సాక్షి, హైదరాబాద్: అన్ని పార్టీల కంటే అత్యధికంగా మహిళలకు సీట్లను కేటాయించిన బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అన్ని పార్టీలు కలిపి మహిళలకు 44 స్థానాలను కేటాయిస్తే అందులో బీజేపీ అత్యధికంగా 15 స్థానాలను కేటాయించింది. పార్టీ కేటాయించిన 15 స్థానాల్లో పార్టీ పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలతో ప్రచారాన్ని నిర్వహించింది. కేంద్ర మహిళా మంత్రులు సైతం పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారంతో ప్రచారం ముగియడంతో గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలపై పార్టీ వర్గాలు అంచనాల్లో పడ్డాయి.
పార్టీ మహిళలకు కేటాయించిన 15 స్థానాల్లో 8 స్థానాల్లో పార్టీ మహిళా అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. రెండు, మూడు చోట్ల గెలిచే అవకాశం ఉండగా మిగతా స్థానాల్లో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి బరిలోకి దిగిన మహిళల్లో ముగ్గురు తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. భద్రాచలం నుంచి కుంజ సత్యవతి, చొప్పదండి నుంచి బొడిగె శోభ, జుక్కల్ నుంచి అరుణతార బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కుంజ సత్యవతి, కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరిన అరుణతార, టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి పోటీలో నిలిచిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు తమ గెలుపు కోసం భారీ ప్రచారం నిర్వహించారు.
పలు చోట్ల గట్టి పోటీ..: భూపాలపల్లి నుంచి పోటీ చేస్తున్న చందుపట్ల కీర్తిరెడ్డి, నిర్మల్ నుంచి సువర్ణారెడ్డి, వైరా నుంచి రేష్మా రాథోడ్, నాగార్జునసాగర్ నుంచి బరిలో దిగిన నివేదితారెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్‌ను ఢీకొనేందుకు షహజాదీ బరిలో దిగగా, గత ఎన్నికల్లో కేటీఆర్‌పై సిరిసిల్ల నుంచి పోటీ చేసిన పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఆకుల విజయ, ఈసారి సీఎం కేసీఆర్‌పైనే గజ్వేల్ నుంచి పోటీలో దిగారు. మరోవైపు ముధోల్ నుంచి రమాదేవి, మహబూబ్‌నగర్ నుంచి పద్మజారెడ్డి ఇల్లందు నుంచి నాగ స్రవంతి, ఆలంపూర్ నుంచి రజనీరెడ్డి, ఖమ్మం నుంచి ఉప్పల శిరీష, రామగుండం నుంచి బల్మూరి వనిత పోటీలో దిగారు. పార్టీ సీట్లు కేటాయించిన 15 మందిలో ఎంతమంది మహిళలు నెగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది.
సీట్లు ఎక్కువ.. గెలిచేవి ఎన్నో!
Published Thu, Dec 6 2018 3:45 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment