![Review of TPCC leaders - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/13/GANDHI-BHAVAN-5.jpg.webp?itok=A62wYzvI)
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఘోర పరాభవం తర్వాత ఏం చేద్దామన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితం కావడం, హేమాహేమీలంతా ఓటమిపాలు కావడంతో రానున్న ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవడం క్లిష్టతరంగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అడుగులు వేయాలన్న దానిపై పార్టీలో చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో పరాజయం అనంతరం టీపీసీసీ ముఖ్యనేతలు ఎవరూ మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు.
ఇప్పటి పరిస్థితుల్లో కొన్నాళ్లు మౌనంగా ఉండటమే మేలని, ఆ తర్వాతే ప్రజాసంక్షేమం, ప్రభుత్వ పనితీరుపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నారు. రాజకీయంగా ఒంటరిగానే ఉండాలని, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం కన్నా కాంగ్రెస్ పార్టీగానే ప్రజల్లోకి వెళ్లాలని, ముఖ్యంగా టీడీపీతో ఈ ఎన్నికలతోనే సెలవు తీసుకోవాలనే వాదన కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. పంచాయతీ ఎన్నికల్లో బలమైన అధికార పక్షాన్ని ఎలా ఢీకొట్టాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
బాబు దోస్తీనే పుట్టి ముంచింది
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పెట్టుకున్న పొత్తు వికటించిందని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రవేశంతో తమకు అనుకూలంగా ఉన్న వాతావరణం టీఆర్‌ఎస్ పార్టీ వైపు మళ్లిందనే అభిప్రాయం మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై విశ్లేషణ జరుపుతున్న ప్రతి నాయకుడూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. టీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రీతిలో జరగాల్సిన ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అనే స్థితికి వెళ్లాయని, ఇదే తీవ్ర నష్టాన్ని కలగజేసిందని అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు విపరీత జోక్యాన్ని నివారించి ఉండాల్సిందని, టీజేఎస్ అధినేత కోదండరాంను ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లి ఉంటే మరో రకమైన ఫలితాలొచ్చేవని, అసలు టీడీపీనే పక్కనపెట్టి టీజేఎస్, సీపీఐలతో ముందుకు వెళితే మెరుగైన ఫలితాలు వచ్చేవనే చర్చ జరుగుతోంది.
ఇంకా నష్టం జరగకుండా ఉండాలంటే టీడీపీతో సెలవు తీసుకోవడమే మేలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే జరగనున్న రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నుంచే ఇది ప్రారంభం కావాలని, ఈ విషయంలో అధిష్టానం అడిగినా ఒప్పుకోకూడదని, టీడీపీ మైత్రిలేని కాంగ్రెస్‌కే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని అధిష్టానం వద్ద గట్టిగా చెప్పాలని భావిస్తున్నారు. ఎన్నికలు అయిన వెంటనే మిత్రపక్షాలను దూరం చేసుకోవడం మంచిది కాదని, అవసరం, సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment