మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
కోరుట్ల: దొంగలు కాబట్టే సీబీఐ దర్యాప్తు వద్దంటున్నారని టీఆర్‌ఎస్ తీరును వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. జగిత్యాల జిల్లా కోరుట్ల బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ చూసిందని ప్రచారం చేసి మునుగోడులో సానుభూతితో ఓట్లు రాబట్టేందుకు టీఆర్‌ఎస్ తాపత్రయ పడుతోందన్నారు.
‘రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టడానికి వీలు లేదట.. కొత్తగా రహస్య జీవోను ముందుకు తెచ్చారు. అసలు ఈ జీవో ఒకటి ఉందన్న విషయమే తెలియదు. సీక్రెట్‌గా ఉంచారన్న మాట. ఇలాంటి రహస్య జీవోలు ఇంకా ఎన్ని ఉన్నాయో?’అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు సీబీఐ అంటే ఎందుకంత భయమని, నిజాయితీ పరులైతే భుజా లు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలను ఇన్నిరోజులు ప్రగతి భవన్ లో ఎందుకు దాచి ఉంచారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సీఎంగా ఉన్నారా? లేదా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్లకు మాత్రమే సీఎంగా ఉన్నారా? అని ఎద్దేవాచేశారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని షర్మిల మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment