సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి ఏపీ సీఎంగా ఉంటూ అనూహ్యం గా హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి.. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదన తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని ఉద్యమాన్ని తీవ్రం చేసింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీతో సహా వివిధ పార్టీలు ఈ ఉద్యమంలోకి రాల్సిన పరిస్థితిని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సృష్టించారు. ఇక తెలంగాణ ఇచ్చాక కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకోలేక చతికిలపడింది. ఆ తరుణంలో కేసీఆర్ సొంతంగానే తెలంగాణలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుని తదనుగుణంగా పార్టీని గేర్ అప్ చేశారు.
ఎన్నికలకు కాంగ్రెస్ వారు సిద్ధమయ్యేలోపు ఆయన తెలంగాణ అంతటా సుడిగాలి పర్యటనలు చేసి ప్రజలను తనపైపు తిప్పుకోవడంలో సఫలమయ్యారు. తెలగాణ ఇచ్చామని, తమదే రాజ్యమని కాంగ్రెస్ పార్టీ భ్రమించి పూర్తిగా దెబ్బతిన్నది. 2014లో జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికలలో టీఆర్‌ఎస్ 63 సీట్లు దక్కించుకొని అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ 21 సీట్లతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. బీజేపీ, టీడీపీలు పొత్తు పెట్టుకుని పోటీ చేసి మోడీ వేవ్ తదితర అంశాల కారణంగా ఇవి కూడా కాంగ్రెస్‌తో దాదాపు సమానంగా సీట్లు సాధించాయి.
టీడీపీకి 15 సీట్లు వస్తే, బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయి. ఎంఐఎం ఏడు స్థానాలను కైవసం చేసుకుంటే సీపీఐ, సీపీఎంలు చెరో స్థానానికి పరిమితం అయ్యాయి.ఈ ఎన్నికలలో పోటీచేసి వైఎస్సార్ కాంగ్రెస్ మూడు సీట్లు సాధించగా, కాంగ్రె స్‌లో టిక్కెట్లు రాని ఇద్దరు నేతలు బీఎస్పీ టిక్కెట్‌పై పోటీచేసి గెలిచారు. ఒక స్వతంత్ర అభ్యర్ధి కూడా గెలిచారు. ఇక ఉప ఎన్నికలు, పార్టీ ఫిరాయింపుల కారణంగా 63 మంది ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య సభ రద్దు అయ్యేనాటికి 91కి చేరడం విశేషం.
సామాజికవర్గాల వారీగా చూస్తే 42 మంది రెడ్డి నేతలు గెలుపొందారు. వెలమ పది, కమ్మ ఐదు, ముస్లిం ఎనిమిది, బీసీలు 20 మంది, ఎస్సీలు 19, ఎస్టీ 12, ఇద్దరు బ్రాహ్మణ, ఒక వైశ్య వర్గం నేత ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్ గెలిచింది. వారిలో ఒక రెడ్డి, ఒక కమ్మ ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం వారు 42 మంది గెలిచినా వారిలో టీఆర్‌ఎస్ నుంచే ఎక్కు వగా 20 మంది గెలుపొందారు.
ఆ తర్వాత కాంగ్రెస్ టిక్కెట్ పై 13 మంది గెలుపొందారు. టీడీపీ నుంచి ఐదుగురు, బీజేపీ పక్షాన ఇద్దరు విజయం సాధించారు. బీఎస్పీ నుంచి ఒకరు, ఇండిపెండెం ట్‌గా ఒక రెడ్డి నేత గెలుపొందారు. వెలమ సామాజికవర్గం నుంచి 10 మంది గెలిస్తే అందులో ఎనిమిది మంది టీఆర్‌ఎస్ పక్షాన కాగా, ఇద్దరు టీడీపీ వారు. బీసీ వర్గాలవారు 20 మంది గెలవగా 14 మంది టీఆర్‌ఎస్, నలుగురు టీడీపీ, ఇద్దరు బీజేపీ నుంచి గెలుపొందారు. కమ్మ వర్గం వారు ఐదుగురిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒకరు బీఎస్పీ నుంచి గెలుపొందారు. ఎస్సీలు 19 మంది ఎన్నిక కాగా, 13 మంది టీఆర్‌ఎస్, నలుగురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ తరపున గెలుపొందారు. ఎస్టీలు 12 మంది గెలుపొందగా, ఐదుగురు టీఆర్‌ఎస్ నుంచి , ఇద్దరు కాంగ్రెస్, సిపిఐ ఒకరు, సిపిఎం ఒకరు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు గెలిచారు. ముస్లింలు ఎనిమిది మంది గెలిస్తే ఎంఐఎం తరపున ఏడుగురు, టీఆర్‌ఎస్ పక్షాన ఒకరు గెలిచారు.
ఇతర వర్గాలలో బీజేపీ నుంచి ఒక బ్రాహ్మణ, టీఆర్‌ఎస్ నుంచి ఒక బ్రాహ్మణ, టీఆర్‌ఎస్ పక్షాన ఒక వైశ్య నేత ఎమ్మెల్యేలుగా గెలిచారు. గెలిచిన ప్రముఖులలో రెడ్డి వర్గం నుంచి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. జానారెడ్డి ఏడుసార్లు గెలిచారు. వెలమ వర్గంలో ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన చరిత్ర కేసీఆర్‌ది. సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు మరోసారి అసెంబ్లీకి ఎన్నికై మంత్రి పదవులు చేపట్టారు. కమ్మ వర్గంలో ఇద్దరు టీడీపీ పక్షాన, ఇద్దరు కాంగ్రెస్, మరొకరు బీఎస్పీ తరపున గెలిచారు. వీరిలో ఎవరికి మంత్రి పదవి రాలేదు.
సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన పాలేరు ఉప ఎన్నికలో గెలుపొందారు. బీసీలలో ఈటల రాజేందర్, డాక్టర్ కె.లక్ష్మణ్, జోగు రామన్న, ఆర్.కృష్ణయ్య, తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులు ఉన్నారు. మధుసూదనాచారి స్పీకర్ అయ్యారు. కొండా సురేఖ తదితర ప్రముఖులుకూడా గెలిచినవారిలో ఉన్నారు.
ఎస్సీల్లో డాక్టర్ రాజయ్య, కొప్పుల ఈశ్వర్ గెలిచిన ప్రముఖులలో ఉన్నారు. ముస్లింలలో అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు ఉన్నారు. బ్రాహ్మణ ఎమ్మెల్యేలలో ఒడితెల సతీష్, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఉన్నారు. వైశ్య వర్గం నుంచి గణేష్ బిగాల ఎన్నికయ్యారు.
కులాల వారిగా గెలుపు ఇలా..
- రెడ్డి – 42
- వెలమ– 10
- ముస్లిం– 8
- బీసీ – 20
- ఎస్సీ – 19
- ఎస్టీ– 12
- కమ్మ– 5
- బ్రాహ్మణ– 2
- వైశ్య– 1
బీసీలలో
- మున్నూరు కాపు 8
- గౌడ 4
- యాదవ 2
- ముదిరాజ్ 2
- పద్మశాలి 2
- విశ్వబ్రాహ్మణ 1
- లోద్ క్షత్రియ 1
Comments
Please login to add a commentAdd a comment