కలిచెర్లకు జగన్ పరామర్శ
పంజగుట్ట: కర్నూలు వద్ద మూడు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. నిమ్స్ మిలీనియం బ్లాక్ 124 రూంలో చికిత్స పొందుతున్న ఆయనను జగన్ పరామర్శించి ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
కలిచెర్లకు నిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రూపమ్ వైద్యం అందిస్తున్నారు. నిమ్స్‌కు వచ్చిన జగన్‌ను చూసేందుకు రోగుల బంధువులు పోటీ పడ్డారు. నల్లగొండ జిల్లా మోత్కూర్‌కు చెందిన పార్వతమ్మ జగన్ వద్దకు వచ్చి తన కొడుకు నరేష్ గుండె జబ్బుతో బాధపడుతున్నాడని చెప్పడంతో జగన్ అక్కడ ఉన్న జూనియర్ వైద్యులకు డా.శేషగిరిరావుతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.