నేడు జగన్ రాక
- నగరంలో పేలుడు ప్రాంతం సందర్శన
- కాకినాడ, అమలాపురంలలో
- క్షతగాత్రులకు పరామర్శ
సాక్షి, కాకినాడ : నగరం పైపులైన్ పేలుడులో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, రాష్ర్ట ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మధురపూడి చేరుకుంటారు.
అక్కడి నుంచి కారులో కాకినాడ చేరుకుని, అక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం అమలాపురం చేరుకొని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి నగరం గ్రామం చేరుకొని పైపులైన్ పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించి పేలుడులో దుర్మరణం పాలైన వారి కుటుంబాలను పరామర్శిస్తారు.