాగా కరుణానిధికి ఆరోగ్యం బాగాలేదనే బాధతో పుదుకోట్టై జిల్లా కరంబకుడికి చెందిన మూడో వార్డు డీఎంకే కార్యదర్శి మనోహరన్ ఆదివారం గుండె ఆగి మరణించినట్లు సమాచారం. కరుణానిధి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మనోహరన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. -
చిరంజీవి కుటుంబానికి చిన్న శ్రీను పరామర్శ
గరివిడి: మండలంలోని గెడ్డపువలసకు చెందిన తుమ్మగుంటి చిరంజీవి శుక్రవారం గుండెపోటుకు గురై మరణించారు. ఈ సంగతి తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వకర్త మజ్జి శ్రీనివాసరావు ఆయన కుటుంబీకులను పరామర్శించారు. చిరంజీవి మరణానికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కె.కృష్ణంనాయుడు, వి. శ్రీనివాసరావు, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. -
కిడ్ని బాధితులను పరామర్శించిన బీవీ రాఘవులు
-
ఈ వేసవికి మరింత రద్దీ
రానున్న వేసవి సెలవుల్లో తిరుమలలో ఏర్పాట్లపై టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రద్దీని తట్టుకుని భక్తులకు సంతృప్తికరసేవలందించాలని కసరత్తు ప్రారంభమైంది. ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం, బస, కల్యాణకట్ట, లడ్డూ , అన్నప్రసాదాల పంపిణీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సంకల్పించింది. వేసవిలో అన్ని విభాగాలు సమష్టిగా పనిచేయాలనిటీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సాక్షి, తిరుమల: వస్తున్న వేసవి సెలవుల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంద ని టీటీడీ అంచనా వేసింది. ఏప్రి ల్ రెండో వారం నుంచి మే, జూన్ నెలల్లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని గతానుభవం..గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు భావిస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. గత వేసవిలో మాత్రమే రోజుకు 77 వేల నుంచి 81 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ సారి తోపులాటల్లేని దర్శనం కల్పించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్ల నుంచి వెలుపల వచ్చిన భక్తులకు ఆలస్యం లేకుండా గంటలోపే స్వామి దర్శనం కలిగేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లపై వైకుం ఠం, ఆలయ అధికారులతో పలు సందర్భాలు సమీక్షించారు. ఈసారి వేసవిలో టైం స్లాట్ సర్వదర్శనం అమలు టీటీటీడీ కొత్తగా రూ.300 టికెట్లు, కాలిబాట భక్తుల తరహాలోనే సర్వదర్శనానికి టైంస్లాట్ విధానం అమలు చేయనుంది. మార్చి రెండోవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే సందర్భంలో కంపార్ట్మెంట్లలోకి వచ్చే భక్తులకు పాత వి«ధానంలోనూ సర్వదర్శనం కల్పించనుంది. ఏకకాలంలో అన్ని రకాల దర్శనాల అమలు విషయంలో పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. బస, కల్యాణకట్ట, లడ్డూ, అన్నప్రసాదంపై వితరణకు ప్రాధాన్యం ♦ తొలుత సులభంగా గదులు లభించే చర్యలు చేపట్టారు. తిరుమలకొండ మీద ఉండే సుమారు 7 నుంచి 8 వేల గదులు భక్తులకు ల భించేలా చేపట్టారు. గత ఏడాది గదుల వినియోగ శాతం 110 నుంచి 120 శాతానికి పెరిగింది. ♦ యాత్రిసదన్లలో కూడా సౌకర్యాలు రెట్టింపు చేసి వేసవి సెలవుల్లో మరింత మంది వినియోగించుకునేలా ముందస్తు చర్యలు చేపట్టారు. ♦ తలనీలాల వద్ద ఆలస్య నివారణ చర్యలు పెంచారు. ప్రధాన కల్యాణకట్టతోపాటు మినీ కల్యాణకట్టల్లో కూడా త్వరగా భక్తులకు తలనీలాలు సమర్పించుకునే చర్యలు చేపట్టారు. టీటీడీ నాయీబ్రాహ్మణులతోపాటు పీస్ రేట్ కార్మికులతోపాటు మరో 930 మంది శ్రీవారి కల్యాణకట్ట సేవకుల సేవల్ని వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు. ♦ వెలుపల వచ్చిన భక్తులు సులభంగా లడ్డూ ప్రసాదం పొందేలా అన్ని కౌంటర్లు వినియోగంలోకి తీసుకొచ్చారు. ♦ ఇప్పటికే నడిచి వచ్చే భక్తుడికి ఐదు, సర్వదర్శనం భక్తుడికి నాలుగు, రూ.300 టికెట్ల భక్తుడికి నాలుగు చొప్పున ఇస్తున్నారు. రద్దీ రోజుల్లోనూ ఈ విధానాన్ని మరింత పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నారు. ♦ ఆలయం వెలుపల రూ.50 చొప్పున అదనపు లడ్డూలు విక్రయించే చర్యలు పక్కాగా చేపట్టనున్నారు. ప్రస్తుతం రోజుకు 30 వేలు ఇస్తుండగా, వేసవిలో ఈ సంఖ్య 50 వేలకు తగ్గకుండా సరఫరా చేయనున్నారు. ♦ టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివా సరాజు భక్తుల ఏర్పాట్ల విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. సందర్శించిన భక్తుల సంఖ్య 2016 ఏప్రిల్‌లో 20.5 లక్షలు 2017 ఏప్రిల్‌లో 22.10 లక్షలు 2016 మేలో 25.82 లక్షలు 2016 మేలో 26.55 లక్షలు 2016 జూన్‌లో 24.97 లక్షలు 2017 జూన్‌లో 25.77 లక్షలు -
దిలీప్ కుమార్‌కు కింగ్‌ఖాన్ పరామర్శ
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్‌ను కింగ్ ఖాన్ షారూఖ్ పరామర్శించారు. సోమవారం ముంబైలోని దిలీప్ కుమార్ నివాసానికి వెళ్లిన షారూఖ్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్‌తో షారూఖ్ దిగిన ఫొటోను పారిశ్రామిక వేత్త ఫైసల్ ఫారూఖీ దిలీప్ కుమార్ ట్వీటర్లో పోస్ట్ చేశారు. గత ఆరునెలల కాలంలో దిలీప్ కుమార్‌ను షారూఖ్ పరామర్శించడం ఇది రెండో సారి. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్న షారూఖ్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో జీరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జు వ్యక్తిగా కనిపించనున్నాడు. .@iamsrk came to visit Saab at home today. -FF pic.twitter.com/GLrnqu1Ln2 — Dilip Kumar (@TheDilipKumar) 12 February 2018 -
శ్రీకాళహస్తి టెంపుల్ వెరీ బ్యూటిఫుల్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ సౌందర్యం చాలాబాగుందని, వెరీ బ్యూటిఫుల్ అని పలువురు రష్యన్లు కొనియాడారు. రష్యా రాజధాని మాస్కోకు చెందిన 30మంది మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. ఆలయాధికారులు వారికి స్వాగతం పలికారు. రూ.500 టిక్కెట్ ద్వారా శ్రీకృష్ణదేవరాయుల మండపంలో రాహుకేతు సర్పదోషనివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. పరివారదేవతా మూర్తులను సైతం దర్శించుకున్నారు. తర్వాత వారు మాట్లాడుతూ శిఖర దర్శనాలు, ఆలయ శిల్ప సౌందర్యం అద్భుతంగా ఉందన్నారు. తమిళనాడుకు చెందిన పలువురు మాస్కోలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారి సూచనల మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసినట్లు చెప్పా రు. ప్రధానంగా రాహుకేతు పూజలు చేయించుకుంటే వివాహం కానివారికి వివాహం, సంతానం లేనివారికి సంతానం, ఆరో గ్యం సమస్యలు ఉన్నా కుదుటపడుతాయని చెప్పడంతో విచ్చేశామని పేర్కొన్నారు. ఆలయ ఆవరణలోని శిల్ప సౌందర్యాన్ని కెమెరాల్లో బంధించారు. -
సామినేని కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
-
రామోజీరావును పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. కొద్ది రోజుల కింద అనారోగ్యానికి గురైన రామోజీరావు ప్రైవేటు కార్పొరేటు ఆసుప త్రిలో చికిత్స పొందినట్లు తెలిసింది. ఇటీవలే కోలుకున్న రామోజీరావు బేగంపేటలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్... రామోజీరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ వెంట ప్రముఖ వైద్యుడు ఎంవీ రావు తదితరులున్నారు. -
పరామర్శలు వద్దు
► డీఎంకే వర్గాలకు వేడుకోలు ► గోపాలపురంలో కరుణకు విశ్రాంతి సాక్షి, చెన్నై : ఆసుపత్రి నుంచి డీఎంకే అధినేత ఎం కరుణానిధి గోపాలపురం చేరుకున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉం డడంతో ఆయన్ను పరామర్శించేం దుకుఎవ్వరూ రావొద్దు అని డీఎంకే అధిష్టానం విన్నవించుకుంది. డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి అక్టోబరు నెలాఖరులో అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. అలర్జీ కారణంగా ఏర్పడ్డ దద్దుర్లతో నెలన్నర రోజులుగా ఆయన బాధ పడుతూ వచ్చారు. ఈ సమయంలో ఎవర్నీ గోపాలపురం వైపుగా అనుమతించ లేదు. అనుమతులు రద్దు చేస్తూ డీఎంకే కార్యాలయం ప్రకటించింది. ఈ సమయంలో డిసెంబరు ఒకటో తేదీన ఉదయం ఆయన్ను ఆళ్వార్ పేటలోని కావేరి ఆసుపత్రికి తరలించిన సమాచారం డీఎంకే వర్గాల్ని ఆందోళనలో పడేసింది. తమ నాయకుడికి ఏమైందో అన్న ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో మొదలైంది. అరుుతే, ఆయనకు ఎలాంటి సమస్య లేదని, కేవలంలో వైద్య పరీక్షలు మాత్రమేనని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అలాగే, న్యూట్రీషన్, డీహైడ్రేషన్ సమస్యతో కరుణానిధి బాధ పడుతున్నారని కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని కావేరి ఆసుపత్రి వర్గాలు ప్రకటించారుు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కరుణానిధి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఆయన తన స్వగృహం గోపాలపురానికి చేరుకున్నారు. తన కారులోనే కూర్చుని గోపాల పురం వైపుగా కదిలారు. ఆయన వాహనం వెంట స్టాలిన్, కనిమొళి, మురసోలిమారన్, దురైమురుగన్, ఏ.రాజా తదితర నాయకుల వాహనాలు గోపాల పురం వైపుగా దూసుకెళ్లాయి. కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆసుపత్రి నుంచి రావడంతో డీఎంకే వర్గాలు ఆనందంలో మునిగాయి. అయితే, ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు వైద్యులు సూచించడంతో, గోపాలపురం వైపుగా పరామర్శల తాకిడిని నియంత్రించేందుకు డీఎంకే వర్గాలు నిర్ణయించాయి. కావేరి వైద్యులు ఉదయం, సాయంత్రం వేళల్లో కరుణానిధిని ఇంటి వద్దకు వెళ్లి పరీక్షించడంతో పాటుగా, విశ్రాంతి తప్పనిసరిగా స్పష్టం చేశారు. అదే సమయంలో కరుణానిధి మెరీనా తీరంలోని జయలలిత సమాధిని సందర్శించనున్నట్టుగా ప్రచారం ఊపందు కోవడంతో డీఎంకే వర్గాలు ఆగమేఘాలపై గురువారం ప్రకటన విడుదల చేశారుు. కరుణానిధి ఎక్కడకు వెళ్లడం లేదని, ఆయన పూర్తి స్థారుులో విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని అందులో వివరించారు. ఆయన్ను పరామర్శించేందుకు ఎవ్వరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. -
మంత్రుల మాటలు దారుణం
• డెంగీతో 23 మంది చనిపోతే ఇద్దరే అని చెప్తారా..? • వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు సుధీర్‌బాబు • రావినూతల గ్రామంలో మృతుల కుటుంబాలకు పరామర్శ బోనకల్: మండలంలో డెంగీ జ్వరంతో 23 మంది చనిపోతే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరే మృతి చెందారని చెప్పటం అత్యంత దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు లక్కినేని సుధీర్‌బాబు అన్నారు. రావినూతల గ్రామంలో డెంగీ జ్వరంతో మృతి చెందిన కుటుంబాలను వైఎస్ఆర్ సీపీ బృందం బుధవారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోలబోరుున సారుుసుధ కుటుంబం నిరుపేద కుటుంబం కావటం ఉన్న ఒక్కంటిని తాకట్టు పెట్టి వైద్యం చేరుుంచినప్పటికి బతకలేదని కుటుంబసభ్యులు సుధీర్‌బాబు ఎదుట కన్నీంటి పర్యంతమయ్యారు. అదేవిధంగా గిరిజన కుటుంబానికి చెందిన గుగులోతు సైదులు ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉండే తరుణంలో డెంగీతో మృతి చెందాడని కుటుంబసభ్యులు విలపించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని పరిశీలించారు. సర్పంచ్ షేక్ వజీర్‌ను గ్రామంలో జ్వరాల పరిస్థితి, వైద్యసేవలు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ కొండలరావుతో మాట్లాడి జ్వరపీడుతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా లక్కినేని మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు మండలానికి వచ్చి కనీసం డెంగీతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించకపోవటం వారి అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. మండలంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలస్యం సుధాకర్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టౌన్ అధ్యక్షుడు తుమ్మా అప్పిరెడ్డి, మండల నాయకులు షేక్ మౌలాలి, చిట్టోజి శ్రీనివాస్, మర్రి ప్రేమ్‌కుమార్, తాళ్లూరి వెంకటి, గణపారపు వెంకటేశ్వర్లు, ఇరుగు జ్ఞానేష్, షేక్ సయ్యద్‌బాబు, షేక్ షరీఫ్ పాల్గొన్నారు. -
గీతారెడ్డిని పరామర్శించిన జైపాల్‌రెడ్డి
జహీరాబాద్: స్థానిక శాసన సభ్యురాలు గీతారెడ్డిని డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. జైపాల్‌రెడ్డి పరామర్శించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలోని గీతారెడ్డి నివాసానికి జైపాల్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లారు. నెల రోజుల క్రితం గీతారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు హెర్నియా ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న జైపాల్‌రెడ్డి గీతారెడ్డిని పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జైపాల్‌రెడ్డి వెంట న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడివిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఎం.బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జి.భాస్కర్, శ్రీకాంత్‌రెడ్డి, రవి ఉన్నారు. -
ఇది శిశుపాలుడిలాంటి సర్కారు
నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి • శిశుపాలుడిలా 100 తప్పులు చేస్తోంది.. దేవుడు క్షమించడు • పుష్కర స్నానాలకు వెళ్లి విద్యార్థులు చనిపోతే.. • ఈతకెళ్లి మృతి చెందారనడం దుర్మార్గం • విద్యార్థుల మృతికి ఇసుక మాఫియానే ప్రధాన కారణం • వారి మరణాలకు చంద్రబాబు బాధ్యత వహించాలి • ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల సహాయం అందించాలి • బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్ సాక్షి ప్రతినిధి, అమరావతి/వీరులపాడు : పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఈతకెళ్లి మృత్యువాతపడ్డారంటూ దుర్మార్గంగా మాట్లాడుతోంది... ఇంతకంటే దుర్మార్గపు చర్య మరొకటి ఉంటుందా? అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం శిశుపాలుడిలా 100 తప్పులు చేస్తోందని, ఆ తర్వాత దేవుడు కూడా క్షమించడని నిప్పులు చెరిగారు. ఇసుక మాఫియాను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబే విద్యార్థుల మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కృష్ణా పుష్కర స్నానాలకు వెళ్లి చనిపోయిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను ఆయన గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... పుష్కర స్నానాలకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి చెందటం బాధాకరమన్నారు. చందర్లపాడు మండలం ఏటూరు ఘాట్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్నానాలకు వచ్చే భక్తులకు పులిహోర పంపిణీ చేసిన అధికార పార్టీ నేతలు.. విద్యార్థులు చనిపోయిన తర్వాత ఏటూరు ఘాట్ అనధికారికమని మాట మార్చారని విమర్శించారు. అక్కడ ఘాట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే, నాయకుల స్వాగత ఫ్లెక్సీలు ఉన్నాయని, పుష్కర స్నానాలు చేస్తున్న వార్తా కథనాలు ఈనాడు పత్రికలోనూ వచ్చాయని చెబుతూ.. పత్రిక క్లిప్పింగ్ చూపించారు. ‘అసలు నా కుమారునికి ఈత కొట్టటమే రాదు. విధి ఆడిన వింత నాటకంలో అనాథలుగా మిగిలాం’ అని నగేష్ తండ్రి రాజగోపాలాచారి బోరున విలపించడం కలిచివేసిందని చెప్పారు. పుష్కరాల పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి, బినామీలకు నామినేషన్ మీద పనులు అప్పగించి అందినకాడికి దోచుకున్నారని ఆయన విమర్శించారు. ఇసుక మాఫియానే మింగేసింది మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అసత్య ప్రచారాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతికి ప్రభుత్వం ప్రోత్సహించిన ఇసుక మాఫియానే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. అధికార పార్టీ నాయకులు నిబంధనలను ఉల్లంఘించి నదిలో సుమారు 50 అడుగుల లోతు వరకు ఇసుక తోడి గుంతలు చేశారని చెప్పారు. ఈ విషయం తెలియని విద్యార్థులు నదిలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల సహాయం అందించిన విధంగా కృష్ణా పుష్కరాలలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కూడా రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చేతులు దులుపుకున్న ప్రభుత్వం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్నానని తెలుసుకుని అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హడావిడిగా మృతుల కుటుంబాలను పరామర్శించి రూ.3 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారని జగన్ విమర్శించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. యూనిఫాం నిబంధన లేకుంటే బతికేవాడు చెరువుకొమ్ము పాలెం(నందిగామ): డిగ్రీ కాలేజీలో యూనిఫాం నిబంధన లేకుంటే తన అన్న బతికేవాడని పాశం గోపిరెడ్డి చెల్లెలు శ్రావణి జగన్ వద్ద వాపోయింది. నందిగామ మండలం చెరువుకొమ్ముపాలెంలో గోపిరెడ్డి తల్లిదండ్రులను వారింటికి వెళ్లి జగన్ పరామర్శించారు. యూనిఫాం తప్పకుండా ధరించాలనే నిబంధన లేకుంటే.. తన అన్న గోపిరెడ్డి పుష్కర స్నానానికి వెళ్లేవాడు కాదని శ్రావణి ఈ సందర్భంగా చెప్పింది. పుష్కరాలు వచ్చి తమ ఇంట్లో విషాదం తెచ్చిపెట్టాయని గోపిరెడ్డి తల్లిదండ్రులు వెంకటేశ్వరరెడ్డి, రజని కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని జగన్ ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని హామీఇచ్చారు. వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది జయంతి (వీరులపాడు)/ తోటరావులపాడు(చందర్లపాడు): పుష్కర స్నానాల్లో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పరామర్శించారు. తమను ఓదార్చడానికి వచ్చిన జగన్‌ను చూడగానే నగేష్ తల్లిదండ్రులు రాజ గోపాలచారి, దుర్గారాణి, సోదరి స్రవంతి కన్నీటి పర్యంతమయ్యారు. ‘వైఎస్ అన్నా, మీరన్నా నగేష్‌కు ఎంతో అభిమానం. జగనన్నను ఒక్కసారైనా కలవాలని అంటుండేవాడు. చివరకు నగేష్ మృతి చెందితే మమ్మలను పరామర్శించటానికి వచ్చావా అన్నా’ అంటూ గుండెలవిసేలా రోదించారు. ‘రోజుటి మాదిరిగానే ఆ రోజు కూడా కళాశాలకు వెళుతున్నాని చెప్పి వెళ్లాడు. యూనిఫాం వేసుకురాలేదని యాజమాన్యం బయటకు పంపటంతో 11 మంది స్నేహితులుతో కలిసి పుష్కర స్నానానికి వెళ్లినట్లు తెలిసింది. నా కుమారుడు పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందితే ఈతకు వెళ్లి మృతి చెందాడని ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నా కుమారునికి ఈత కొట్టటమే రాదు’ అంటూ బోరున విలపించారు. కుటుంబానికి అండగా ఉంటామని నగేష్ తల్లిదండ్రులను ఓదార్చి.. చమర్చిన కళ్లతో జగన్ వెనుదిరిగారు. అనంతరం పుష్కరస్నానానికి వెళ్లి మృతి చెందిన ములకలపల్లి హరీష్ కుటుంబ సభ్యులను చందర్లపాడు మండ లం తోటరావులపాడు గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మృతుడు హరీష్ తండ్రి ముకుందరావు, తల్లి చిట్టెమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. న్యాయం జరిగేవరకూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. -
నేడు సినీ హీరో రాజా రాక
కడప రూరల్ : రైల్వేకోడూరులోని నడింపల్లె గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రజక దంపతుల కుమార్తెలను పరామర్శించడానికి శనివారం సినీ హీరో రాజా రానున్నట్లు జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు రామసుబ్బన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఐదుగురు పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు వీలుగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రూ. 2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని పారిశ్రామికవేత్త సత్యనారాయణ అందజేస్తారన్నారు. ఆ చిన్నారులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. -
రాజోలు మాజీ ఎమ్మెల్యేకు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 20 నిమిషాలపాటు కృష్ణంరాజుతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఆ సమయంలో కృష్ణంరాజు భార్య మల్లేశ్వరి, చిన్నకుమార్తె కృష్ణకుమారి, కుమారుడు శ్రీనివాసరాజు అక్కడే ఉన్నారు. కృష్ణంరాజుకు నిమ్స్ కార్డియాలజీ వైద్యులు శేషగిరిరావు, చెస్ట్ డాక్టర్ పరంజ్యోతి, డాక్టర్ జీఎస్ఎన్ రాజులు వైద్యమందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు. -
18న జగన్ రాక
తుని : విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 18వ తేదీన రానున్నారని విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తెలిపారు. శుక్రవారం సాయంత్రం తుని శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయానికి వచ్చిన విశాఖ నాయకులను, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజులను రాజా సాదరంగా ఆహ్వానించారు. 18న జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్‌పై చర్చించారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు ఉదయం పది గంటలకు వస్తారని, మాకవరపాలెంలో జరిగే గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. రోడ్డు మార్గంలో సాయంత్రం మూడు గంటలకు తుని చేరుకుంటారని, జాతీయ రహదారి తాండవ బ్రిడ్జి వద్ధ తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన నాయకులు ఘనస్వాగతం పలుకుతారన్నారు. ప్లైవోవర్, జీఎన్టీ రోడ్డు, పట్టణ పోలీస్ స్టేషన్ మీదుగా వీరవరపుపేట చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి పాయకరావుపేట మండలం శ్రీరాంపురం మీదుగా పాల్మన్‌పేట వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారన్నారు. తునిలో స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజా తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గం సమన్వయకర్త చిక్కాల రామారావు, ధనిశెట్టి బాబూరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వేంకటేష్లు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
♦ రైతు కుటుంబాలను పరామర్శించిన ప్రతిపక్షనేత ♦ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం ♦ పెద్దకుడాలలో గంగమ్మకు పూజలు.. మసీదులో ప్రార్థనలు ♦ ఆత్మీయ పలకరింపులు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా మహిళలు, వృద్ధులు, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ముద్దప్పగారిపల్లె, ఎర్రగుడి, పెద్దకుడాల, పులివెందుల, తాటిమాకులపల్లె, వేంపల్లె ఇలా అన్నిచోట్ల కాన్వాయ్‌ను ఆపుతూ ప్రజలతో కరచాలనం చేస్తూ ఆయన ముందుకు సాగారు. అంతకమునుపు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో కూడా ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రజలతో మమేకమయ్యారు. కార్యకర్తలను పేరు పేరునా పలకరించారు. సాక్షి కడప : ‘ఎన్నో కష్టాలు వస్తుంటాయి.. మానవ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొవాలి.. వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని.. జీవితం నుంచి తప్పుకోవడం సమస్యకు పరిష్కారం కాదు.. ఎన్ని ఆటంకాలు వచ్చినా.. ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళితే విజయం సిద్ధిస్తుంది. కుటుంబపెద్ద లేరని అధైర్యపడొద్దని, బాధితులకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది’ అని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. గురువారం ఆయన రైతుభరోసా యాత్రలో భాగంగా లింగాల, చక్రాయపేట మండలాల్లో మూడు రైతు కుటుంబాలను పరామర్శించారు. ప్రస్తుత టీడీపీ సర్కార్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకొనే పరిస్థితిలో లేదని, చివరకు చనిపోయిన వారి కుటుంబాలకు కూడా పూర్తిస్థాయిలో పరిహారం అందించకుండా వేషాలు వేస్తోందని దుమ్మెత్తిపోశారు. అధికారులు కూడా చనిపోయిన రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించలేదంటే ప్రభుత్వం ఎలా నిద్రపోతోందో అర్థం చేసుకోవాలన్నారు. భవిష్యత్‌లో మంచి రోజులు వస్తాయని.. అంతవరకు వేచి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అందరం కలిసి ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వివరించారు. పలు కుటుంబాలకు పరామర్శ లింగాల మండలం పెద్దకుడాల, చక్రాయపేట మండలం ముద్దప్పగారిపల్లె గ్రామాల్లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతులు మంజుల చలపతి, శుద్దమల్ల చెన్నారెడ్డి కుటుంబాలను ప్రతిపక్షనేత పరామర్శిం చారు. రైతు భరోసాయాత్రలో భాగంగా వారి ఇళ్లకు వెళ్లిన జగన్మోహన్రెడ్డి మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. ముందుగా చనిపోయిన రైతుల చిత్రపటాలతోపాటు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తాటిమాకులపల్లెలో ఇటీవలే మృతిచెందిన చిన్నరామిరెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్‌రెడ్డి పరామర్శించారు. ప్రత్యేకంగా చిన్నరామిరెడ్డి భార్య గంగమ్మ, కొడుకు జయరామిరెడ్డిలు వైఎస్ జగన్‌ను చూడగానే కంటితడి పెట్టగా.. వారిని ఓదార్చారు. గంగమ్మకు పూజలు.. మసీదులో ప్రార్థనలు పెద్దకుడాలలో ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి భారీగా తరలివచ్చిన జనాలందరికీ అభివాదం చేశారు. అనంతరం సమీపంలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంకాయ కొట్టి హారతి తీసుకున్నారు. అనంతరం రంజాన్ పండగను పురష్కరించుకొని మసీదుకు వెళ్లి ముస్లింలతో కలిసి ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం అందరినీ ఆలింగనం చేసుకున్నారు. ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. తాటిమాకులపల్లెలో కాసేపు వేంపల్లె మండలం తాటిమాకులపల్లెలో గురువారం సాయంత్రం పలు కార్యక్రమాలలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. దివంగత కృష్ణారెడ్డి కుమార్తె, మోహన్‌రెడ్డి సోదరి పేర్ల భార్గవి, శ్రావణ్కుమార్రెడ్డిల వివాహం ఇటీవలే జరిగిన నేపథ్యంలో వారి ఇంటికి వెళ్లి జంటను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లుగా ఉండా లని ఆకాంక్షించారు. అనంతరం గ్రామ మాజీ డీలర్ శేఖర్‌రెడ్డి ఇంటికి కూడా మర్యాదపూర్వకంగా వెళ్లి కలిసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన జెడ్పీటీసీ సభ్యులు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో పలువురు జెడ్పీటీసీలు వైఎస్జగన్ను కలిసి చర్చించారు. ప్రధానంగా జడ్పీ చైర్మన్ గూడూరు రవి, వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలతోపాటు లింగాల వైఎస్ఆర్సీపీ నాయకులు కొండారెడ్డి, జెడ్పీటీసీలు అబ్బిగారి వీరారెడ్డి, మరకా కృష్ణారెడ్డి, వెంగముని, బాలనరసింహారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు చీర్ల సురేష్‌యాదవ్, యదుభూషణ్‌రెడ్డి, కంచంరెడ్డి, ఆనంద్‌రెడ్డి తదితరులతో చర్చించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు. అనంతరం త్వరలో జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలని వైఎస్ జగన్‌ను వారంతా కోరారు. అంతకముందు మాజీ డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి వచ్చి వైఎస్ జగన్‌ను కలిశారు. జమ్మలమడుగులో సైనికుల్లా దూసుకెళ్లండి జమ్మలమడుగు నియోజకవర్గంలో గడపగడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ కలిసి చంద్రబాబు మోసం చేసిన విధానాన్ని వివరించాలని నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డిని వైఎస్ జగన్ ఆదేశించారు. జమ్మలమడుగులో ప్రజలంతా మనవైపే ఉన్నారని.. గడప గడప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు పది వాహనాల్లో వచ్చి జమ్మలమడుగు, పెద్దముడియం, ఇతర మండలాలకు చెందిన నేతలు కలిశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగులో సైనికుల్లా దూసుకెళ్లాలని కార్యకర్తలకు వైఎస్జగన్ సూచించారు. కార్యక్రమంలో జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్, రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, లింగాల ఎంపీపీ, మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దకుడాల కృష్ణారెడ్డి, కొండారెడ్డి, చక్రాయపేట జెడ్పీటీసీ సభ్యుడు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జమ్మలమడుగు హనుమంతురెడ్డి, వేముల సాంబశివారెడ్డి, వేల్పుల రాము, వేంపల్లె మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జిల్లా కార్యదర్శి సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. రాజన్నా.. మళ్లీ పుట్టాలన్నా.. పులివెందుల రూరల్ : దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి. వైఎస్ఆర్ 1949 జులై 8న వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. డాక్టర్‌గా వృత్తి చేపట్టి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగారు. వైఎస్ఆర్ ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆరోగ్య శ్రీతో బడుగు బలహీన వర్గాల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ : వైఎస్ఆర్ పాలనలో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడారు. దీంతో ప్రజలలో వైఎస్ఆర్ ప్రత్యేక స్థానం సాధించారు. నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగాయి. 2014 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం నియోజకవర్గంలో వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ఇడుపులపాయలలో ట్రిపుల్ ఐటీ, ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతుల అభున్నతి కోసం ఏపీ కార్ల్(ఆంధ్రప్రదేశ్ అత్యున్నతస్థాయి పశు పరిశోధన) కేంద్రం ఏర్పాటు, నియోజకవర్గ ప్రజల వినోదానికి శిల్పారామం, రాణితోపు పార్కు ఆధునికీకరణ, రైతుల కోసం పీబీసీ కాలువ ఆధునికీకరణ, లింగాల కుడి కాలువ ఏర్పాటు, సూక్ష్మ సేద్యం ద్వారా లక్ష ఎకరాలకు నీరు అందించడానికి సంప్ల ఏర్పాటు, పైడిపాలెం ప్రాజెక్టు, లిఫ్ట్ ద్వారా నీటి తరలింపు, మున్సిపాలిటీ తాగునీటి కోసం నక్కలపల్లె ఎస్ఎస్ ట్యాంకు ఏర్పాటు, పులివెందుల మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అదేవిధంగా పులివెందుల చుట్టూ రింగ్ రోడ్డు, హాకీ అకాడమి, ఇండోర్ స్టేడియం, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆధునికీకరణ, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి నిధులు విడుదల చేయడంతో శరవేగంగా పనులు సాగాయి. నేడు వాడవాడలా వైఎస్ జయంతి వేడుకలు : నియోజకవర్గంలో చెరగని ముద్ర వేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 68వ జయంతిని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం, అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీతోపాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. వైఎస్ఆర్ జయంతికి ఏర్పాట్లు పూర్తి వేంపల్లె : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వైఎస్ఆర్ ఘాట్ వద్ద పరిసర ప్రాంతాలలో బెంగుళూరు నుంచి తెప్పించిన పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధానంగా వైఎస్ఆర్ ఘాట్‌లో ఉన్న సమాధి ప్రాంగణం అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. వైఎస్ఆర్ 67వ జయంతి వేడుకలకు సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత నేత వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, కుటుంబ సభ్యులు గురువారం రాత్రికే ఇడుపులపాయకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 8.30గంటలకు వారు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఆయనకు ఘన నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రతిపక్షనేత : ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనలో లోపాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ గడప గడపకు వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమానికి శుక్రవారం ఇడుపులపాయ నుంచే శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉదయం 10గంటలకు ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. పులివెందుల్లో: మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పట్టణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద వైఎస్ఆర్ విగ్రహాలను జెండాలు, తోరణాలతో అందంగా ముస్తాబుచేశారు. పట్టణంలోని ఆర్టీసీ సర్కిల్, కడపరోడ్డు రింగ్‌రోడ్డు సర్కిల్, కదిరి, పార్నపల్లె, ముద్దనూరు, ఉలిమెల్లరోడ్లలో ఉన్న మహానేత విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప పర్యవేక్షిస్తున్నారు. జిల్లా అభివృద్ధిపై వైఎస్ చెరగని ముద్ర కడప కార్పొరేషన్: జిల్లా అభివృద్ధిపై వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారు. రిమ్స్ హాస్పిటల్, రిమ్స్ మెడికల్ కళాశాల, దంత వైద్యశాల, నర్సింగ్ కళాశాల, నూతన కలెక్టరేట్, రోడ్ల విస్తరణ, బుగ్గవంక సుందరీకరణ, భూగర్భ డ్రైనేజీ ఇవి చాలు కడప నగరంలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని ప్రస్తావించడానికి. అయితే ఆయన మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు వివక్షను చూపుతుండడంతో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2001లో కడప నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రతిపక్షనేతగా ఇక్కడి ప్రజల అవస్థలు కళ్లారా చూసిన వైఎస్ తాను అధికారంలోకి రాగానే రూ.72 కోట్లతో బుగ్గవంక సుందరీకరణ పనులు మొదలుపెట్టి ఎస్వీ డిగ్రీ కళాశాల, బాలాజీనగర్, కాగితాల పెంట, వినాయకనగర్ల వద్ద హైలెవెల్ వంతెనలు పూర్తి చేయడంతోపాటు, భవిష్యత్తులో కడప వాసులు వరద ముప్పుకు గురికాకుండా బుగ్గవంకకు ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించారు. కడప నగరంలో ఇరుకుగా ఉన్న అన్ని రోడ్లను విశాలంగా విస్తరింపజేసి, డివైడర్లు, పచ్చని మొక్కలు నాటడం ద్వారా నగరాన్ని సుందరంగా మార్చారు. కడప చుట్టూ రింగు రోడ్డు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు. కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రమించారు. పెచ్చులూడుతూ, వర్షాలకు ఉరుస్తున్న పాత కలెక్టరేట్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి కృషి చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు, ఇతర ప్రభుత్వ సమావేశాలకు ఉపయోగపడే విధంగా అత్యంత ఆధునిక హంగులతో విశాలమైన సమావేశం మందిరం నిర్మించారు. అలాగే స్టేట్ గెస్ట్ హౌస్, ఆర్అండ్బి అతిథి గృహం, హరిత హోటళ్లను కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేయించారు. మున్సిపాలిటీగా ఉన్న కడపను నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేసి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఎక్కువగా వచ్చేందుకు కృషి చేశారు. కడప నగరంలో రూ.70 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేయించారు. కడప, ప్రొద్దుటూరు నగర ప్రజలకు 24 గంటలు తాగునీరు ఇవ్వాలని సోమశిల బ్యాక్ వాటర్ స్కీం ప్రవేశపెట్టారు. రూ.450 కోట్లతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు పనులు కొంత మేరకు జరిగినప్పటికీ ఆయన మరణంతో పూర్తిగా ఆగిపోయాయి. నగర ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు రాజీవ్‌పార్కు, శిల్పారామం పార్కులు ఏర్పాటు చేశారు. రూ. 200కోట్లతో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) హాస్పిటల్, మెడికల్ కళాశాల, దంత కళాశాల, నర్సింగ్ కళాశాలలను అధునాతన హంగులతో నిర్మించారు. యోగి వేమన విశ్వవిద్యాలయం, ట్రిపుల్ ఐటీ, అంతర్జాతీయ పశు పరిశోధన సంస్థ.. ఇలా ఎన్నింటినో జిల్లాకు అందించిన ఘనత వైఎస్‌కే దుక్కుతుంది. నిరుపేదల ఆత్మబంధువు.. కడప నగరంలోని నిరుపేదలకు వైఎస్ ఆత్మ బంధువనే చెప్పాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇళ్లస్థలాల కోసం కమ్యునిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు చేయని పోరాటాలు, ఉద్యమాలు లేవు. అయితే వైఎస్ సీఎం అయ్యాక నగరంలోని పేద, మధ్య తర గతి ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి, ఇండ్లు నిర్మించారు. తద్వారా ఇందిరానగర్, ఉక్కాయపల్లె, చెర్లోపల్లి హౌసింగ్ కాలనీలుగా తయారయ్యాయి. ప్రజలకు అపార్ట్మెంట్ కల్చర్‌ను పరిచయం చేయడానికి విమానాశ్రయం వద్ద శాటిలైట్ టౌన్షిప్, సెంట్రల్ జైలు సమీపంలో రాజీవ్ గృహకల్ప ఏర్పాటుకు కృషి చేశారు. ఇంత అభివృద్ధిని చేసిన వైఎస్ఆర్ను జనం దేవుడిలా కీర్తిస్తున్నారు. క్రీడారంగానికి పెద్దపీట రూ.18 కోట్లతో పాఠశాల ఏర్పాటు రూ. 5 కోట్లతో వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం రూ. 50 లక్షల సొంత నిధులతో వైఎస్ రాజారెడ్డి క్రీడామైదానం ఏర్పాటు కడప స్పోర్ట్స్: జిల్లాలో క్రీడారంగంపైనా వైఎస్ రాజశేఖరరెడ్డి తనదైన ముద్రను వేశారు. అప్పటి వరకు క్రీడాపరంగా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని జిల్లాలో 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే శరవేగంగా పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్‌కు మిగిలిన ఏకైక క్రీడాపాఠశాల ఆయన స్వహస్తాలతో ప్రారంభించినదే కావడం విశేషం. 2006 డిసెంబర్ 30వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రాంతీయ క్రీడాపాఠశాలగా ప్రారంభమైన ఈ క్రీడాపాఠశాల 2011లో సొంత భవనాలు సమకూర్చుకోగా.. 2012 డిసెంబర్ 27న స్వయంప్రతిపత్తి హోదా పొందింది. వైఎస్ఆర్ హయాంలో క్రీడాపాఠశాల అభివృద్ధికి నిధుల వరద పారింది. రూ.18 కోట్లుతో అభివృద్ధి పనులు ప్రారంభించగా.. రూ. 7కోట్లతో తొలుత డార్మిటరీ, కిచెన్, స్విమ్మింగ్‌పూల్, క్వార్టర్స్ నిర్మాణాలు ప్రారంభించారు. అయితే తర్వాత పాలకులు పట్టించుకోక పోవడంతో వీటిలో కొన్ని నిర్మాణదశలోనే ఉన్నాయి. వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానం... నగరంలో క్రికెట్ స్టేడియం ఉండాలని భావించిన వైఎస్ఆర్ అప్పట్లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వారితో సంప్రదించి సొంత నిధులను రూ.50 లక్షలు వారికి అందజేశారు. దీంతో వారు కడప నగరంలో క్రీడామైదానం ఏర్పాటుచేసేందుకు ముందుకు రావడంతో నగర వాసులకు చక్కటి క్రీడామైదానం అందుబాటులోకి వచ్చింది. ఈ మైదానంలో ఇప్పటికే పలువురు జాతీయస్థాయి క్రికెటర్లు విచ్చేసి తమ నైపుణ్యంతో నగర ప్రజలను కనువిందు చేశారు. ఒకేసారి రూ. లక్ష రుణమాఫీ అయింది మాది కడప నగర పరిధిలోని మోడమీదిపల్లె. నాకున్న 4.70 ఎకరాల భూమి పట్టాదారు పాసు పుస్తకాలు, కొంత బంగారాన్ని బ్యాంకులో కుదవపెట్టి పంట రుణం తీసుకున్నాను. లోన్ తీసుకున్నప్పటి నుంచి విడతల వారీగా రుణ బకాయి చెల్లిస్తూ ఉండేవాడిని. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ చేశారు. ఆ రుణమాఫీలో భాగంగా నాకు ఒకేసారి లక్ష రూపాయలు మాఫీ చేశారు. వైఎస్ఆర్ రైతుల పాలిట దేవుడు. ఏ సీఎం చేయని విధంగా ఆయన రైతు సంక్షేమం కోసం కృషి చేశారు. - భాస్కరరెడ్డి, రైతు, మోడమీదిపల్లె. కడప నగరం ఆ అంకుల్ పుణ్యమే.. వైఎస్ఆర్ అంకుల్ ఉన్నన్ని రోజులు మాలాంటి వారికి ఎంతో మేలు జరిగింది. ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. ఆ అంకుల్ పుణ్యమే మేము ఈ రోజు ఉన్నత చదువులు చదివి సమాజంలో రాణిస్తున్నాం. రిజర్వేషన్ వల్ల నేను ఎమ్మెస్సీ పూర్తి చేశాను. ప్రస్తుతం నేను ప్రముఖ విద్యాసంస్థలో అధ్యాపకురాలిగా పనిచేస్తూనే మరోవైపు పీహెచ్డీ కూడా చేస్తున్నాను. నా ఆశయం నెరవేరడానికి డాక్టర్ వైఎస్ అంకులే కారణం. ఆయన్ను ఎప్పటికీ మరచిపోలేను. - యాస్మిన్ బేగం, ఎంఎస్సీ ఆయన దేవుడయ్యా.. నా పేరు హకీం శ్రీనివాసులు. మాది లక్కిరెడ్డిపల్లె మండలం అప్పకొండయ్యగారిపల్లె. నాకు గుండె జబ్బు వచ్చి అనేక ఆసుపత్రులు తిరిగి వేల రూపాయలు ఖర్చు చేసుకున్నా. ఆపరేషన్‌కు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పగా అల్లాడిపోయా. వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 2008లో విజయవాడలో గుండె ఆపరేషన్ చేయించుకున్నా. ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు పునర్జన్మను అందించిన దేవుడాయన. - రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ చేయించుకొన్న హకిం శ్రీనివాసులు రాజన్న చలువతోనే ఉచిత విద్యుత్ .. మాది పెండ్లిమర్రి మండలం మాచనూరు గ్రామం. నాకు 10 ఎకరాల పొలం ఉంది. మూడు వ్యవసాయబోర్లు ఉన్నాయి. పంట దిగుబడులు సక్రమంగా రాక విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతుండే వాడిని. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఉచిత విద్యుత్ అందించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత విద్యుత్‌ను వాడుకుంటూ పంట పండించుకుంటున్నాను. ఆ మహనీయుడి సాయం ఎన్నటికీ మరువలేను. - అందూరి జగన్మోహన్రెడ్డి, పెండ్లిమర్రి మండలం బీటెక్ చదువుతున్నాను.. నేను వైఎస్ దయవల్లే చదువుకుంటున్నాను. మాది ఎర్రగుంట్ల పట్టణం ఓం శాంతి నగర్. నా చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. తరువాత మా అమ్మ అరుణమ్మ కష్టపడి చదివించింది. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ నా పాలిట వరంగా మారింది. దీంతో అనంతపురం జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఏడాదికి రూ.35 వేల చొప్పున ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. వైఎస్ఆర్ విద్యార్థి లోకానికి చేసిన మేలు ఎన్నటికీ మరువలేము. - సిరిగిరెడ్డి అశోక్ భారత్‌కుమార్‌రెడ్డి, ఎర్రగుంట్ల వైఎస్ వల్లే సొంత ఇల్లు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పేదలందరికీ ఇళ్లు వచ్చాయి. నాకు ఇల్లు వచ్చింది. అంతకు ముందు ఇంటి కోసం ఎన్నిసార్లు అధికారులకు దరఖాస్తులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. అద్దె ఇంటిలో చాలా అవస్థలు పడ్డాం. వైఎస్ సీఎం అయ్యాక మాలాంటి పేదలకు మేలు జరిగింది. సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నాము. వైఎస్ మా పాలిట దేవుడు. ఆయన పుణ్యమా అని సొంత ఇంటిలో ఉన్నాము. - రాజమ్మ, ఎన్టీఆర్ కాలనీ, రాజంపేట మండలం -
అబద్ధాలతోనే నడుస్తున్న ప్రభుత్వం
రైతు భరోసాయాత్రలో బాబుపై మండిపడ్డ వైఎస్ జగన్ సాక్షి, కడప: ‘‘ఎన్నికలకు ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడచూసినా ప్రచారం కోసం పాకులాడటం.. తర్వాత మాట తప్పడం ఆయనకు నైజంగా మారింది. ముఖ్యమంత్రిగా అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దకుడాల, తాటిమాకులపల్లె, ముద్దప్పగారిపల్లె, ఎర్రగుడి తదితర గ్రామాల్లో మహిళలు, వృద్ధులు పింఛన్లతోపాటు డ్వాక్రా రుణమాఫీ సక్రమంగా అమలుచేయలేదని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. చివరకు పంట రుణాలు కూడా సక్రమంగా మాఫీ చేయలేదనడంతో ఘాటుగా స్పందించారు. రుణమాఫీ, డ్వాక్రామాఫీ జరగలేదని.. చివరకు పండుటాకులకు అందించే పింఛన్ల విషయంలో కూడా కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. టీడీపీ నేతలకు మాత్రం చంద్రబాబు కావాల్సినంత దోచిపెడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఉన్నారు. రెండు కుటుంబాలకు పరామర్శ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాక.. ఉన్న పొలాలను అమ్ముతున్నా అప్పులు తీరక.. మానసిక వేదనతో బలవన్మరణం చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పరామర్శించారు. ముందుగా లింగాల మండలంలోని పెద్దకుడాల గ్రామానికి వెళ్లి రైతు మంజుల చలపతి కుటుంబసభ్యులను , అనంతరం చక్రాయపేట మండలంలోని ముద్దప్పగారిపల్లెకు చెందిన రైతు శుద్ధమల్ల చెన్నారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. -
నేడు రేణిగుంటకు జగన్
తిరుపతి మంగళం : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం 9.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని ఆ పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్సీపీ కన్వీనర్ దబ్బల రాజారెడ్డి మృతి చెందారని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు జగన్మోహన్రెడ్డి రేణిగుంట నుంచి సూళ్లూరుపేటకు వెళతారని చెప్పా రు. జగ న్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. -
ప్రయోగ వస్తువుగా వాడుకున్నారు: కిషన్ రెడ్డి
గాజులరామారం: ఎత్తు పెరగాలన్న యువకుడి ఆసక్తిని అవకాశంగా తీసుకుని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు అతనిపై ఆపరేషన్ పేరుతో ప్రయోగాలు చేసి బలి పశువుని చేశారని బీజేపీ శాసన సభ పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎంఎన్ రెడ్డి నగర్‌లోని నిఖిల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందు ఎవరికీ చేయని ఆపరేషన్‌ను నిఖిల్‌పై ప్రయోగాత్మకంగా చేసి అతని భవిష్యత్‌ను నాశనం చేశారన్నారు. 6 నెలలుగా ఎత్తు పెరగాలని తమను సంప్రదిస్తున్న నిఖిల్‌ను వైద్యులు తప్పుదారి పట్టించి అపరేషన్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. శస్త్ర చికిత్సకు ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్న నిబంధనను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ తరపున ప్రభుత్వ ఛీప్ సెక్రెటరీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమస్యను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ గుర్తింపును రద్దు చేయడంతో పాటు గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితునికి వైద్యం అందించాలని, నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చికిత్సలను చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
27న జగన్ రాక
సజీవ సమాధి మృతుల కుటుంబాలకు పరామర్శ సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. గుంటూరు నగరం లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో భవన నిర్మాణ పనులు చేస్తూ మట్టి పెళ్లలు విరిగిపడి ఏడుగురు కూలీలు సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. ఆ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు 27న జగన్మోహన్రెడ్డి గుంటూరు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజ శేఖర్, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తెలిపారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని చెప్పారు. -
దుర్గాప్రసాదరాజుకు జగన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్సీపీ నేత సాగి దుర్గాప్రసాదరాజును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం పరామర్శించారు. ప్రశాసన్‌నగర్‌లోని రాజు నివాసానికి జగన్ వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ నేతలు జి.ఆదిశేషగిరిరావు, గుడివాడ అమర్నాథ్, పి.సర్రాజు, రాజీవ్‌కృష్ణ కూడా రాజును పరామర్శించిన వారిలో ఉన్నారు. -
హెచ్ సీయూ విద్యార్థులకు పరామర్శల వెల్లువ
♦ ములాఖత్‌లో కలుసుకున్న నారాయణ,వీహెచ్, కోదండరాం ♦ భారీగా తరలివచ్చిన హెచ్‌సీయూ విద్యార్థులు కుషాయిగూడ: చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లను శనివారం పలువురు ములాఖ త్లో కలుసుకుని పరామర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తదితరు లు విద్యార్థులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అలాగే హెచ్‌సీయూ విద్యార్థులు కూడా భారీగా తరలివచ్చి తమ సహచర విద్యార్థులను పరామర్శించారు. కేంద్రం తీరు గర్హనీయం: వీహెచ్ కేంద్రంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ చెప్పుచేతల్లో పనిచేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. హెచ్‌సీయూ ఘటనకు కారణమైన వీసీ అప్పారావుపై వన్‌మ్యాన్ కమిటీ ఎలాంటి రిపోర్టు అందజేయకముందే తిరిగి ఎలా విధులకు హజరవుతారని ఆయన ప్రశ్నించారు. అప్పారావు హయంలో ఎలాంటి నియామకాలు జరగడానికి వీలులేదన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పిల్ దాఖలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. ఆయన వెంట రాష్ట్రయూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: నారాయణ, సీపీఐ నేత కేంద్ర ప్రభుత్వం తన అణచివేత ధోరణితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇచ్చే కుట్రలో భాగంగానే విద్యార్థులు, మేధావులపై దాడులు చేయిస్తోందని సీపీసీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చర్లపల్లి జైల్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, బాలమల్లేశ్, శివరాంకృష్ణలతో కలిసి ఆయన మాట్లాడారు. ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసే బీజేపీ నాయకులు ఆయన ఆశయసాధన కృషి చేసే రత్నం లాంటి మేధావులను జైలులో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వీసీ అప్పారావు తీరు సబబుకాదు : కోదండరాం హెచ్‌సీయూ ఘటన గోటితో పోయేదాన్ని గొడ్డలి పెట్టును తలపిస్తుందని, వాస్తవంగా విచారణ ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు నెల రోజులు ఆగి ఉంటే ఈ పరిస్థితులు తలెత్తేది కాదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. కేసులు కొనసాగుతుండగా తిరిగి వీసీ బాధ్యతలు చేపట్టడానికి యూనివర్సీటీకి రావడం సమంజసం కాదన్నారు. విద్యార్ధులపై పోలీసుల దాడులు సరికాదన్నారు. విద్యార్థులను కొట్టవద్దన్న అధ్యాపకులను అరెస్టు చేసి జైలులో పెట్టడం అమానుషమన్నారు. -
మద్యం బాధితులకు కామినేని పరామర్శ
విజయవాడ: కల్తీ మద్యం ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మందిని డిశ్చార్జ్ చేశామని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. మద్యంలో మిథైనాల్ కలపడం వల్లే ఘటన జరిగిందని కామినేని చెప్పారు. బాధితులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
వరద బాధిత ప్రాంతాల్లో నేడు జగన్ పర్యటన
బాధితులకు పరామర్శ ప్రభావిత ప్రాంతాల పరిశీలన తిరుపతి రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. ఆదివారం ఆయన తిరుపతిలో జగన్మోహన్రెడ్డి పర్యటన వివరాలను ప్రకటించారు. జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం 9గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రైల్వే కోడూరుకు బయలుదేరి వెళతారు. అక్కడ వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి రైతులను, వరద బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి తిరిగి తిరుపతికి చేరుకుంటారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తారని, తర్వాత రోడ్డు మార్గాన నాయుడుపేట, నెల్లూరుకు బయలుదేరి వె ళతార ని నారాయణస్వామి పేర్కొన్నారు. అక్కడ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పంటలను పరిశీలిస్తారని, రెతులను, బాధితులను పరామర్శిస్తారని వివరించారు. -
'ప్రాజెక్టులకు జలకళ మహానేత పుణ్యమే'
రాయచోటి: వైఎస్సార్ జిల్లాలో వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను, బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించారు. ఈ పర్యటనలో వైఎస్సార్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, రాయచోటి మండలాల్లో దెబ్బతిన్న పంటను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగిందని చెప్పారు. ప్రాణ నష్టం జరిగిన బాధితులకు ప్రభుత్వం నుంచి ఎక్స్‌గేషియా ఇప్పించామన్నారు. రాయచోటికి గరికోన, వెనుజల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్లు వరప్రసాదమని మహానేత భావించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారని అన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు జలకళతో నిండిపోవడంతో ప్రజలు మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని తలుచుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
'రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'
కోవూరు: గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన జీవనానికి తీవ్ర ఇబ్బందులు గురి చేసింది. వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. కోవూరు మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు గురువారం రైతులను పరామర్శించారు. ఎనమడుగు గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న 300 ఎకరాల తమలపాకు తోటను నేతలు పరిశీలించారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టం పరిహారం ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
వరద బాధితులకు రవీంద్రనాథ్‌రెడ్డి పరామర్శ
వైఎస్సార్ జిల్లా: గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టాల పాలైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన కమలాపురం మండలంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. కొండాయపల్లెలో సుమారు 74 గొర్రెలను కోల్పోయిన పెంపకందారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. నష్టపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.20వేలు, గొర్రెకు రూ.10వేలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను కోరారు. అలాగే, మొలకవారిపల్లెలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించి, పక్కా గృహాల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని తహశీల్దార్ రామమోహన్‌కు సూచించారు. గంగవరం గ్రామంలో వరి పైరును పరిశీలించి బాధిత రైతులతో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు. -
వరద బాధితులకు వైఎస్సార్సీపీ పరామర్శ
వైఎస్సార్ జిల్లా: రైల్వే కోడూరులో వరద బాధితులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి మంగళవారం పరామర్శించారు. రైల్వే కోడూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ధర్మాపురం, గాండ్లవీధిలో వరద బాధితులను నాయకులు పరామర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద పరిస్థితులపై అమరనాథ్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే కృష్ణారావుకు సీఎం పరామర్శ
హైదరాబాద్: ఇటీవల పితృవియోగానికి గురైన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు. -
మళ్లొస్తా..
ముగిసిన మొదటి విడత యాత్ర చివరి రోజు నాలుగు కుటుంబాలకు పరామర్శ ఐదు రోజులు.. 32 కుటుంబాలకు ఓదార్పు అడుగడుగునా నీరాజనం వరంగల్ : సంక్షేమ పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన తొలి విడత పరామర్శ యాత్ర ముగిసింది. ఆగస్టు 24 నుంచి 28 వరకు సాగిన పరామర్శయాత్రలో భాగంగా షర్మిల జిల్లాలో 32 కుటుంబాలను ఓదార్చారు. ఐదో రోజు శుక్రవారం పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లోని నాలుగు కుటుంబాలను పరామర్శించారు. గీసుగొండ మండలం మరియపురం నుంచి తీగరాజుపల్లి, రామచంద్రాపురం, ఏనుగల్లు, సాయిరెడ్డిపల్లె, దౌలత్‌నగర్, పర్యతగిరి, కల్లెడ, అన్నారం మీదుగా సో మారంలో యాత్ర ముగిసింది. మృతుల కుటుంబ స భ్యులను కలుసుకొని పరామర్శించారు. వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. పరామర్శ యాత్ర సందర్భంగా జిల్లాలో షర్మిల పర్యటనకు మంచి స్పందన కనిపించింది. తొలి విడతలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో షర్మిల పరామర్శ యాత్ర సాగింది. గ్రేటర్ వరంగల్‌తోపాటు అన్ని గ్రామాల్లో ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. ఏడోరోజు యాత్ర సాగిందిలా.. పరామర్శయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం గీసుగొండ మండలం మరియపురం నుంచి బయలుదేరారు. సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వర్షాలు సకాలంలో కురవక, పంటలు పండక జీవనం ఇబ్బందిగా మారిందని అక్కడి వారు షర్మిలకు చెప్పారు. మంచి రోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని షర్మిల వారికి చెప్పారు. అనంతరం పర్వతగిరి మండలం ఏనుగల్లులోని పెడ్యాల చంద్రకళ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. తర్వాత పర్వతగిరిలోని పల్లూరి కొమురమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. చివరగా తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. చివరి రోజు సాగిన పరామర్శయాత్ర మార్గంలోని ప్రతి ఊరిలో, తండాల్లో ప్రజలు రహదారుల వెంట ఉండి ప్రజలు షర్మిలకు స్వాగతం తెలిపారు. ఆమెతో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీ పడ్డారు. షర్మిల ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ‘నమస్తే అన్న.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లి.. నమస్తే పెద్దయ్య’ అంటూ ముందుకు సాగారు. షర్మిల వెంట.. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొం డా రాఘవరెడ్డి, భీష్వ రవీందర్, జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్‌రెడ్డి, ఇతర జిల్లాల అధ్యక్షులు బి.అనిల్‌కుమా ర్, ఎస్.భాస్కర్‌రెడ్డి, జి.సురేష్‌రెడ్డి, ఎం. శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బి.రఘురాంరెడ్డి, కె.కుసుమకుమార్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, కె.వెంకట్రె డ్డి, విలియం మునిగాల, ఎం.శంకర్, షర్మిల సంపత్, టి.నాగరావు, సెగ్గం రాజేష్, నాడెం శాంతికుమార్, జా ర్జ్ హెర్బర్ట్, జి.శివ, ఎ.సంతోష్‌రెడ్డి, ఆకుల మూర్తి, వన జ, జి.సుమన్‌గౌడ్, జె.అమర్నాథ్రెడ్డి, సాదు రమేష్రె డ్డి, జిల్లా నాయకులు ఎం.కల్యాణ్‌రాజు, ఎ.మహిపాల్‌రె డ్డి, నెమలిపురి రఘు, అమరేందర్‌రెడ్డి, చరణ్, మాధవరెడ్డి, కాగిత రాజ్‌కుమార్ యాదవ్, సం గాల ఇర్మియా, పుజారి సాంబయ్య, అచ్చిరెడ్డి, ఎ.కిషన్, సుమిత్‌గుప్తా, ఇతర జిల్లాల నేతలు బి.సుధాకర్, టి. ఇన్నారెడ్డి, ఎం.నిరంజన్‌రెడ్డి, ఎన్.క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. -
చో రామస్వామికి జయ పరామర్శ
టీనగర్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చో రామస్వామిని ముఖ్యమంత్రి జయలలిత గురువారం నేరుగా కలిసి పరామర్శించారు. సీనియర్ పాత్రికేయులు, తుగ్లక్ వారపత్రిక సంపాదకులు అయిన చో రామస్వామి శ్వాసకోశ సమస్యతో కొన్ని రోజులుగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొంది ఆపై డిశ్చార్జి అయ్యారు. చెన్నై రాజా అన్నామలైపురంలోగల తన నివాసంలో వైద్య చికిత్సలు అందుకుంటూ వచ్చారు. చెన్నైకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ చో రామస్వామి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇలావుండగా చో రామస్వామికి మళ్లీ అస్వస్థత ఏర్పడింది. దీంతో ఆయనను గ్రీమ్స్రోడ్డులోగల అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ముఖ్యమంత్రి జయలలిత గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న చో రామస్వామిని కలిసి పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న చికిత్సల గురించి వైద్యుల వద్ద అడిగి తెలుసుకున్నారు. -
అన్నివిధాలా ఆదుకుంటాం: పొంగులేటి
హైదరాబాద్: అవేర్‌గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రత్యూష నర్సింగ్ కోర్సు పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నదని ఆమెకు వైఎస్ఆర్సీపీ అండగా ఉండి చేయూత నంది స్తుందన్నారు. గతంలో ఆమె గర్ల్స్ స్టేట్ హోంలో ఆశ్రయం పొందిందని అక్కడ కూడా సరైన వసతులు లేవన్న సంగతి బాధితురాలి ఆవేదన ఆధారంగా తనకు తెలిసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పం దించి తగిన వసతులు కల్పించాలని కోరా రు. ప్రత్యూషకు ఉచిత వైద్య సేవలందిం చిన ఆసుపత్రి యాజమాన్యంతో పాటు అండగా నిలబడిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు, బాలల హక్కు ల సంఘం అధ్యక్షురాలు అనూరాధలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. -
నేటి నుంచి రెండో విడత ‘భరోసా’
-
నేటి నుంచి రెండో విడత ‘భరోసా’
నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన * ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ సాక్షి ప్రతినిధి, అనంతపురం: కరువు దెబ్బకు పంటలు ఎండిపోయాయి... చంద్రబాబు సర్కారు చేతులెత్తేసింది... మాఫీ అవుతాయనుకున్న అప్పులు మోయలేని భారమయ్యాయి... అప్పులోళ్ల వేధింపులు తట్టుకోలేక, బ్యాంకర్ల ఒత్తిళ్లు భరించలేక, చంద్రబాబు సర్కారు చేసిన మోసం సహించలేక... అనంతపురం జిల్లాలో 66మంది రైతులు ఉసురు తీసుకున్నారు. అయినా ప్రభుత్వాధినేత గుండె కరగలేదు. రైతు కుటుంబాలను ఆదుకోవడంలో చిత్తశుద్ధి చూపలేదు. ఆత్మహత్యలు జరగలేదన్నారు, పరిహారాన్ని పరిహాసంగా మార్చారు. సర్కారు దుర్మార్గాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో నిలదీశారు. అన్నదాత కుటుంబాల్లో భరోసా నింపేందుకు రైతు భరోసాయాత్ర చేపట్టారు. తొలి విడతలో ఐదు నియోజకవర్గాల్లో పర్యటించి రైతన్నల కన్నీరు తుడిచారు. సోమవారం నుంచి నాలుగు రోజులపాటు మలి విడత రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే గత నెల 29న రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో హత్యకు గురైన వైఎస్సార్సీపీ నాయకుడు భూమిరెడ్డి ప్రసాదరెడ్డి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. హత్య అనంతరం జరిగిన దాడుల అభియోగంతో అరెస్టయి స్థానిక సబ్జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను జగన్ పరామర్శిస్తారు. మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి, పార్టీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, మరో 30 మంది రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. భరోసాయాత్ర షెడ్యూల్ 11వ తేదీ సోమవారం: గుంతకల్లు 12వ తేదీ మంగళవారం: ఉరవకొండ 13వ తేదీ బుధవారం: రాయదుర్గం 14వ తేదీ గురువారం: కళ్యాణదుర్గం -
సల్మాన్‌కు పరామర్శల వెల్లువ
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు హిట్ అండ్ రన్ కేసులో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో గురువారం ఆయనను అనేక మంది బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు కలసి పరామర్శించారు. బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ గురువారం మధ్యాహ్నం సల్మాన్ ఇంటికి వచ్చి ఆయనను కలసి మాట్లాడారు. బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ సల్మాన్‌ను కలసి ఆయన ఇంట్లో గంటసేపు గడిపారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే కూడా బాంద్రాలోని సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఇంకా.. బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, కరీనా కపూర్, క రిష్మా కపూర్, రాణీ ముఖర్జీ, సంగీతా బిజిలానీ, సంజయ్ కపూర్, వహీదా రెహమాన్, గోవిందా, ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ , తదితరులు కూడా సల్మాన్‌ను పరామర్శించారు. సోనాక్షీ సిన్హా, ప్రీతి జింతా, ప్రేమ్ చోప్రా, సునీల్ శెట్టి, తదితరులు బుధవారం సాయంత్రమే సల్మాన్ ఇంటికి వెళ్లారు. కాగా, హిట్ అండ్ రన్ కేసులో అయిదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం బాంబే హైకోర్టు విచారణ చేపట్టనుంది. బుధవారం ఆయనకు శిక్ష పడిన వెంటనే రెండు రోజుల మధ్యంతర బెయిలు మంజూరు చేసిన జస్టిస్ అభయ్ థిప్సే ముందుకే రెగ్యులర్ బెయిల్ విచారణ కూడా రానుంది. -
బాధితులను పరామర్శించిన నేతలు
సోమందేపల్లి: పెనుకొండ బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పరామర్శించారు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ పెనుకొండ ప్రభుత్వాసుపత్రి వద్దకు వచ్చి బాధితులను ఓదార్చారు. గాయపడినవారికి వెంటనే చికిత్సలు అందచేయాలని వైద్యులను కోరారు. మార్చురీ వద్ద మృతదేహాలను చూ సి ఆయన చలించిపోయారు. రోధిస్తున్న బంధువులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. పెనుకొండ కాంగ్రెస్ పార్గీ ఇన్చార్జ్ కెటి శ్రీధర్, అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, ఇంటిలిజెన్స్ డీఎస్పీ కోలార్‌కృష్ణ, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వర్లు, నియోజకవర్గం వైఎస్సార్ సీపీ, తేదేపా, కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. హిందూపురం రూరల్ ఎస్ ఐ, మడకశిర ఎస్ఐ, పెనుకొండ సీఐ రాజేంద్రనాథ్ యాద వ్, మడకశిర సిఐ హరినాథ్, పెనుకొండ, సోమందేపల్లి, రొ ద్దం, పరిగి, హిందూపురం రూరల్ ఎస్ఐలు శేఖర్, నారాయణ, హరున్‌బాషా, రంగడు, ఆంజనేయులు, పోలీసు సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రులకు చేరవేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరం: బస్సు ప్రమాదం అత్యంత బాధకరమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల కిందట జరిగిన రైలు ప్రమాదాన్ని మరచిపోకముందే మరోసారి బస్సు ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడం మరచిపోలేనిదన్నారు. కండీషన్ లేని బస్సులు, ప్రమాదం స్థలం వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఈ ఘటనకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితులను ఓదార్చిన పీసీసీ అధ్యక్షుడు : పీసీసీ అధ్య క్షుడు రఘువీరారెడ్డి బుధవారం బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన, మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మావటూరు, బండపల్లి, నాగలూరు గ్రామాలకు వెళ్లి మృతదేహాలను సందర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆయన హిందూపురంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. -
నటుడు సాయికుమార్‌కు జగన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు పీజే శర్మ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శర్మ కుమారుడు సాయికుమార్‌ను జగన్మోహన్రెడ్డి సోమవారం ఫోన్లో పరామర్శించారు. సాయికుమార్ తండ్రి మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
టీఆర్ఎస్ కౌన్సిలర్‌పై హత్యాయత్నం
- ఆస్పత్రిలో బాధిత కౌన్సిలర్‌కు పరామర్శల వెల్లువ - పట్టణ బంద్ ప్రశాంతం సంగారెడ్డి మున్సిపాలిటీ : సంగారెడ్డి పట్టణంలోని 20 వార్డు కౌన్సిలర్ ప్రదీప్‌పై మంగళవారం అర్ధరాత్రి జరిగిన హత్యాయత్నంపై గల కారణం ఏమిటన్నది పోలీసులకు అంతుబట్టడం లేదు. నవంబర్ 29న జరిగిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో ప్రదీప్‌పై ఎంఐఎం కౌన్సిలర్లు తిరగ బడ్డారని వారే దీనికి పాల్పడినట్లు మొదట్లో ప్రచారం సాగింది. ఆ తర్వాత అదే సమావేశంలో ఎర్రకుంట శిఖం భూమిపై ప్రదీప్ ప్రస్తావించడంతోనే భూకబ్జాదారులు దాడికి పాల్పడినట్లు అనుమానం వచ్చింది. కాగా బాబానగర్ ప్లాట్లు విక్రయాల విషయంలో సైతం ప్రదీప్, అతడి మిత్రుడు శ్రీకాంత్‌లు అక్కడి కాలనీవాసులతో గొడవకు దిగారని అందువల్లే ఈ దాడి జరిగిందనే మరో ప్రచారం సాగింది. కానీ ఈ దాడికి ప్రధాన కారణం తెలియడం లేదు. ఇదిఇలా ఉంటే ప్రదీప్ కల్వకుంటలో ఉన్న ఆయన ఇంటికి వె ళ్లేందుకు సుహానాదాబా నుంచి బైపాస్ మీదుగా రావచ్చు. లేదంటే ప్రధాన రహదారి మీదుగా వచ్చే అవకాశం ఉంది కాని ఎప్పడూ లేని విధంగా రాజంపేట రోడ్డు మీదుగా ఎందుకు వచ్చారనే ప్రశ్నకు సమాధానం లేదు. దాబా వద్దనే ఎవ్వరికి వారు వెళ్లినా.. శ్రీధర్‌రెడ్డి అక్కడే ఎందుకు ఉన్నాడు..? ఆయన వాహనంలో పెట్రోల్ అయిపోయిన విషయం ఎప్పడు తెలిసింది..? ఆ రాత్రి ఆయన ఊరి నుంచి పెట్రోల్ ఎవ్వరు తీసుకోస్తారంటే అక్కడే నిలిచిపోయారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సంఘటన విషయం తెలియగానే తాను సమాచారం ఇవ్వడంతో శ్రీధర్‌రెడ్డి వచ్చినట్లు శ్రీకాంత్ తెలుపడాన్ని సైతం పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా ప్రదీప్‌పై జరిగిన దాడికి ప్రధాన కారణం తెలియలేకపోతుంది. ఇందుకు ఎర్రకుంట భూ కబ్జాదారులు చేశారా.? ఎంఐఎం కౌన్సిలర్లు చేశారా..? ఆయన అనుచరులే చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పరామర్శల వెల్లువ : గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కత్తి పోట్లకు గురై స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌన్సిలర్ ప్రదీప్‌ను జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు, కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హుగ్గెల్లీ రాములుతో పాటు పలువురు పరామర్శించారు. సంగారెడ్డి ఇన్చార్జ్ కమిషనర్ గయజుద్దీన్, మున్సిపల్ సిబ్బంది సైతం ప్రదీప్‌ను పరామర్శించారు. పట్టణం బంద్ : కౌన్సిలర్‌పై దాడికి నిరసనగా తెలంగాణ విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) ఆధ్వర్యంలో పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు రాజేందర్‌నాయక్, కొత్తపల్లి నాని, జయపాల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేశాయి. వ్యాపార సంస్థలను బంద్ చేయించే క్రమంలో ఇండియన్ పెట్రోల్ బంక్ యజమాని బంద్‌కు నిరాకరించడంతో నాయకులు ఆయనతో వివాదానికి దిగారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు -
కలిచెర్లకు జగన్ పరామర్శ
పంజగుట్ట: కర్నూలు వద్ద మూడు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. నిమ్స్ మిలీనియం బ్లాక్ 124 రూంలో చికిత్స పొందుతున్న ఆయనను జగన్ పరామర్శించి ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కలిచెర్లకు నిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రూపమ్ వైద్యం అందిస్తున్నారు. నిమ్స్‌కు వచ్చిన జగన్‌ను చూసేందుకు రోగుల బంధువులు పోటీ పడ్డారు. నల్లగొండ జిల్లా మోత్కూర్‌కు చెందిన పార్వతమ్మ జగన్ వద్దకు వచ్చి తన కొడుకు నరేష్ గుండె జబ్బుతో బాధపడుతున్నాడని చెప్పడంతో జగన్ అక్కడ ఉన్న జూనియర్ వైద్యులకు డా.శేషగిరిరావుతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. -
ఓదార్పులో మంత్రులు
రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆదివారం ఓదార్పు యాత్ర చేపట్టారు. తమ అమ్మ కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించారు. 34 కుటుంబాల ఇళ్ల వద్దకు వెళ్లి, మృతి చెందిన వారి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సాక్షి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో రాష్ట్రంలో ఆందోళనలు రాజుకున్న విషయం తెలిసిందే. అలాగే, టీవీల్లో ఆ సమాచారం విన్న వారు పదుల సంఖ్యలో గుండె పోటుతో మరణించారు. మరెందరో కార్యకర్తలు ఆత్మహత్య, ఆత్మాహుతి బాట పట్టారు. ఇలా మొత్తం 219 మంది మరణించినట్టు అన్నాడీఎంకే వర్గాల లెక్కల్లో తేలింది. తన కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు జయలలిత నిర్ణయించారు. బెయిల్ మీద బయటకు రాగానే, ఆ మృతులకు సంతాపం తెలియజేశారు. ఆ కుటుంబాల్ని ఓదార్చేందుకు నిర్ణయించారు. మృతుల కుటుంబాలకు తలా రూ.3 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాలను ఆయా కుటుంబాలకు అందజేయడం లక్ష్యంగా శనివారం శ్రీకారం చుట్టారు. తొలి రోజు ఆయా నియోజకవర్గాల పరిధుల్లో ఈ సాయం పంపిణీ సాగింది. ఆదివారం సెలవు దినం కావడంతో మంత్రులందరూ ఓదార్పు బాట పట్టారు. ఆదివారం మంత్రులందరూ తమ తమ నియోజక వర్గాలకు చేరుకున్నారు. ఉదయం నుంచి తమ తమ జిల్లాల పరిధుల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మృతుల కుటుంబాల్ని ఓదార్చే పనిలో పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓదార్పుతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బిబీబిజీ అయ్యారు. ఆయా మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి, తమ సానుభూతి తెలియజేశారు. సీఎం జయలలిత సంతాపం తెలిపినట్టుగా వారికి కరపత్రాలను అందించినానంతరం రూ.3 లక్షలకు గాను చెక్కులను అందజేశారు. మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, సెంథిల్ బాలాజీ, బీవీ రమణ, చిన్నయ్య, గోకుల ఇందిర, వలర్మతి తదితరులు ఓదార్పులో నిమగ్నం అయ్యారు. మొత్తం 34 కుటుంబాలను ఓదార్చి జయలలిత ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించారు. -
తుపాను బాధితులకు పవన్ కల్యాణ్ పరామర్శ
విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫిషింగ్ హార్బర్, జాలరిపేటలోని హుదూద్ తుపాను బాధితులను పరామర్శించారు. రాజమండ్రి నుంచి విమానంలో ఆయన ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా ఫిషింగ్ హార్బర్, జాలరిపేట వెళ్లి బాధితులను కలుసుకున్నారు. బాధితుల సమస్యలు విని, వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ '' నేను వస్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. నేను రాకపోతే మీరు బాధపడతారు. అందుకే వచ్చాను'' అని అన్నారు. తుపాను బాధితులకు 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. పవన్ కల్యాణ్ రేపు ఉదయం విజయనగరంలో పర్యటిస్తారు. ఆ తరువాత శ్రీకాకుళం వెళ్లి అక్కడ బాధితులను పరామర్శిస్తారు. ** -
తుపాను బాధితులకు పవన్ కల్యాణ్ పరామర్శ
-
హోం మంత్రికి ఉప ముఖ్యమంత్రి పరామర్శ
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని శనివారం ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. హజ్ యాత్ర పూర్తి చేసుకొని ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన ఆస్పత్రికి వెళ్లి హోంమంత్రిని కలిశారు. సంబంధిత వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కూడా హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిని శనివారం కలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. హోంగార్డులు... హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని తెలంగాణ హోంగార్డుల సంక్షేమ అసోసియేషన్ ప్రతినిధులు ఆస్పత్రిలో కలిసి పరామర్శించా రు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాం క్షించారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో తెలంగాణ హోం గార్డుల సంక్షేమ సంఘ ప్రతినిధులు రాజేందర్‌రెడ్డి, ఏడుకొండలు, రఘుపతిరాజు ఉన్నారు. -
సీసీ రెడ్డి కుటుంబానికి షర్మిల పరామర్శ
సాక్షి,సిటీబ్యూరో: చలన చిత్ర నిర్మాత సీసీ రెడ్డి కుటుంబసభ్యులను దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తె షర్మిల, ఆమె భర్త అని ల్‌కుమార్ పరామర్శించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏ ర్పాటు చేసిన చిత్రపటం వద్ద వారు శ్రద్ధాం జలి ఘటించారు. అనంతరం సీసీ రెడ్డి భా ర్య సుభద్రమ్మను ఓదార్చారు. అనంతపు రం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా సీసీ రె డ్డి నివాసానికి చేరుకొని సీసీ రెడ్డి కుటుం బీకులను పరామర్శించారు. సీసీ రెడ్డి దగ్గర 20 ఏళ్లుగా పనిచేస్తున్నానని ఆయన సహచరుడు అనంతపురం జిల్లా ఓడీ చెరువుకు చెందిన బి. నాగరాజు కన్నీటి పర్యంతమయ్యారు. నేడు అంత్యక్రియలు.. సీసీ రెడ్డి భౌతికకాయాన్ని కేర్ హస్పిటల్ నుంచి గురువారం ఉదయం 7 గంటలకు జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 24లోని, ప్లాట్ నంబర్ 366కు తీసుకువస్తామని సమీపబంధువు వై.సురేష్ కుమార్ రెడ్డి తెలిపా రు. అంత్యక్రియలను మధ్యాహ్నం 12 గం టల తర్వాత పటాన్ చెరువు నుంచి ముం బయి హైవే మార్గంలోని మునిపల్లి మండ లం గొర్రెగట్టు గ్రామం సమీపంలోని ఫాంహౌస్(శివశివాని ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర)లో నిర్వహిస్తారని చెప్పారు. -
బిజీబిజీగా..
- బంధువులు,స్నేహితులతో కలివిడిగా జగన్ - కుటుంబ సభ్యులతో కలిసి పలు వివాహాలకు హాజరు - వేంపల్లెలో మూడు కుటుంబాలకు పరామర్శ సాక్షి కడప/కార్పొరేషన్/వేంపల్లె/ముద్దనూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపారు. ఒకపక్క వివాహ కార్యక్రమాలకు హాజరవుతూనే.. మరోపక్క తనను కలవడానికి వస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7గంటలవరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలు, రైతులతో గడిపారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం ఒకరోజు జిల్లా పర్యటనకు హైదరాబాదునుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ముద్దనూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,ప్రతిపక్షనాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ,సతీమణి భారతీరెడ్డితో కలసి రైలు దిగిన జగన్మోహన్రెడ్డికి ఎంపీ వైయస్ అవినాష్‌నెడ్డి, మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు భూపేష్‌రెడ్డి,సంబటూరు ప్రసాద్‌రెడ్డి,రాయచోటి మదన్‌మోహన్‌రెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి రవి ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరి వెళ్ళారు. పులివెందులలోని వీజే కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ జోసఫ్‌రెడ్డి కుమార్తె వీణా, పవన్‌కుమార్‌రెడ్డి వివాహానికి గురువారం ఉదయాన్నే వైఎస్ జగన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. సాయంత్రం పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలులో పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనుమడు, తొండూరు మండల ఇన్‌ఛార్జి వైఎస్ మధురెడ్డి కుమారుడు వైఎస్ అభినవ్‌రెడ్డి, కృష్ణచైతన్యల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తదితరులతో కలిసి వివాహ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం అంబకపల్లె లక్ష్మినారాయణరెడ్డి కుమారుడు శ్రీనాథరెడ్డి, సుమతి వేముల జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి సోదరుడు చంద్రమోహన్‌రెడ్డి, కవితల వివాహానికి కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత కడపకు వెళ్లి సోమశేఖరరెడ్డి కుమార్తె శివతేజ, మనో వికాస్‌లను ఆశీర్వదించారు. శిల్పారామంలో ఇందుకూరు రమణారెడ్డి కుమార్తె ప్రశాంతి, సునీల్ రిసెప్షన్ వేడుకకు హాజరై వారిని ఆశీర్వదించారు. మూడు కుటుంబాలకు పరామర్శ : మండల కేంద్రమైన వేంపల్లెకు చెందిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బొమ్మిరెడ్డి రామిరెడ్డి 10రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం వైఎస్ జగన్ వేంపల్లెకు వెళ్లి రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన కొరివి నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వేంపల్లెకు చెందిన కొండయ్య ఈ మధ్యనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ కొండయ్య భార్య ఈశ్వరమ్మను పరామర్శించారు. ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్ వల్లీ ఆయన వెంట ఉన్నారు. అంతకు ముందు వేంపల్లెకు చేరుకున్న వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు : పులివెందుల పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌ను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌వివేకానందరెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్‌బాబు తదితరులు కలిసి అనేక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. రాజన్న పాలన కోసం ఎదురు చూస్తున్నాం రాజన్న పాలన కోసం తాము ఎదురు చూస్తున్నామని కడపలోని రవీంద్రనగర్ మహిళలు వైఎస్ జగన్మోహన్రెడ్డితో అన్నారు. గురువారం ఆయన కొమ్మా సోమశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్తుండగా కొందరు మహిళలు ఆయన కాన్వాయ్కి అడ్డుపడి దిగాలని పట్టుబట్టారు. ఎన్నికల్లో మీ ప్రభుత్వమే వస్తుందని ఆశపడ్డామని పరిస్థితి తారుమారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ వారిని ఆప్యాయంగా పలకరించి, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. -
అధైర్యపడకండి.. అండగా ఉంటాం
- గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులకు జగన్ భరోసా - నగరంలో మృతుల కుటుంబాలను ఊరడించిన వైఎస్సార్ సీపీ అధినేత - ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శ - బాధలు చెప్పుకొని కన్నీరుమున్నీరైన బాధితులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘నిన్నటి దుర్ఘటనలో సర్వస్వం బుగ్గిపాలైంది. కళ్లెదుటే కుటుంబ సభ్యులు సజీవ దహనమైపోతుంటే..ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగెత్తడం తప్ప ఏమీ చేయలేకపోయాం. మమ్మల్ని మీరే ఆదుకోవాలన్నా’ అంటూ గ్యాస్ పైపులైన్ విస్ఫోటం బాధితులు, మరొక పక్క ‘ఈ బాధ భరించలేకపోతున్నా.. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు.. నిజంగా ప్రత్యక్షనరకంలా ఉందన్నా’ అంటూ ఆస్పత్రుల్లో క్షతగాత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పట్టుకొని కన్నీరు మున్నీరయ్యారు. మృతుల కుటుంబాలను ఓదారుస్తూ..తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తూ శనివారం జిల్లాలో జగన్మోహన్రెడ్డి పర్యటనసాగింది. హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు మధురపూడి చేరుకున్న జగన్ నేరుగా మామిడికుదురు మండలం నగరం చేరుకొని ఘటనాప్రాంతాన్ని పరిశీలించారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో ఏర్పడిన గొయ్యిని పరిశీలించారు. కాలిబూడిదైన పంటపొలాలు, కొబ్బరి చెట్లను పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును స్థానికులు, ప్రత్యక్షసాక్షులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు రాయుడు జనార్దనరావు, బొలిశెట్టి భగవాన్, బండారు కాశి, రొక్కం రత్నాకర్ జగన్‌తో మాట్లాడారు. తెల్లవారుజామున పైపులైన్ జాయింట్ నుంచి గ్యాస్ లీకై దట్టమైన పొగమంచు మాదిరిగా కమ్ముకుందని, అదే సమయంలో సమీపంలోని హోటల్లోపొయ్యి వెలిగించడంతో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు క్షణాల్లో వ్యాపించాయని, తేరుకునే లోగానే అంతా అయిపోయిందని స్థానికులు జగన్‌కు వివరించారు. ఎవరికి వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయడం తప్ప ఏమీ చేయలేకపోయామని, తప్పించుకోలేని వారు సజీవదహనమైపోయారని, మరికొందరు కాలిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస రక్షణా చర్యలు పాటించకుండా తమ ప్రాణాలతో గెయిల్, ఓఎన్జీసీలు చెలగాటమాడుతున్నాయంటూ వారు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా ప్రాంతంలో లభ్యమవుతున్న గ్యాస్‌లో మాకు వాటా లేదు కానీ...ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యానికి మాత్రం మేము భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది’ అని వాపోయారు. ఆయిల్ కంపెనీలను ఇక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం జగన్ గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. మొండిగోడల మధ్యకు వెళ్లి వారిని ఓదార్చారు. ‘అసలేం జరిగింది? ఎంతమంది మృత్యువాతపడ్డారు? ఎంతమంది గాయపడ్డారు?’ అని అడిగి తెలుసుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితి, ఏ పనిచేస్తుంటారు వంటి విషయాలను కూడా ఆరా తీశారు. బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నప్పుడు జగన్ చలించిపోయారు. కొండంత ధైర్యం వచ్చింది.. గటిగంటి శ్రీనివాసరావుతో పాటు అతడి కుటుంబంలోని ఐదుగురు సభ్యులు మృత్యువాత పడగా ఒంటరిగా మిగిలిన అతడి మామ చిలువూరి వెంకట్రావును జగన్ తొలుత పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడు గటిగంటి మధుకృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విజయవాడ దగ్గర పెనుమలూరులో హోటల్ నిర్వహించుకుంటూ జీవనం పొందుతున్నామని, బంధువుల ఇంటికి వచ్చి తన భర్త మృత్యువాత పడ్డాడని మధు భార్య ధనలక్ష్మి విలపించింది. ఐదేళ్ల కుమార్తె రూపిత, అత్త సత్యవతి, మామ సాంబమూర్తిలను చూసుకోవలసిన బాధ్యత తనపైనే ఉందని, ఆదుకోవాలని మొరపెట్టుకుంది.. తనకు కనీసం ప్రభుత్వ ఉద్యోగమైనా ఇప్పించాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రాన్ని అందజేసింది. మరో కుటుంబానికి చెందిన వానరాసి శ్రీరామలక్ష్మి, వానరాసి ఆదినారాయణ, నరసింహమూర్తి మృతి చెందగావారి బంధువులైన త్రిమూర్తులు, అమ్మాజీ, సుబ్బారావు, భగవాన్‌లను జగన్ పరామర్శించారు. ‘ఇళ్లన్నీ కాలిబూడిదైపోయాయి. ఇంట్లోనే కుప్పకూలి మా వారు సజీవ దహనమయ్యారు. వచ్చి చూడమని ఎంత బ్రతిమలాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. మీరు ఏకంగా మా మొండి గోడల మధ్యకు వచ్చి మమ్మల్ని పరామర్శిస్తుంటే కొండంత ధైర్యం వచ్చినట్టయ్యింది’ అని అమ్మాజీ జగన్ చేతులు పట్టుకొని కన్నీరుమున్నీరైంది. మా తరఫున అసెంబ్లీలో పోరాటం చేయాలని త్రిమూర్తులు జగన్‌ను కోరాడు. కాలగా మిగిలిన శిథిలాలతో, మంటలను ఆర్పిన అనంతరం బురదబురదగా మారిన ఇళ్లకు జగన్ స్వయంగా వెళ్లారు. ఆ గ్రామంలో దాదాపు రెండుగంటలు ఉండి విస్ఫోటం సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించి, చలించిపోయారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ జగన్‌ను కలిసి దుర్ఘటనకు కారకులైన గెయిల్ అధికారులపై హత్య కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని కోరారు. ఆదుకునేలా చూస్తాం అనంతరం జగన్ అమలాపురం చేరుకుని అక్కడి కిమ్స్ ఆస్పత్రిలో, ఆ తర్వాత కాకినాడ చేరుకొని అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. రోగులను పలకరించి ‘ధైర్యంగా ఉండండి.. త్వరలోనే కోలుకుంటారు.. మీకు అండగా నేను ఉంటా’నంటూ వారి నుదుటిపై చేయి వేస్తూ ధైర్యం చెప్పారు. కొంతమంది క్షతగాత్రులు జగన్‌ను చూడగానే కన్నీరుమున్నీరయ్యారు. అమలాపురం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న వానరాసి దుర్గ జగన్‌ను చూడగానే ‘కాలిన గాయాల బాధలు భరించలేకపోతున్నా. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె నుదుటిపై జగన్ చేయివేసి ‘ధైర్యంగా ఉండమ్మా’ అని చెప్పారు. మరో క్షతగాత్రురాలు రేకపల్లి సత్యవతి జగన్ రెండు చేతులు పట్టుకుని కన్నీరు పెట్టుకుంది. ‘ఏడాది కిందట నా కొడుకు ప్రమాదంలో పోయాడు. ఇప్పుడు మా కుటుంబానికి చెందిన ఆరుగురు మంటల్లో కాలిపోయి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మమ్మల్ని ఆదుకోవా’లంటూ రెండు చేతులు జోడించి వేడుకుంది. ప్రభుత్వపరంగా సహాయం అందేలా పోరాటం చేస్తామని, బాధితులకు అండగా ఉంటానని జగన్ ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యసేవలు అందించండి.. కాకినాడ అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని జగన్ పరామర్శించారు. క్షతగాత్రులతో పాటు వారి కుటుంబ సభ్యుల కన్నీటితో జరిగిన దుర్ఘటన ను వివరించారు. తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా సహాయం అందేలా పోరాడుతూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అపోలో ఏఓ రంజిత్‌రెడ్డి, ట్రస్ట్ ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్ కల్యాణ్ చక్రవర్తి, కిమ్స్ ఎండీ, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, సూపరింటెండెంట్ వెంకట్రావులను కోరారు. మెడికల్ రికార్డులు నమోదు చేయాలని, అంగవైకల్యం పొందితే పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అమల్లో ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జారీ చేయాలని జగన్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ర్ట కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు చలమలశెట్టి సునీల్, బొడ్డు అనంత వెంకటరమణచౌదరి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, అల్లూరు కృష్ణంరాజు, కాకినాడ, రాజమండ్రి సిటీల అధ్యక్షులు ఆర్‌వీజేఆర్ కుమార్, బొమ్మన రాజ్‌కుమార్. కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, బొంతు రాజేశ్వరరావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ర్ట సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, అనుబంధ కమిటీల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, శెట్టిబత్తుల రాజబాబు, మంతెన రవిరాజు, పంపన రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, నలమాటి లంకరాజు. పార్టీ రాష్ర్ట యూత్, మహిళా, రైతువిభాగం కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, వసుంధర, జక్కంపూడితాతాజీ, జిల్లా అధికార ప్రతినిధులు పికె రావు,కొమ్మిశెట్టి బాలకృష్ణ, పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, గుర్రం గౌతమ్, విప్పర్తి వేణుగోపాలరావు, మిండగుదిటి మోహన్, కొవ్వూరి త్రినాధరెడ్డి, ఆర్వి సత్యనారాయణ చౌదరి, సంగిశెట్టి అశోక్, సిరిపురపు శ్రీనివాసరావు, వట్టికూటి రాజశేఖర్ పాల్గొన్నారు. -
నేడు ఘటనాస్ధలానికి జగన్ రాక
-
నేడు జగన్ రాక
- నగరంలో పేలుడు ప్రాంతం సందర్శన - కాకినాడ, అమలాపురంలలో - క్షతగాత్రులకు పరామర్శ సాక్షి, కాకినాడ : నగరం పైపులైన్ పేలుడులో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, రాష్ర్ట ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మధురపూడి చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో కాకినాడ చేరుకుని, అక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం అమలాపురం చేరుకొని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి నగరం గ్రామం చేరుకొని పైపులైన్ పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించి పేలుడులో దుర్మరణం పాలైన వారి కుటుంబాలను పరామర్శిస్తారు.