అబద్ధాలతోనే నడుస్తున్న ప్రభుత్వం
రైతు భరోసాయాత్రలో బాబుపై మండిపడ్డ వైఎస్ జగన్
సాక్షి, కడప: ‘‘ఎన్నికలకు ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడచూసినా ప్రచారం కోసం పాకులాడటం.. తర్వాత మాట తప్పడం ఆయనకు నైజంగా మారింది. ముఖ్యమంత్రిగా అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు.
పెద్దకుడాల, తాటిమాకులపల్లె, ముద్దప్పగారిపల్లె, ఎర్రగుడి తదితర గ్రామాల్లో మహిళలు, వృద్ధులు పింఛన్లతోపాటు డ్వాక్రా రుణమాఫీ సక్రమంగా అమలుచేయలేదని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. చివరకు పంట రుణాలు కూడా సక్రమంగా మాఫీ చేయలేదనడంతో ఘాటుగా స్పందించారు. రుణమాఫీ, డ్వాక్రామాఫీ జరగలేదని.. చివరకు పండుటాకులకు అందించే పింఛన్ల విషయంలో కూడా కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదని మండిపడ్డారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. టీడీపీ నేతలకు మాత్రం చంద్రబాబు కావాల్సినంత దోచిపెడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఉన్నారు.
రెండు కుటుంబాలకు పరామర్శ
వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాక.. ఉన్న పొలాలను అమ్ముతున్నా అప్పులు తీరక.. మానసిక వేదనతో బలవన్మరణం చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. ముందుగా లింగాల మండలంలోని పెద్దకుడాల గ్రామానికి వెళ్లి రైతు మంజుల చలపతి కుటుంబసభ్యులను , అనంతరం చక్రాయపేట మండలంలోని ముద్దప్పగారిపల్లెకు చెందిన రైతు శుద్ధమల్ల చెన్నారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.