మక్తల్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల
మక్తల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు చేపట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి, మాద్వార్, ఉప్పర్‌పల్లి, మక్తల్ గ్రామాల్లో ప్రజాప్రస్థాన పాదయాత్ర నిర్వహించారు. మక్తల్ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు.
వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టుల్లోని 80 శాతం పనులు కాగా, మిగిలిన 20 శాతం పనులు కూడా పూర్తిచేయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండి ఎందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35 వేల కోట్లతో పూర్తి చేయాలని వైఎస్సార్ అనుకుంటే.. దాన్ని సీఎం కేసీఆర్ రూ.55 వేల కోట్లకు పెంచారని, కమీషన్లు తీసుకుని ఏమాత్రం పనులు చేయలేదని విమర్శించారు.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని, రైతులు అప్పులపాలయ్యారని అన్నారు. కొందరు రాజకీయ నాయకులకు విలువలు లేవని, కాంట్రాక్టుల కోసం, స్వార్థం కోసం రాజకీయాలను అడ్డం పెట్టుకుని పార్టీలు మారుతున్నారని, ఆస్తులు పెంచుకోవడం, కాపాడుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ మరిచారని, కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, భూపంపిణీ, సబ్సిడీ రుణాలు అంటూ మాయమాటలతో మభ్యపెడుతున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. తనను ఆదరిస్తే రాజన్న పాలన తెస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజ్‌గోపాల్, మరియమ్మ, అనిల్‌కుమార్, రవిప్రకాష్, పిట్ట రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment