హెచ్ సీయూ విద్యార్థులకు పరామర్శల వెల్లువ
♦ ములాఖత్‌లో కలుసుకున్న నారాయణ,వీహెచ్, కోదండరాం
♦ భారీగా తరలివచ్చిన హెచ్‌సీయూ విద్యార్థులు
కుషాయిగూడ: చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లను శనివారం పలువురు ములాఖ త్‌లో కలుసుకుని పరామర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తదితరు లు విద్యార్థులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అలాగే హెచ్‌సీయూ విద్యార్థులు కూడా భారీగా తరలివచ్చి తమ సహచర విద్యార్థులను పరామర్శించారు.
కేంద్రం తీరు గర్హనీయం: వీహెచ్
కేంద్రంలో కొనసాగుతున్న ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ చెప్పుచేతల్లో పనిచేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. హెచ్‌సీయూ ఘటనకు కారణమైన వీసీ అప్పారావుపై వన్‌మ్యాన్ కమిటీ ఎలాంటి రిపోర్టు అందజేయకముందే తిరిగి ఎలా విధులకు హజరవుతారని ఆయన ప్రశ్నించారు. అప్పారావు హయంలో ఎలాంటి నియామకాలు జరగడానికి వీలులేదన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పిల్ దాఖలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. ఆయన వెంట రాష్ట్రయూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: నారాయణ, సీపీఐ నేత
కేంద్ర ప్రభుత్వం తన అణచివేత ధోరణితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇచ్చే కుట్రలో భాగంగానే విద్యార్థులు, మేధావులపై దాడులు చేయిస్తోందని సీపీసీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చర్లపల్లి జైల్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, బాలమల్లేశ్, శివరాంకృష్ణలతో కలిసి ఆయన మాట్లాడారు.
ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసే బీజేపీ నాయకులు ఆయన ఆశయసాధన కృషి చేసే రత్నం లాంటి మేధావులను జైలులో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
వీసీ అప్పారావు తీరు సబబుకాదు : కోదండరాం
హెచ్‌సీయూ ఘటన గోటితో పోయేదాన్ని గొడ్డలి పెట్టును తలపిస్తుందని, వాస్తవంగా విచారణ ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు నెల రోజులు ఆగి ఉంటే ఈ పరిస్థితులు తలెత్తేది కాదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. కేసులు కొనసాగుతుండగా తిరిగి వీసీ బాధ్యతలు చేపట్టడానికి యూనివర్సీటీకి రావడం సమంజసం కాదన్నారు. విద్యార్ధులపై పోలీసుల దాడులు సరికాదన్నారు. విద్యార్థులను కొట్టవద్దన్న అధ్యాపకులను అరెస్టు చేసి జైలులో పెట్టడం అమానుషమన్నారు.