వరద బాధిత ప్రాంతాల్లో నేడు జగన్ పర్యటన
బాధితులకు పరామర్శ
ప్రభావిత ప్రాంతాల పరిశీలన
తిరుపతి రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. ఆదివారం ఆయన తిరుపతిలో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన వివరాలను ప్రకటించారు. జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 9గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గాన రైల్వే కోడూరుకు బయలుదేరి వెళతారు. అక్కడ వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి రైతులను, వరద బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి తిరిగి తిరుపతికి చేరుకుంటారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తారని, తర్వాత రోడ్డు మార్గాన నాయుడుపేట, నెల్లూరుకు బయలుదేరి వె ళతార ని నారాయణస్వామి పేర్కొన్నారు. అక్కడ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పంటలను పరిశీలిస్తారని, రెతులను, బాధితులను పరామర్శిస్తారని వివరించారు.