మహిళలు.. ఆకాశంలో సగం సంగతేమో కానీ, రాజకీయాల్లో వారి పాత్ర నానాటికీ తగ్గిపోతోంది. ప్రభుత్వాలను ఎన్నుకునే నిర్ణయాధికారంలో సగం వాటా కలిగిన మహిళలకు చట్టసభలకు పోటీచేసే అకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. ఈ విషయంలో కొద్ది హెచ్చుతగ్గులతో అన్ని రాజకీయ పార్టీలదీ ఒకటే తీరు.
ఆ విషయంలో అందరూ ఒక్కటే!
వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలతో వ్యవహరించే రాజకీయ పార్టీలన్నీ మహిళకు పోటీచేసే అవకాశం ఇచ్చే విషయంలో మాత్రం ఒక్కతాటిపై నడుస్తున్నాయి. జనాభా ప్రకారం మహిళలకు సీట్లు కేటాయించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కలిపి 44 మంది మహిళలకు మాత్రమే టికెట్లు కేటాయించాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) చివరి స్థానంలో ఉంది. ఈ పార్టీ తరఫున నలుగురు మహిళలకు టికెట్లు దక్కగా, ప్రజాకూటమి 14, భారతీయ జనతా పార్టీ 15, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 11 మందికి టికెట్లు కేటాయించాయి.
55 నియోజకవర్గాలలో మహిళా ఓటర్లే ఎక్కువ
మహిళలకు రాజ్యాధికారం ఇంకా అందనంత ఎత్తులోనే ఉంది. ఎప్పటికీ వారు ఎన్నుకునే వారిగానే ఉండిపోతున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాదాపు 55 సెగ్మెంట్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. బాల్కొండ, నిజామాబాద్, ఆర్మూరు, నిర్మల్ నియోజకవర్గాల్లో పురుçష ఓటర్ల కంటే పది శాతం ఎక్కువగా మహిళలు ఉన్నారు. కోరుట్ల, మెదక్, వేములవాడ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, ఖమ్మం, బోధన్, జగిత్యాల, భద్రాచలం, కామారెడ్డి సెగ్మెంట్లలో పురుషుల కంటే ఎనిమిది శాతం ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ముథోల్, నిజామాబాద్ అర్బన్, జుక్కల్, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, సిరిసిల్ల, అందోలు, నర్సాపూర్, హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, తాండూరు, కొడంగల్, నారాయణపేట, దేవరకద్ర, మక్తల్, గద్వాల, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, డోర్నకల్, నర్సంపేట, పరకాల, వరంగల్ తూర్పు, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.
బిల్లుకు మోక్షం కలిగితేనే..
రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపులో మహిళలను లెక్కలోకి తీసుకోవట్లేదు. చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి.. చట్టసభల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తే ప్రాతినిధ్యం పెరుగుతుంది. అప్పుడు కచ్చితమైన సంఖ్యలో మహిళలు ప్రజాస్వామ్యంలో భాగస్వాములవుతారు. 30 శాతం రిజర్వేషన్ల బిల్లు ఏళ్ల తరబడి పార్లమెంట్‌లోనే మూలుగుతోంది. దీనికి ఆమోదం లభించే పరిస్థితీ కనిపించడంలేదు. ఈలోగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల అంశంపై డిమాండ్లు మొదలవుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీంతో ఇక్కడ మహిళలు అవకాశాలను వినియోగించుకుంటున్నారు. పరిపాలనలతో సత్తా చాటుతున్నారు. చట్టసభల్లో అవకాశం కోసం మాత్రం రాజకీయ పార్టీల కరుణ కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది.
హైదరాబాద్ రాష్ట్రానికి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఎనిమిది మంది మహిళలు గెలుపొందారు. వీరిలో స్వతంత్రంగా పోరాడి గెలిచిన వారే అధికం.. 2014లో తెలంగాణ శాసనసభకు ఎన్నికైన మహిళలు తొమ్మిది మందే.. అంటే అరవై ఏడేళ్ల కాలంలో రాష్ట్ర శాసనసభలో పెరిగిన మహిళల సంఖ్య ఒక్కటంటే..ఒక్కటే.. మహిళలకు టికెట్ల కేటాయింపులో అన్ని పార్టీలు కంటితుడుపుగానే వ్యవహరిస్తున్నాయి.
నాడూ నేడూ అంతంతే..
- 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి 317 మంది మహిళలు పోటీ చేస్తే.. 27 మంది (తెలంగాణ– 9, ఆంధ్రప్రదేశ్– 18) గెలిచారు
- 2009లో 300 మంది మహిళలు పోటీకి దిగగా, 33 మంది (కాంగ్రెస్– 21, టీడీపీ– 9, సీపీఐ– 1, ప్రజారాజ్యం–2) గెలుపొందారు
- 2004లో 161 మంది పోటీచేస్తే 25 మంది విజయం సాధించారు (కాంగ్రెస్– 17, సమాజ్‌వాదీ పార్టీ– 1 (డీకే అరుణ), టీడీపీ– 5, టీఆర్‌ఎస్– 2)
- 1999లో 157 మంది బరిలో నిలిస్తే 28 మంది గెలిచారు (టీడీపీ– 22, కాంగ్రెస్– 5, ఇండిపెండెంట్– 1)
- 1994లో 127 మంది పోటీచేస్తే 8 మంది గెలుపొందారు (టీడీపీ– 6, కాంగ్రెస్– 1, సీపీఎం– 1)
- 1989లో 70 మందికి టికెట్లు దక్కగా, 17 మంది పోటీలో నెగ్గారు (కాంగ్రెస్– 11, టీడీపీ– 6)
- 1985లో 66 మంది బరిలో నిలబడితే పది మంది గెలుపొందారు (కాంగ్రెస్– 1, టీడీపీ– 9)
- 1983లో 66 మంది పోటీకి నిలవగా, గెలిచింది పదకొండు మంది (టీడీపీ– 9, కాంగ్రెస్– 1, సీపీఎం– 1)
- 1978లో 54 మందికి టికెట్లు ఇవ్వగా పదిమంది గెలిచారు (కాంగ్రెస్– 6, జనతా పార్టీ– 3, సీపీఎం– 1)
- 1972లో ఒక్క మహిళ కూడా గెలవలేదు. 287 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 49 మంది మహిళలు పోటీ పడ్డారు
- 1967లో 21 మంది నిలబడితే 11 మంది గెలిచారు (కాంగ్రెస్– 10, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా– 1)
- 1962లో 24 మంది పోటీచేస్తే పది మంది విజయం సాధించారు (కాంగ్రెస్– 8, సీపీఐ– 2)
- 1952లో హైదరాబాద్ స్టేట్ తొలి శాసనసభ ఎన్నికల్లో 8 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు
(కాంగ్రెస్– 5, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్– 1, ఇండిపెండెంట్– 1, ఆల్‌ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్– 1)
(ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలూ కలిపి 44 మంది మహిళలకు అవకాశం ఇచ్చాయి)
అవకాశం ఇచ్చి చూస్తే..
మహిళలకు కాస్తో కూస్తో ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పాటు మహిళా ఎమ్మెల్యేలకు అధికంగా మంత్రి పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్సే. స్త్రీ, శిశు సంక్షేమం లాంటి శాఖలతోనే సరిపెట్టకుండా కీలకమైన హోంశాఖనూ కేటాయించింది. ఆ ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. సబితా ఇంద్రారెడ్డి వైఎస్ హయాంలో ఆ శాఖను చేపట్టారు. తెలుగుదేశం పార్టీ.. ప్రతిభా భారతికి అసెంబ్లీ స్పీకర్ బాధ్యతలను అప్పజెప్పింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రభుత్వం మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పజెప్పింది.
తొలి మహిళా ‘హోమ్’ ఇక్కడే..
తొలి మహిళా హోం మంత్రి రికార్డు మన తెలంగాణ పేరిటే ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. అదే ఏడాది జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన సబితా ఇంద్రారెడ్డి.. తీగల కృష్ణారెడ్డి (టీడీపీ)పై 7,833 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆమెకు హోంమంత్రి బాధ్యతలు అప్పగించారు. కాగా, సబిత భర్త ఇంద్రారెడ్డి సైతం హోం మంత్రిగా పనిచేశారు. దంపతులిద్దరూ హోం మంత్రులుగా పని చేయడం దేశంలోనే రికార్డు.
ప్రస్తుత ఎన్నికల్లో పార్టీలు మహిళలకు కేటాయించిన సీట్లు
వైఎస్ కేబినెట్‌లో ఆరుగురు మహిళలు
అప్పటికీ ఇప్పటికీ ఇదే రికార్డు
ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు మహిళలకు కల్పిస్తున్న ప్రాధాన్యం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన కేబినెట్‌లో ఆరుగురు మహిళలకు చోటిచ్చిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎంగా పగ్గాలు చేపట్టిన వైఎస్.. తన కేబినెట్‌లో జి.అరుణకుమారి, గీతారెడ్డి, ఎన్.రాజ్యలక్ష్మి, సబితా ఇంద్రారెడ్డిని చేర్చుకున్నారు. రెండోసారి 2009లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన.. మరోసారి కేబినెట్‌లో మహిళలకు పెద్దపీట వేశారు. ఈసారి ఏకంగా ఆరుగురికి చోటు కల్పించారు. వీరిలో సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, సబితారెడ్డి, అరుణకుమారి, కొండా సురేఖ, డీకే అరుణ ఉన్నారు. అరుణకుమారి మినహా మిగిలిన వారంతా తెలంగాణకు చెందిన వారే కావడం గమనార్హం. కాగా, నాడు వైఎస్ కేబినెట్‌లో పనిచేసిన మంత్రులంతా ఈసారీ తెలంగాణ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. 2009లో వైఎస్ ఆకస్మిక మరణం తరువాత.. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, సబితారెడ్డి, కొండా సురేఖ, డీకే అరుణ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు.
దేశంలోనే తొలి మహిళా ప్రతిపక్ష నేత
ఆమె అసలుపేరు రుక్మిణి. విప్లవ భావాలకు నెలవైన పాత నల్లగొండ జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో 1920లో జన్మించారు. పదకొండేళ్లకే మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డిని వివాహమాడిన రుక్మిణి.. తన పేరు కమలాదేవిగా మార్చుకున్నారు. వివాహానంతరం హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేసిన ఆమె.. భర్తతో పాటు ఉద్యమాల్లోనూ పాల్గొనే వారు. 1946–48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేశారు. 1952 ఎన్నికల్లో భువనగిరి నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికైన ఆమె.. ఆపై వరుసగా మూడుసార్లు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఆలేరు నుంచి ఎన్నికయ్యారు. శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా పని చేసిన ఆమె, పుచ్చలపల్లి సుందరయ్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లినప్పుడు, దేశంలోనే తొలి ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించి రికార్డు సృష్టించారు.
టీఆర్‌ఎస్ 4
2014 ఎన్నికల్లో 9 మంది మహిళలకు పోటీచేసే అవకాశం ఇచ్చింది. వీరిలో ఆరుగురు గెలిచారు. ఇప్పుడు 4 సీట్లే కేటాయించింది. ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగడి సునీత (ఆలేరు), రేఖానాయక్ (ఖానాపూర్–ఎస్టీ), కోవా లక్ష్మి (ఆసిఫాబాద్–ఎస్టీ).
బీఎల్‌ఎఫ్ 11
సీపీఎం నేతృత్వంలో ఏర్పడిన ఈ ప్రజాసంఘాల కూటమి 11 స్థానాల్లో మహిళలకు పోటీచేసే అవకాశమిచ్చింది. మక్కా నాగలక్ష్మి (పాలకుర్తి), నూర్జహాన్ (నిజామాబాద్ రూరల్) షెహనాజ్ (బోధన్), పటేల్ వనజ (భూపాలపల్లి), అలివేలుమంగ (నిర్మల్), పి.విజయలక్ష్మి (అందోలు), సౌజన్య (నాగార్జునసాగర్), నారాయణమ్మ (నారాయణపేట), బి.హైమావతి (పాలేరు), ఎం.భారతి (సత్తుపల్లి), ఇందూరి సులోచన (జగిత్యాల).
బీజేపీ 15
119 స్థానాల్లో పోటీలో ఉన్న బీజేపీ.. మహిళలకు 15 సీట్లిచ్చింది. అరుణతార (జుక్కల్–ఎస్సీ), బొడిగె శోభ (చొప్పదండి–ఎస్సీ), ఆకుల విజయ (గజ్వేల్), బల్మూరి వనిత (రామగుండం), చందుపట్ల కీర్తిరెడ్డి (భూపాలపల్లి), రజని (అలంపూర్–ఎస్సీ), శారద (ఖమ్మం), ఎ.సువర్ణరెడ్డి (నిర్మల్), పి.రమాదేవి (ముథోల్), షాహెజాదీ (చాంద్రాయణగుట్ట), కె.నివేదిత (నాగార్జునసాగర్), ఎం.నాగస్రవంతి (ఇల్లందు–ఎస్టీ), రేష్మారాథోడ్ (వైరా–ఎస్టీ), జి.పద్మజారెడ్డి(మహబూబ్‌నగర్), కుంజా సత్యవతి (భద్రచాలం–ఎస్టీ).
ప్రజా కూటమి 14
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కూటమి.. మహిళలకు 14 సీట్లిచ్చాయి. వంద సీట్లలో పోటీలో ఉన్న కాంగ్రెస్.. 11 టికెట్లు టికెట్లిచ్చింది. డీకే అరుణ (గద్వాల), పీ.సబితారెడ్డి (మహేశ్వరం), వీ.సునీతారెడ్డి (నర్సాపూర్), జె.గీతారెడ్డి (జహీరాబాద్–ఎస్సీ), కొండా సురేఖ (పరకాల), ఎన్.పద్మావతి (కోదాడ), డి.అనసూయ (ములుగు–ఎస్టీ), ఆకుల లలిత (ఆర్మూరు), ఎస్.ఇందిర (స్టేషన్‌ఘన్‌పూర్–ఎస్సీ), జి.సుజాత (ఆదిలాబాద్), బి.హరిప్రియనాయక్ (ఇ ల్లందు–ఎస్టీ). టీడీపీ– నందమూరి సుహాసిని (కూకట్‌పల్లి). సీపీఐ– బానోతు విజయబాయి (వైరా). టీజేఎస్– ఎం.భవానీరెడ్డి (సిద్దిపేట).
..:: పిన్నింటి గోపాల్
Comments
Please login to add a commentAdd a comment