అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం | ys jaganmohan reddy visits formers family's | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

Published Fri, Jul 8 2016 3:39 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం - Sakshi

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

రైతు కుటుంబాలను పరామర్శించిన ప్రతిపక్షనేత
క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
పెద్దకుడాలలో గంగమ్మకు పూజలు.. మసీదులో ప్రార్థనలు

ఆత్మీయ పలకరింపులు

ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దారి పొడవునా మహిళలు, వృద్ధులు, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ముద్దప్పగారిపల్లె, ఎర్రగుడి, పెద్దకుడాల, పులివెందుల, తాటిమాకులపల్లె, వేంపల్లె ఇలా అన్నిచోట్ల కాన్వాయ్‌ను ఆపుతూ ప్రజలతో కరచాలనం చేస్తూ ఆయన ముందుకు సాగారు. అంతకమునుపు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో కూడా ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రజలతో మమేకమయ్యారు. కార్యకర్తలను పేరు పేరునా పలకరించారు.

సాక్షి కడప : ‘ఎన్నో కష్టాలు వస్తుంటాయి.. మానవ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొవాలి.. వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని.. జీవితం నుంచి తప్పుకోవడం సమస్యకు పరిష్కారం కాదు.. ఎన్ని ఆటంకాలు వచ్చినా.. ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళితే విజయం సిద్ధిస్తుంది. కుటుంబపెద్ద లేరని అధైర్యపడొద్దని, బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది’ అని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. గురువారం ఆయన రైతుభరోసా యాత్రలో భాగంగా లింగాల, చక్రాయపేట మండలాల్లో మూడు రైతు కుటుంబాలను పరామర్శించారు.

ప్రస్తుత టీడీపీ సర్కార్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకొనే పరిస్థితిలో లేదని, చివరకు చనిపోయిన వారి కుటుంబాలకు కూడా పూర్తిస్థాయిలో పరిహారం అందించకుండా వేషాలు వేస్తోందని దుమ్మెత్తిపోశారు. అధికారులు కూడా చనిపోయిన రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించలేదంటే ప్రభుత్వం ఎలా నిద్రపోతోందో అర్థం చేసుకోవాలన్నారు. భవిష్యత్‌లో మంచి రోజులు వస్తాయని.. అంతవరకు వేచి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అందరం కలిసి ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వివరించారు.

పలు కుటుంబాలకు పరామర్శ

లింగాల మండలం పెద్దకుడాల, చక్రాయపేట మండలం ముద్దప్పగారిపల్లె గ్రామాల్లో  ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతులు మంజుల చలపతి, శుద్దమల్ల చెన్నారెడ్డి కుటుంబాలను ప్రతిపక్షనేత పరామర్శిం చారు. రైతు భరోసాయాత్రలో భాగంగా వారి ఇళ్లకు వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. ముందుగా చనిపోయిన రైతుల చిత్రపటాలతోపాటు వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తాటిమాకులపల్లెలో ఇటీవలే మృతిచెందిన చిన్నరామిరెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్‌రెడ్డి పరామర్శించారు. ప్రత్యేకంగా చిన్నరామిరెడ్డి భార్య గంగమ్మ, కొడుకు జయరామిరెడ్డిలు వైఎస్ జగన్‌ను చూడగానే కంటితడి పెట్టగా.. వారిని ఓదార్చారు.

 గంగమ్మకు పూజలు.. మసీదులో ప్రార్థనలు
పెద్దకుడాలలో ముందుగా వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి భారీగా తరలివచ్చిన జనాలందరికీ అభివాదం చేశారు. అనంతరం సమీపంలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంకాయ కొట్టి హారతి తీసుకున్నారు. అనంతరం రంజాన్ పండగను పురష్కరించుకొని మసీదుకు వెళ్లి ముస్లింలతో కలిసి ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం అందరినీ ఆలింగనం చేసుకున్నారు. ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

 తాటిమాకులపల్లెలో కాసేపు
వేంపల్లె మండలం తాటిమాకులపల్లెలో గురువారం సాయంత్రం పలు కార్యక్రమాలలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. దివంగత కృష్ణారెడ్డి కుమార్తె, మోహన్‌రెడ్డి సోదరి పేర్ల భార్గవి, శ్రావణ్‌కుమార్‌రెడ్డిల వివాహం ఇటీవలే జరిగిన నేపథ్యంలో వారి ఇంటికి వెళ్లి జంటను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లుగా ఉండా లని ఆకాంక్షించారు. అనంతరం గ్రామ మాజీ డీలర్ శేఖర్‌రెడ్డి ఇంటికి కూడా మర్యాదపూర్వకంగా వెళ్లి కలిసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.

 వైఎస్ జగన్‌ను కలిసిన జెడ్పీటీసీ సభ్యులు
పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో పలువురు జెడ్పీటీసీలు వైఎస్‌జగన్‌ను కలిసి చర్చించారు. ప్రధానంగా జడ్పీ చైర్మన్ గూడూరు రవి, వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలతోపాటు లింగాల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కొండారెడ్డి, జెడ్పీటీసీలు అబ్బిగారి వీరారెడ్డి, మరకా కృష్ణారెడ్డి, వెంగముని, బాలనరసింహారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు చీర్ల సురేష్‌యాదవ్, యదుభూషణ్‌రెడ్డి, కంచంరెడ్డి, ఆనంద్‌రెడ్డి తదితరులతో చర్చించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు. అనంతరం త్వరలో జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలని వైఎస్ జగన్‌ను వారంతా కోరారు. అంతకముందు మాజీ డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి వచ్చి వైఎస్ జగన్‌ను కలిశారు.

 జమ్మలమడుగులో సైనికుల్లా దూసుకెళ్లండి
జమ్మలమడుగు నియోజకవర్గంలో గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ కలిసి చంద్రబాబు మోసం చేసిన విధానాన్ని వివరించాలని నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డిని వైఎస్ జగన్ ఆదేశించారు. జమ్మలమడుగులో ప్రజలంతా మనవైపే ఉన్నారని.. గడప గడప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు పది వాహనాల్లో వచ్చి జమ్మలమడుగు, పెద్దముడియం, ఇతర మండలాలకు చెందిన నేతలు కలిశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగులో సైనికుల్లా దూసుకెళ్లాలని కార్యకర్తలకు వైఎస్‌జగన్ సూచించారు. కార్యక్రమంలో జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్, రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, లింగాల ఎంపీపీ, మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పెద్దకుడాల కృష్ణారెడ్డి, కొండారెడ్డి, చక్రాయపేట జెడ్పీటీసీ సభ్యుడు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జమ్మలమడుగు హనుమంతురెడ్డి, వేముల సాంబశివారెడ్డి, వేల్పుల రాము, వేంపల్లె మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జిల్లా కార్యదర్శి సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

రాజన్నా.. మళ్లీ పుట్టాలన్నా..
పులివెందుల రూరల్ : దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి. వైఎస్‌ఆర్ 1949 జులై 8న వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. డాక్టర్‌గా వృత్తి చేపట్టి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగారు. వైఎస్‌ఆర్ ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడుగా చరిత్రలో నిలిచిపోయారు.

 ఆరోగ్య శ్రీతో బడుగు బలహీన వర్గాల్లో గూడు కట్టుకున్న వైఎస్‌ఆర్ : వైఎస్‌ఆర్ పాలనలో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడారు. దీంతో ప్రజలలో వైఎస్‌ఆర్ ప్రత్యేక స్థానం సాధించారు.

 నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగాయి. 2014 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం నియోజకవర్గంలో వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ఇడుపులపాయలలో ట్రిపుల్ ఐటీ, ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతుల అభున్నతి కోసం ఏపీ కార్ల్(ఆంధ్రప్రదేశ్ అత్యున్నతస్థాయి పశు పరిశోధన) కేంద్రం ఏర్పాటు, నియోజకవర్గ ప్రజల వినోదానికి శిల్పారామం, రాణితోపు పార్కు ఆధునికీకరణ,  రైతుల కోసం పీబీసీ కాలువ ఆధునికీకరణ, లింగాల కుడి కాలువ ఏర్పాటు, సూక్ష్మ సేద్యం ద్వారా లక్ష ఎకరాలకు నీరు అందించడానికి సంప్‌ల ఏర్పాటు, పైడిపాలెం ప్రాజెక్టు, లిఫ్ట్ ద్వారా నీటి తరలింపు, మున్సిపాలిటీ తాగునీటి కోసం నక్కలపల్లె ఎస్‌ఎస్ ట్యాంకు ఏర్పాటు, పులివెందుల మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అదేవిధంగా పులివెందుల చుట్టూ రింగ్ రోడ్డు, హాకీ అకాడమి, ఇండోర్ స్టేడియం, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ ఆధునికీకరణ, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి నిధులు విడుదల చేయడంతో శరవేగంగా పనులు సాగాయి.

 నేడు వాడవాడలా వైఎస్ జయంతి వేడుకలు : నియోజకవర్గంలో చెరగని ముద్ర వేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 68వ జయంతిని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. దివంగత నేత వైఎస్‌ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం, అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీతోపాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

వైఎస్‌ఆర్ జయంతికి ఏర్పాట్లు పూర్తి
వేంపల్లె : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద పరిసర ప్రాంతాలలో బెంగుళూరు నుంచి తెప్పించిన పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధానంగా వైఎస్‌ఆర్ ఘాట్‌లో ఉన్న సమాధి ప్రాంగణం అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. వైఎస్‌ఆర్ 67వ జయంతి వేడుకలకు సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత నేత వైఎస్‌ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, కుటుంబ సభ్యులు గురువారం రాత్రికే ఇడుపులపాయకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 8.30గంటలకు వారు వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఆయనకు ఘన నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

 గడప గడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రతిపక్షనేత : ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనలో లోపాలను ఎండగట్టేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గడప గడపకు వైఎస్‌ఆర్‌సీపీ అనే కార్యక్రమానికి శుక్రవారం ఇడుపులపాయ నుంచే శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద ఉదయం 10గంటలకు ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.

 పులివెందుల్లో:  మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పట్టణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద వైఎస్‌ఆర్ విగ్రహాలను జెండాలు, తోరణాలతో అందంగా ముస్తాబుచేశారు. పట్టణంలోని ఆర్టీసీ సర్కిల్, కడపరోడ్డు రింగ్‌రోడ్డు సర్కిల్, కదిరి, పార్నపల్లె, ముద్దనూరు, ఉలిమెల్లరోడ్లలో ఉన్న మహానేత విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప పర్యవేక్షిస్తున్నారు.

జిల్లా అభివృద్ధిపై వైఎస్ చెరగని ముద్ర
కడప కార్పొరేషన్:  జిల్లా అభివృద్ధిపై  వైఎస్‌ఆర్ చెరగని ముద్ర వేశారు. రిమ్స్ హాస్పిటల్, రిమ్స్ మెడికల్ కళాశాల, దంత వైద్యశాల, నర్సింగ్ కళాశాల, నూతన కలెక్టరేట్, రోడ్ల విస్తరణ, బుగ్గవంక సుందరీకరణ, భూగర్భ డ్రైనేజీ ఇవి చాలు కడప నగరంలో వైఎస్‌ఆర్ చేసిన అభివృద్ధిని ప్రస్తావించడానికి. అయితే ఆయన మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు వివక్షను చూపుతుండడంతో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

  2001లో కడప నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రతిపక్షనేతగా ఇక్కడి ప్రజల అవస్థలు కళ్లారా చూసిన వైఎస్ తాను అధికారంలోకి రాగానే రూ.72 కోట్లతో బుగ్గవంక సుందరీకరణ పనులు మొదలుపెట్టి ఎస్వీ డిగ్రీ కళాశాల, బాలాజీనగర్, కాగితాల పెంట, వినాయకనగర్‌ల వద్ద హైలెవెల్ వంతెనలు పూర్తి చేయడంతోపాటు, భవిష్యత్తులో కడప వాసులు వరద ముప్పుకు గురికాకుండా బుగ్గవంకకు ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించారు. 

  కడప నగరంలో ఇరుకుగా ఉన్న అన్ని రోడ్లను విశాలంగా విస్తరింపజేసి, డివైడర్లు, పచ్చని మొక్కలు నాటడం ద్వారా నగరాన్ని సుందరంగా మార్చారు. కడప చుట్టూ రింగు రోడ్డు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు.

  కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రమించారు.  పెచ్చులూడుతూ, వర్షాలకు ఉరుస్తున్న  పాత కలెక్టరేట్‌కు ప్రత్యామ్నాయంగా  కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి కృషి చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు, ఇతర ప్రభుత్వ సమావేశాలకు ఉపయోగపడే విధంగా అత్యంత ఆధునిక హంగులతో విశాలమైన సమావేశం మందిరం నిర్మించారు. అలాగే స్టేట్ గెస్ట్ హౌస్, ఆర్‌అండ్‌బి అతిథి గృహం, హరిత హోటళ్లను  కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేయించారు.

  మున్సిపాలిటీగా ఉన్న కడపను నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేసి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఎక్కువగా వచ్చేందుకు కృషి చేశారు. కడప నగరంలో రూ.70 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేయించారు.

  కడప, ప్రొద్దుటూరు నగర ప్రజలకు 24 గంటలు తాగునీరు ఇవ్వాలని సోమశిల బ్యాక్ వాటర్ స్కీం ప్రవేశపెట్టారు. రూ.450 కోట్లతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు పనులు కొంత మేరకు జరిగినప్పటికీ ఆయన మరణంతో పూర్తిగా ఆగిపోయాయి. నగర ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు రాజీవ్‌పార్కు, శిల్పారామం పార్కులు ఏర్పాటు చేశారు.

  రూ. 200కోట్లతో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) హాస్పిటల్, మెడికల్ కళాశాల, దంత కళాశాల, నర్సింగ్ కళాశాలలను అధునాతన హంగులతో నిర్మించారు.  యోగి వేమన విశ్వవిద్యాలయం, ట్రిపుల్ ఐటీ, అంతర్జాతీయ పశు పరిశోధన సంస్థ.. ఇలా ఎన్నింటినో జిల్లాకు అందించిన ఘనత వైఎస్‌కే దుక్కుతుంది.

 నిరుపేదల ఆత్మబంధువు..
కడప నగరంలోని నిరుపేదలకు వైఎస్ ఆత్మ బంధువనే చెప్పాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇళ్లస్థలాల కోసం కమ్యునిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు చేయని పోరాటాలు, ఉద్యమాలు లేవు.  అయితే వైఎస్ సీఎం అయ్యాక నగరంలోని పేద, మధ్య తర గతి ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి, ఇండ్లు నిర్మించారు. తద్వారా ఇందిరానగర్, ఉక్కాయపల్లె, చెర్లోపల్లి హౌసింగ్ కాలనీలుగా తయారయ్యాయి. ప్రజలకు అపార్ట్‌మెంట్ కల్చర్‌ను పరిచయం చేయడానికి  విమానాశ్రయం వద్ద శాటిలైట్ టౌన్‌షిప్, సెంట్రల్ జైలు సమీపంలో రాజీవ్ గృహకల్ప ఏర్పాటుకు కృషి చేశారు. ఇంత అభివృద్ధిని చేసిన వైఎస్‌ఆర్‌ను జనం దేవుడిలా కీర్తిస్తున్నారు.  

 క్రీడారంగానికి పెద్దపీట   రూ.18 కోట్లతో పాఠశాల ఏర్పాటు
రూ. 5 కోట్లతో వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియం
రూ. 50 లక్షల సొంత నిధులతో వైఎస్ రాజారెడ్డి క్రీడామైదానం ఏర్పాటు

 కడప స్పోర్ట్స్:  జిల్లాలో క్రీడారంగంపైనా వైఎస్ రాజశేఖరరెడ్డి తనదైన ముద్రను వేశారు. అప్పటి వరకు క్రీడాపరంగా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని జిల్లాలో 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే శరవేగంగా పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్‌కు మిగిలిన ఏకైక క్రీడాపాఠశాల ఆయన స్వహస్తాలతో ప్రారంభించినదే కావడం విశేషం.

 2006 డిసెంబర్ 30వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రాంతీయ క్రీడాపాఠశాలగా ప్రారంభమైన ఈ క్రీడాపాఠశాల 2011లో సొంత భవనాలు సమకూర్చుకోగా.. 2012 డిసెంబర్ 27న స్వయంప్రతిపత్తి హోదా పొందింది. వైఎస్‌ఆర్ హయాంలో క్రీడాపాఠశాల అభివృద్ధికి నిధుల వరద పారింది. రూ.18 కోట్లుతో అభివృద్ధి పనులు ప్రారంభించగా.. రూ. 7కోట్లతో తొలుత డార్మిటరీ, కిచెన్, స్విమ్మింగ్‌పూల్, క్వార్టర్స్ నిర్మాణాలు ప్రారంభించారు. అయితే తర్వాత పాలకులు పట్టించుకోక పోవడంతో వీటిలో కొన్ని నిర్మాణదశలోనే ఉన్నాయి.

 వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానం...
నగరంలో క్రికెట్ స్టేడియం ఉండాలని భావించిన వైఎస్‌ఆర్ అప్పట్లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వారితో సంప్రదించి సొంత నిధులను రూ.50 లక్షలు వారికి అందజేశారు. దీంతో వారు కడప నగరంలో క్రీడామైదానం ఏర్పాటుచేసేందుకు ముందుకు రావడంతో నగర వాసులకు చక్కటి క్రీడామైదానం అందుబాటులోకి వచ్చింది. ఈ మైదానంలో ఇప్పటికే పలువురు జాతీయస్థాయి క్రికెటర్లు విచ్చేసి తమ నైపుణ్యంతో నగర ప్రజలను కనువిందు చేశారు.

ఒకేసారి రూ. లక్ష రుణమాఫీ అయింది
మాది కడప నగర పరిధిలోని మోడమీదిపల్లె. నాకున్న 4.70 ఎకరాల భూమి పట్టాదారు పాసు పుస్తకాలు, కొంత బంగారాన్ని బ్యాంకులో కుదవపెట్టి పంట రుణం తీసుకున్నాను. లోన్ తీసుకున్నప్పటి నుంచి విడతల వారీగా రుణ బకాయి చెల్లిస్తూ ఉండేవాడిని. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక  రుణమాఫీ చేశారు. ఆ రుణమాఫీలో భాగంగా నాకు ఒకేసారి లక్ష రూపాయలు మాఫీ చేశారు. వైఎస్‌ఆర్ రైతుల పాలిట దేవుడు. ఏ సీఎం చేయని విధంగా ఆయన రైతు సంక్షేమం కోసం కృషి చేశారు.
- భాస్కరరెడ్డి, రైతు, మోడమీదిపల్లె. కడప నగరం  

 ఆ అంకుల్ పుణ్యమే..
వైఎస్‌ఆర్ అంకుల్ ఉన్నన్ని రోజులు మాలాంటి వారికి ఎంతో మేలు జరిగింది. ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. ఆ అంకుల్ పుణ్యమే మేము ఈ రోజు ఉన్నత చదువులు చదివి సమాజంలో రాణిస్తున్నాం. రిజర్వేషన్ వల్ల నేను ఎమ్మెస్సీ పూర్తి చేశాను. ప్రస్తుతం నేను ప్రముఖ విద్యాసంస్థలో అధ్యాపకురాలిగా పనిచేస్తూనే మరోవైపు పీహెచ్‌డీ కూడా చేస్తున్నాను.  నా ఆశయం  నెరవేరడానికి డాక్టర్ వైఎస్ అంకులే కారణం. ఆయన్ను ఎప్పటికీ మరచిపోలేను. - యాస్మిన్ బేగం, ఎంఎస్సీ

ఆయన దేవుడయ్యా..
నా పేరు హకీం శ్రీనివాసులు. మాది లక్కిరెడ్డిపల్లె మండలం అప్పకొండయ్యగారిపల్లె. నాకు గుండె జబ్బు వచ్చి అనేక ఆసుపత్రులు తిరిగి వేల రూపాయలు ఖర్చు చేసుకున్నా. ఆపరేషన్‌కు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని  వైద్యులు చెప్పగా అల్లాడిపోయా. వైఎస్‌ఆర్ ప్రవేశ పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 2008లో విజయవాడలో గుండె ఆపరేషన్  చేయించుకున్నా. ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు పునర్జన్మను అందించిన దేవుడాయన.
  - రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ చేయించుకొన్న హకిం శ్రీనివాసులు

రాజన్న చలువతోనే ఉచిత విద్యుత్ ..
మాది పెండ్లిమర్రి మండలం మాచనూరు గ్రామం. నాకు 10 ఎకరాల పొలం ఉంది. మూడు వ్యవసాయబోర్లు ఉన్నాయి. పంట దిగుబడులు సక్రమంగా రాక విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతుండే వాడిని.  వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఉచిత విద్యుత్ అందించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత విద్యుత్‌ను వాడుకుంటూ పంట పండించుకుంటున్నాను. ఆ మహనీయుడి సాయం ఎన్నటికీ మరువలేను. - అందూరి జగన్‌మోహన్‌రెడ్డి, పెండ్లిమర్రి మండలం

బీటెక్ చదువుతున్నాను..
నేను వైఎస్ దయవల్లే చదువుకుంటున్నాను. మాది  ఎర్రగుంట్ల పట్టణం  ఓం శాంతి నగర్.  నా చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. తరువాత మా అమ్మ  అరుణమ్మ కష్టపడి  చదివించింది.  వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నా పాలిట వరంగా మారింది. దీంతో అనంతపురం జిల్లాలోని  ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్‌లో ఉన్నాను. ఏడాదికి రూ.35 వేల చొప్పున ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది. వైఎస్‌ఆర్ విద్యార్థి లోకానికి చేసిన మేలు ఎన్నటికీ మరువలేము.
- సిరిగిరెడ్డి అశోక్ భారత్‌కుమార్‌రెడ్డి, ఎర్రగుంట్ల

వైఎస్ వల్లే సొంత ఇల్లు..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పేదలందరికీ ఇళ్లు వచ్చాయి.  నాకు ఇల్లు వచ్చింది. అంతకు ముందు ఇంటి కోసం ఎన్నిసార్లు అధికారులకు దరఖాస్తులు  ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. అద్దె ఇంటిలో చాలా అవస్థలు పడ్డాం. వైఎస్ సీఎం అయ్యాక మాలాంటి పేదలకు మేలు జరిగింది. సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నాము.  వైఎస్ మా పాలిట దేవుడు. ఆయన పుణ్యమా అని సొంత ఇంటిలో ఉన్నాము.  - రాజమ్మ, ఎన్‌టీఆర్ కాలనీ, రాజంపేట మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement