Babu - Ramoji : బిల్లీ కేసులో కళ్లు మూసుకున్న పిల్లి | Chandrababu, Ramoji double standards in Billy Case | Sakshi
Sakshi News home page

Babu - Ramoji : బిల్లీ కేసులో కళ్లు మూసుకున్న పిల్లి

Published Thu, Mar 7 2024 5:28 PM | Last Updated on Fri, Mar 8 2024 1:56 PM

Chandrababu, Ramoji double standards in Billy Case - Sakshi

బిల్లీ.. బాబు.. కథలో బోలెడు లింకులు

తెలంగాణ హైకోర్టులో చంద్రబాబుకు 850 మొట్టి కాయలు

కోర్టు తీర్పు నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం

చంద్రబాబును సుద్దపూసగా చూపించే కుయుక్తి

మోసాల చంద్రబాబునీ, ఆయన మీసాలొత్తే రామోజీరావును ఎన్ని ఏనుగులను కట్టీ విడదీయలేం. నీతిమాలిన అవిభాజ్య కవలలు వాళ్లిద్దరూ! కుటిల రాజకీయాల అవిభక్త కుటుంబ వ్యాపారం వాళ్లిద్దరిదీ చంద్రబాబుపై ఎవరైనా కేసు వేస్తే.. కే సు వేసినవాళ్లే దొంగలు, దోషులు అని నిస్సిగ్గుగా ఒంటిమీద రాసుకుని తిరుగుతారు రామోజీ. చంద్రబాబు ‘దోషి’ అని స్వయంగా కోర్టే తీర్పు ఇచ్చినా.. కోర్టును తప్పుదారి పట్టించారని కూడా అసత్యాలను ప్రచారం చేయగలరు రామోజీ!

‘‘850 ఎకరాల స్కామ్‌లో చంద్రబాబుకు హైకోర్టు షాక్‌’’ అన్నది తాజా వార్త.

‘‘చంద్రుడిపై స్కామ్‌ మచ్చ’’ అనేది రామోజీ పెట్టే తిరగమోత!

బాబుపై ఈగను వాలనివ్వని రామోజీ.. ఇంగితం లాంటి అంగీనైనా జారవిడుచుకుంటాడు కానీ.. కోర్టు షాకిచ్చిందంటే ఒప్పకుంటాడా? బాబుని సమర్థించటం మానుకుంటాడా?

విషయం ఏంటంటే.?

చంద్రబాబు తన హయాంలో ఒక సంస్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన కోర్టు తీర్పొకటి 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నేడు (2024 మార్చి 7) వెలువడింది. 2004 మే నెలకు ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను ఈ తీర్పులో తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ కేటాయింపులను రద్దు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – 2003లో బిల్లీ రావు అనే వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ఐఎంజీ  భారత్‌ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు 2004లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే 850 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచవకగా కేటాయించారు.

ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమ భూ కేటాయింపులను గుర్తించిన వైఎస్సార్‌ ప్రభుత్వం 2006లో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో బిల్లీ రావు ఈ రద్దును సవాల్‌ చేస్తూ కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ జరుగుతూ వచ్చింది.

తాజాగా చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఈ కేసు విషయమై తీర్పునిచ్చింది. వైఎస్సార్‌ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్ ను కొట్టేసింది. ఏకపక్షంగా భూ కేటాయింపులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది.

విపరీతం ఏంటంటే.?

చంద్రబాబు కొమ్ము కాస్తున్న రామోజీరావుకు ఇదొక వార్తగా కనిపించకపోవటం! ఆ స్థానంలో అదే కోర్టు ఇచ్చిన ఇంకో వార్తతో చంద్రబాబు స్కామ్‌ నుంచి తెలుగు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు రామోజీ! ‘‘ఎమ్మెల్సీల నియామకంలో ప్రభుత్వానికి చుక్కెదురు’’ అనేదే ఆ వార్త. సరే, చంద్రబాబు గురించీ, రామోజీ గురించి, వారిద్దరి మధ్య ఉన్న బలీయమైన అనుబంధం గురించి తెలియంది ఎవరికి? కనుక బాబు గారికీ, బిల్లీ రావుగారికి మధ్య ఉన్న బాంధవ్యం ఏమిటో కాస్త ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లి చూద్దాం.

1995 ఏపీ రాజకీయాల్లోని ముఖ్య ఘట్టం.. మామ గారికి అల్లుడు గారు పొడిచిన వెన్నుపోటు. ఆ సమయంలో చంద్రబాబుకు పరిచయమైన వ్యక్తే బిల్లీ రావు. ఉరఫ్‌ అహోబిల రావు. ఎన్టీఆర్‌ గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు చేసిన పని.. బిల్లీకి ‘కుప్పం’ ప్రాజెక్టును కట్టబెట్టటం!

బిల్లీది కృష్ణా జిల్లాలోని కొండపల్లి. మద్రాస్‌ ఐఐటీలో చదివారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లారు. అమెరికా చదువు పూర్తవగానే తిరిగి ఇండియా వచ్చేశారు. బిల్లీ రావుకు తెలియంది లేదు అన్నట్లే ఉంటాయి ఆయన మాటలు. 1995లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే, సరిగ్గా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్న సమయంలోనే బాబుకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి బంధం బలపడుతూ వచ్చింది. వివిధ దేశాల్లో విస్త్రృతంగా పర్యటించటం, పెద్దపెద్ద వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం బిల్లీ హాబీ. ఇదే క్రమంలో ఈయనకు ఫ్లోరిడాలోని ఐఎంజీ యాజమాన్యమైన మార్క్‌ కుటుంబంతో సంబంధాలున్న ఆండ్రూక్రీగర్‌ పరిచయమయ్యాడు.

బాబుకు క్రీగర్‌ను పరిచయం చేసి... ఆయన్ను ఐఎంజీబీ (ఇండియా) కంపెనీకి నామమాత్రపు చైర్మన్ గా చేసి... బాబు– బిల్లీ ఇద్దరూ చక్రం తిప్పారు. ఐఎంజీబీకి భూములు దక్కాక... క్రీగర్‌ను నేరస్తుడనే ముద్ర వేసి కంపెనీ నుంచి తొలగించటంతో ఆయన బిల్లీపై హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో కేసు కూడా వేశారు. కానీ బిల్లీ–బాబుల బంధం, బలం తెలిశాక తప్పుకున్నారు.

ఇజ్రాయెల్‌ పేరిట కుప్పంలోను, అమెరికా పేరిట ఐఎంజీని సృష్టించి హైదరాబాద్‌లోను వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి పథకం వేసిన వారు చంద్రబాబు–బిల్లీ రావు. కేబినెట్‌ అనుమతి లేకుండా... అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీకి భూములు కట్టబెట్టిన చంద్రబాబును నేడు కోర్టు తప్పు పట్టిందంటే పట్టదా? అయినా గానీ రామోజీకి చీమ కుట్టినట్లయినా ఉండదా?!

తప్పించుకున్న సీబీఐ!

ఐఎంజీ కుంభకోణం బయటపడ్డాక.. ఒప్పందాన్ని రద్దు చేసిన వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం.. 2007లో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జీవో విడుదల చేసింది. కానీ సీబీఐ మాత్రం దీనిపై దర్యాప్తు జరపడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు! చంద్రబాబును దోషిగా రుజువు చేసేందుకు సకల సాక్ష్యాలూ కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఆయన్ను విచారించడానికి గానీ, అరెస్టు చెయ్యటానికి గానీ సీబీఐ ముందుకెళ్లలేదు. ‘‘మా దగ్గర తగినంత సిబ్బంది లేరు. తగిన వనరులు లేవు. అందుకని దర్యాప్తు జరపలేం’’ అని ప్రభుత్వానికి సమాధానమిచ్చి తప్పించుకుంది.

విచిత్రమేంటంటే... అప్పుడు కూడా రాష్ట్రంలో సీబీఐ ఇంఛార్జిగా ఉన్నది  జగన్‌ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన వి.వి.లక్ష్మీనారాయణే!. అసలు ఆయనకు బాబుపై ఎందుకు అంత ప్రేమ? నేరం స్పష్టంగా కనిపిస్తున్నా... దొంగలెవరో ఆధారాలతో సహా తేలినా పట్టుకోవటానికి ఎందుకు తాత్సారం చేశారు? సమాధానం లేని ప్రశ్నలైతే కావు. తగిన వనరులు లేవన్న కారణంతో విచారణ జరపలేమని చెప్పటం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? దొంగల్ని పట్టుకోవటానికి పోలీసులు లేరంటే... ఈ వ్యవస్థెందుకు? ఈ దర్యాప్తు సంస్థలెందుకు?

కుప్పం ప్రాజెక్టు కథేంటి?!

బిల్లీకి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో... ఇజ్రాయెల్‌ టెక్నాలజీ ప్రాజెక్టును మొదట అప్పగించారు. అది ఘోరంగా విఫలం అయింది. కుప్పంలో 9,572 ఎకరాల్లో ఇజ్రాయెల్‌ తరహా సేద్యాన్ని అమలు చేసి... రెండోదశలో రంగారెడ్డి జిల్లాలో అమలు చేసి... ఆ తర్వాత దాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించాలని 1997లో చంద్రబాబు ప్రభుత్వం  నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను బిల్లీ, ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్‌ ప్యాట్‌రావుకు చెందిన ‘బీహెచ్‌సీ ఆగ్రో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు అప్పగించేశారు చంద్రబాబు.

సేద్యంలో ఇజ్రాయెల్‌ తరహా విప్లవాన్ని తెస్తామని, ఆకాశాన్ని కిందికి దించుతామని రకరకాల డప్పులు వాయించింది ఈ కంపెనీ. ఆ డప్పుల చప్పుడును రాష్ట్రమంతటికీ వినిపించేలా – రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోబోతోందంటూ – ఊదరగొట్టించేశారు రామోజీరావు. కానీ కుప్పంలో మాత్రం పరిస్థితి అడ్డం తిరిగింది. ఆ ప్రాజెక్టుకు రూ.19 కోట్లు ఖర్చుచేశారు. దీన్లో కొంత టెక్నాలజీకి, కొంత మౌలిక సదుపాయాలకు, మరికొంత యంత్రాలకు అంటూ మొత్తం బిల్లీ చేతిలో పోసేశారు. ప్రాజెక్టు కోసమని రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూముల్లో సరిహద్దులను మళ్లీ గుర్తించలేనంతగా చెరిపేశారు.

మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడేశారు. దాంతో చుట్టుపక్కల భూముల్లో కూడా భూసారం నాశనమైపోయింది. చుట్టుపక్కల రైతులు అప్పటిదాకా 200 అడుగుల బోర్లు వేస్తే... ఈ భూముల్లో ఏకంగా 600 అడుగుల లోతున బోర్లు వేయవలసి వచ్చింది. దీంతో చుట్టూ ఉన్న బోర్లు ఎండిపోయి రైతులు బోరుమన్నారు. ఎకరానికి రూ.30,000– 50,000 వరకూ ఫలసాయం అందిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసినా... ఎకరాకు రూ.3 నుంచి 5 వేలు కూడా దిగుబడి సాధించలేకపోయారు.

ఈ వైఫల్యాల గురించి కూడా రామోజీరావు ఒక్క మాటా రాయలేదు! ఆయన నాడూ అంతే, ఈనాడూ అంతే.. ఏనాడూ అంతే. బిల్లీ, బాబుల ఆలింగనం కంటే కూడా గాఢమైనది రామోజీ, చంద్రబాబుల పరిష్వంగనం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement