రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆదివారం ఓదార్పు యాత్ర చేపట్టారు. తమ అమ్మ కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించారు. 34 కుటుంబాల ఇళ్ల వద్దకు వెళ్లి, మృతి చెందిన వారి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
సాక్షి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో రాష్ట్రంలో ఆందోళనలు రాజుకున్న విషయం తెలిసిందే. అలాగే, టీవీల్లో ఆ సమాచారం విన్న వారు పదుల సంఖ్యలో గుండె పోటుతో మరణించారు. మరెందరో కార్యకర్తలు ఆత్మహత్య, ఆత్మాహుతి బాట పట్టారు. ఇలా మొత్తం 219 మంది మరణించినట్టు అన్నాడీఎంకే వర్గాల లెక్కల్లో తేలింది. తన కోసం ప్రాణాలు వదిలిన వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు జయలలిత నిర్ణయించారు. బెయిల్ మీద బయటకు రాగానే, ఆ మృతులకు సంతాపం తెలియజేశారు. ఆ కుటుంబాల్ని ఓదార్చేందుకు నిర్ణయించారు. మృతుల కుటుంబాలకు తలా రూ.3 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాలను ఆయా కుటుంబాలకు అందజేయడం లక్ష్యంగా శనివారం శ్రీకారం చుట్టారు. తొలి రోజు ఆయా నియోజకవర్గాల పరిధుల్లో ఈ సాయం పంపిణీ సాగింది. ఆదివారం సెలవు దినం కావడంతో మంత్రులందరూ ఓదార్పు బాట పట్టారు.
ఆదివారం మంత్రులందరూ తమ తమ నియోజక వర్గాలకు చేరుకున్నారు. ఉదయం నుంచి తమ తమ జిల్లాల పరిధుల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మృతుల కుటుంబాల్ని ఓదార్చే పనిలో పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓదార్పుతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బిబీబిజీ అయ్యారు. ఆయా మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి, తమ సానుభూతి తెలియజేశారు. సీఎం జయలలిత సంతాపం తెలిపినట్టుగా వారికి కరపత్రాలను అందించినానంతరం రూ.3 లక్షలకు గాను చెక్కులను అందజేశారు. మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, సెంథిల్ బాలాజీ, బీవీ రమణ, చిన్నయ్య, గోకుల ఇందిర, వలర్మతి తదితరులు ఓదార్పులో నిమగ్నం అయ్యారు. మొత్తం 34 కుటుంబాలను ఓదార్చి జయలలిత ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించారు.
ఓదార్పులో మంత్రులు
Published Mon, Nov 3 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement