ఇది శిశుపాలుడిలాంటి సర్కారు | Pushkarni bath student dead family;s YS Jagan Mohan Reddy visitation | Sakshi
Sakshi News home page

ఇది శిశుపాలుడిలాంటి సర్కారు

Published Fri, Aug 19 2016 2:17 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

ఇది శిశుపాలుడిలాంటి సర్కారు - Sakshi

ఇది శిశుపాలుడిలాంటి సర్కారు

నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
శిశుపాలుడిలా 100 తప్పులు చేస్తోంది.. దేవుడు క్షమించడు
పుష్కర స్నానాలకు వెళ్లి విద్యార్థులు చనిపోతే..
ఈతకెళ్లి మృతి చెందారనడం దుర్మార్గం
విద్యార్థుల మృతికి ఇసుక మాఫియానే ప్రధాన కారణం
వారి మరణాలకు చంద్రబాబు బాధ్యత వహించాలి
ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల సహాయం అందించాలి
బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్

 సాక్షి ప్రతినిధి, అమరావతి/వీరులపాడు : పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం..  ఈతకెళ్లి మృత్యువాతపడ్డారంటూ దుర్మార్గంగా మాట్లాడుతోంది... ఇంతకంటే దుర్మార్గపు చర్య మరొకటి ఉంటుందా? అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం శిశుపాలుడిలా 100 తప్పులు చేస్తోందని, ఆ తర్వాత దేవుడు కూడా క్షమించడని నిప్పులు చెరిగారు. ఇసుక మాఫియాను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబే విద్యార్థుల మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

కృష్ణా పుష్కర స్నానాలకు వెళ్లి చనిపోయిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను ఆయన గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... పుష్కర స్నానాలకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి చెందటం బాధాకరమన్నారు. చందర్లపాడు మండలం ఏటూరు ఘాట్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్నానాలకు వచ్చే భక్తులకు పులిహోర పంపిణీ చేసిన అధికార పార్టీ నేతలు.. విద్యార్థులు చనిపోయిన తర్వాత ఏటూరు ఘాట్ అనధికారికమని మాట మార్చారని విమర్శించారు.

అక్కడ ఘాట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే, నాయకుల స్వాగత ఫ్లెక్సీలు ఉన్నాయని, పుష్కర స్నానాలు చేస్తున్న వార్తా కథనాలు ఈనాడు పత్రికలోనూ వచ్చాయని చెబుతూ.. పత్రిక క్లిప్పింగ్ చూపించారు. ‘అసలు నా కుమారునికి ఈత కొట్టటమే రాదు. విధి ఆడిన వింత నాటకంలో అనాథలుగా మిగిలాం’ అని నగేష్ తండ్రి రాజగోపాలాచారి బోరున విలపించడం కలిచివేసిందని చెప్పారు. పుష్కరాల పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి, బినామీలకు నామినేషన్ మీద పనులు అప్పగించి అందినకాడికి దోచుకున్నారని ఆయన విమర్శించారు.

 ఇసుక మాఫియానే మింగేసింది
మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అసత్య ప్రచారాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతికి ప్రభుత్వం ప్రోత్సహించిన ఇసుక మాఫియానే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. అధికార పార్టీ నాయకులు నిబంధనలను ఉల్లంఘించి నదిలో సుమారు 50 అడుగుల లోతు వరకు ఇసుక తోడి గుంతలు చేశారని చెప్పారు. ఈ విషయం తెలియని విద్యార్థులు నదిలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల సహాయం అందించిన విధంగా కృష్ణా పుష్కరాలలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కూడా రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

 చేతులు దులుపుకున్న ప్రభుత్వం
మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్నానని తెలుసుకుని అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హడావిడిగా మృతుల కుటుంబాలను పరామర్శించి రూ.3  లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారని జగన్ విమర్శించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

 యూనిఫాం నిబంధన లేకుంటే బతికేవాడు
చెరువుకొమ్ము పాలెం(నందిగామ): డిగ్రీ కాలేజీలో యూనిఫాం నిబంధన లేకుంటే తన అన్న బతికేవాడని పాశం గోపిరెడ్డి చెల్లెలు శ్రావణి జగన్ వద్ద వాపోయింది. నందిగామ మండలం చెరువుకొమ్ముపాలెంలో గోపిరెడ్డి తల్లిదండ్రులను వారింటికి వెళ్లి జగన్ పరామర్శించారు. యూనిఫాం తప్పకుండా ధరించాలనే నిబంధన లేకుంటే.. తన అన్న గోపిరెడ్డి పుష్కర స్నానానికి వెళ్లేవాడు కాదని శ్రావణి ఈ సందర్భంగా చెప్పింది. పుష్కరాలు వచ్చి తమ ఇంట్లో విషాదం తెచ్చిపెట్టాయని గోపిరెడ్డి తల్లిదండ్రులు వెంకటేశ్వరరెడ్డి, రజని కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని జగన్ ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని హామీఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది
జయంతి (వీరులపాడు)/ తోటరావులపాడు(చందర్లపాడు): పుష్కర స్నానాల్లో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. తమను ఓదార్చడానికి వచ్చిన జగన్‌ను చూడగానే నగేష్  తల్లిదండ్రులు రాజ గోపాలచారి, దుర్గారాణి, సోదరి స్రవంతి కన్నీటి పర్యంతమయ్యారు. ‘వైఎస్ అన్నా, మీరన్నా నగేష్‌కు ఎంతో అభిమానం. జగనన్నను ఒక్కసారైనా కలవాలని అంటుండేవాడు. చివరకు నగేష్ మృతి చెందితే మమ్మలను పరామర్శించటానికి వచ్చావా అన్నా’ అంటూ గుండెలవిసేలా రోదించారు. ‘రోజుటి మాదిరిగానే ఆ రోజు కూడా కళాశాలకు వెళుతున్నాని చెప్పి వెళ్లాడు.

యూనిఫాం వేసుకురాలేదని యాజమాన్యం బయటకు పంపటంతో 11 మంది స్నేహితులుతో కలిసి పుష్కర స్నానానికి వెళ్లినట్లు తెలిసింది. నా కుమారుడు పుష్కర స్నానానికి వెళ్లి మృతి చెందితే ఈతకు వెళ్లి మృతి చెందాడని ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నా కుమారునికి ఈత కొట్టటమే రాదు’ అంటూ బోరున విలపించారు. కుటుంబానికి అండగా ఉంటామని నగేష్ తల్లిదండ్రులను ఓదార్చి.. చమర్చిన కళ్లతో జగన్ వెనుదిరిగారు. అనంతరం  పుష్కరస్నానానికి వెళ్లి మృతి చెందిన ములకలపల్లి హరీష్ కుటుంబ సభ్యులను చందర్లపాడు మండ లం తోటరావులపాడు గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మృతుడు హరీష్ తండ్రి ముకుందరావు, తల్లి చిట్టెమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. న్యాయం జరిగేవరకూ అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement