క్యాంపు కార్యాలయం ప్రారంభించి కలెక్టర్ ఇలంబరిదిని సన్మానిస్తున్న మంత్రి (ఫైల్)
సాక్షి, నిర్మల్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిలాల్లోనే ఆరుగురు పెద్దసార్లను ప్రభుత్వం శనివారం సాయంత్రం మార్చేసింది. ఉన్నపళంగా కలెక్టర్, ఎస్పీలను మార్చడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాల కలెక్టర్, ఎస్పీల బదిలీలపై ‘ఆదివాసీ’ ఉద్యమ ప్రభావం పడింది. ఇటీవల ఏజెన్సీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే వారిపై వేటు వేసింది. కానీ.. నిర్మల్ జిల్లా అధికారుల బదిలీల వెనుక రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ఇలంబరిదిల మధ్య కొంతకాలంగా సయోధ్యలేని కారణంగానే బదిలీ వేటు పడ్డట్లు తెలిసింది. ఈ నెలాఖరులోపు కలెక్టర్ బదిలీ అవుతారన్న ఊహగానాలున్నా ఉన్నపళంగా శనివారం సాయంత్రం బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తన పనితీరుతోనే ఆదిలాబాద్ ఎస్పీగా, నిర్మల్ పూర్తి అదనపు బాధ్యతలు దక్కించుకున్నట్లు అధికార వర్గాల సమాచారం.
మొదట్లో బాగున్నా..
నిర్మల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత కె.ఇలంబరిది కలెక్టర్‌గా, విష్ణు ఎస్ వారియర్ ఎస్పీగా నియమితులయ్యారు. గత పనితీరు, వీరికున్న అనుభవాలతో కొత్త జిల్లావాసులు హర్షం వ్యక్తంచేశారు. దీనికి తగ్గట్లుగా ఇరువురు ఉన్నతాధికారులూ మొదట్లో తమ పనితీరుతో ఆకట్టుకున్నారు. నూ తన జిల్లా పాలనలో తొలి అధికారులుగా తమదైన ము ద్ర వేశారు. రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యా యశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా ఇరువురి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. కొత్తగా ఏర్పడిన జిల్లా లో కలెక్టర్ ఇలంబరిది ప్రజావాణితో ప్రజలకు దగ్గర య్యారు. అన్నిశాఖల అధికారులు హాజరయ్యేలా చ ర్య లు తీసుకున్నారు. సమస్యలపై వెంటనే సదరు శా ఖాధికారిని పిలిచి, పరిష్కరించాల్సిందిగా ఆదేశించేవా రు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూశారు. ప దో తరగతి ఫలితాల్లోనూ జిల్లాకు మెరుగైన స్థానం వచ్చిం ది. కానీ.. కాలక్రమంలో పరిస్థితి మారుతూ వచ్చింది.
విభేదం.. విముఖం..
కొత్త జిల్లాను ముందుకు తీసుకెళ్లాల్సిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ఇలంబరిదిల మ«ధ్య సయోధ్య దెబ్బతింది. పలు పనుల నేపథ్యంలో మంత్రి మాటను కలెక్టర్ కాదనడం విబేధాలకు కారణమైంది. వరుస సంఘటనలు మంత్రి, కలెక్టర్‌ల మధ్య దూరాన్ని పెంచా యి. ప్రధానంగా మంత్రి బాధ్యుడిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా విఫలం కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు కలెక్టర్ పట్టింపులేని తనమే కారణమని ఆరోపణలు వచ్చాయి. హరితహారం, ఉపాధిహామీ, పలు ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం పంపిణీ తదితర కార్యక్రమాల్లో జాప్యానికీ కలెక్టర్‌పై విమర్శలు వచ్చాయి. మంత్రితో విబేధాలూ కలెక్టర్ పనితీరుపై ప్రభావం చూపాయి. ప్రజావాణి, సమావేశాలు మినహా కలెక్టరేట్‌లో తక్కువగా ఉండేవారు. అధిక సమయం క్యాంపు కార్యాలయంలోనే గడిపేవారు. క్రమంగా ప్రజావాణి ఫిర్యాదులపైనా పెద్దగా దృష్టి పెట్టకపోవడం విమర్శలకు దారితీసింది. వివిధ శాఖలకు చెందిన ఫైళ్లను వెంటనే పరిష్కరించకుండా తన వద్దే పెట్టుకుంటున్నారన్న విమర్శలూ వచ్చాయి.
బహిరంగంగానే ఆరోపణలు..
ఒక జిల్లా అధికారి తీరుతోనే జిల్లా అభివృద్ధి కుంటుపడుతోందని సాక్షాత్తు మంత్రి బహిరంగ సభలు, సమావేశాల్లో ఆరోపణలు, విమర్శలు చేశారు. బహిరంగంగా కలెక్టర్ తీరుపై మంత్రి విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. మంత్రి పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనక పోవడం వరకూ పరిస్థితి దిగజారింది. ఇద్దరి మధ్య దూరం పెరగడంతో త్వరలో కలెక్టర్ బదిలీ కావడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఇటీవల ఈనెలాఖరులోపు కలెక్టర్ బదిలీ ఖాయమన్న ఊహాగానాలూ జోరందుకున్నాయి. కానీ.. 15రోజుల ముందే ఇలంబరిది బదిలీ అయ్యారు.
పని చేసింది 14నెలలు..
నిర్మల్ 2016 అక్టోబర్ 11న విజయదశమి రోజున నూతన జిల్లాగా ఏర్పడింది. సరిగ్గా 14నెలల పాటు కలెక్టర్ ఇలంబరిది, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. సమర్థవంతమైన అధికారులుగా పేరున్న వీరిద్దరూ ఆదిలోనే జిల్లా ప్రజలకు దగ్గరయ్యారు. మంత్రితో విబేధాల కారణంగా కలెక్టర్ బదిలీపై ముందునుంచే ఊహాగానాలు ఉండగా, ఎస్పీ మాత్రం తనదైన శైలిలో నేరనియంత్రణ చేపట్టారు. వస్తూనే ఒక మావోయిస్టు లొంగిపోయేలా చేశారు. జిల్లా ఏర్పడక ముందుకు విచ్ఛలవిడిగా సాగిన చైన్‌స్నాచింగ్‌లు, దొంగతనాలు, గంజాయి, మట్కా, గుట్కాల అక్రమ రవాణా తదితర నేరాలపై ఉక్కుపాదం మోపారు. విద్యార్థులను పోలీస్ కెడెట్లుగా తయారు చేయడానికి చొరవ తీసుకున్నారు. ఏజెన్సీలో కొనసాగుతున్న ఆదివాసీ, లంబాడాల ఉద్యమ నేపథ్యంలోనే విష్ణు వారియర్‌ను ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ చేసినట్లు సమాచారం. దీంతో పాటు నిర్మల్ జిల్లాకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment