ఎన్నికల్లో జనం గుండె గెలవాలంటే పార్టీ అజెండా అదరాలి. గెలుపు మంత్రం ఫలించాలంటే మంచి నినాదాలు దొరకాలి. నినాదాలు బాగుంటే ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఎడాపెడా హామీలిచ్చినా, హైటెక్ డాబు సరి కబుర్లు చెప్పినా జనం తిప్పికొడతారు. బాబు ‘విజన్–2020’ హామీ అట్టర్‌ఫ్లాప్ అయ్యిందనేందుకు 2004లో జరిగిన ఉమ్మడి ఏపీ ఎన్నికలే నిదర్శనం. ఒక పార్టీ నినాదాన్ని జనం నమ్మాలంటే.. ఆ పార్టీ లీడర్‌కు ‘విశ్వసనీయత’ ఉండాలి.
జనం నుంచి ఆ విశ్వాసాన్ని పొందిన మహానేత.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన అభివృద్ధి మంత్రాన్ని జనం విశ్వసించి 2004, 2009 ఎన్నికల్లో పట్టం కట్టారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నాయి. 90వ దశకం నుంచి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అభివృద్ధి, సంక్షేమ నినాదాలతో ప్రజల తీర్పును కోరడం మొదలైంది.
తెలంగాణలో ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆ నినాదమే తెరపైకి వచ్చింది. గడువు కంటే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దుచేసి కేసీఆర్ ఎన్నికల బరిగీశారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని ప్రజలను కోరుతున్నారు. అయితే, ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదని, అది తమతోనే సాధ్యమని కాంగ్రెస్ అంటోంది.
2004: బాబు ‘విజన్’ అట్టర్‌ఫ్లాప్
2004లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ అభివృద్ధి నినాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాయి. ‘విజన్–2020’ నినాదాన్ని తలకెత్తుకున్న టీడీపీని ఓటర్లు దారుణంగా ఓడించారు. మానవీయ కోణం లేని సంస్కరణలు, నినాదాలను ప్రజలు తిప్పికొట్టారు. ఈ ఎన్నికల్లో వైఎస్ అభివృద్ధి, సంక్షేమ నినాదాలే గెలిచాయి.
2009: వైఎస్ అభివృద్ధి మంత్రానికి పట్టం
అభివృద్ధికి సంక్షేమాన్ని జోడించి పాలన సాగించిన ప్రభుత్వాలను ఓటర్లు 2009లో మళ్లీ గెలిపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పింఛన్ల పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, బీపీఎల్ ప్రమాణాల్లో మార్పులు వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మొత్తంగా అభివృద్ధికి, సంక్షేమాన్ని జోడించిన ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు.. జట్టు కట్టిన టీడీపీ–టీఆర్‌ఎస్–సీపీఎం–సీపీఐ కూటమిని ప్రజలు తిరస్కరించారు. కాగా, 2014 ఎన్నికల్లో ఉద్యమ నేపథ్యంతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. తాజా ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం జపిస్తోంది.
- పిన్నింటి గోపాల్ (సాక్షి, హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment