సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడో విడత హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి పదిరోజుల పాటు 19.91 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈసారి రహదారి వనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయతీ రోడ్ల వెంట మొక్కలు నాటాలని (మల్టీ అవెన్యూ ప్లాంటేషన్) నిర్ణయించింది. వీలున్న ప్రతిచోటా మియావాకీ మోడల్‌లో మొక్కలు నాటాలని ఆదేశించింది. హైదరాబాద్ శివార్లలోని అంబర్‌పేట్ కలాన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి ఏడో విడత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం వివరాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు.
ఆరు విడతల హరితహారం విజయవంతమైన స్ఫూర్తితో ఏడో విడతను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నాటేలా ప్రోత్సహించనున్నామని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచామన్నారు. గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ పచ్చదనం పెంచేలా చర్యలు చేపడుతున్నామని పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,241 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నాటిన మొక్కలన్నీ బతికేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ఈసారి 230 కోట్ల లక్ష్యం పూర్తి
2015లో హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టినపుడు మొత్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు ఆరు విడతల్లో 220.70 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. తాజా విడతలో మొత్తం లక్ష్యాన్ని అధిగమించనున్నారు. హరితహారం కోసం అన్నిశాఖల్లో కలిపి ఇప్పటిదాకా రూ.5,591 కోట్లు ఖర్చు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment