సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభకు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌లో ఇప్పుడో కొత్త ముచ్చట నడుస్తోంది. ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన వారెవరు, కోవర్టు రాజకీయాలకు పాల్పడిన వారెవరన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో ఆ పార్టీ మంచి విజయాలను సొంతం చేసుకున్నా.. గెలిచిన చోట కూడా అభ్యర్థులకు సహకరించని వారు, ఇబ్బందుల పాలు చేసిన సంఘటనలు తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఓటమి పాలైన నకిరేకల్ నియోజకవర్గంలో కొందరు నాయకులు పార్టీ అభ్యర్థి విజయం కోసం ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే.. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ వర్గాలు హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఈ సారి ఎనిమిదో విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీఆర్‌ఎస్‌కే చెందిన ఓ నాయకుడు కాంగ్రెస్ శిబిరానికి లోపాయికారీగా సహకారం అందించారని, గులాబీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సిం హయ్య గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందునుంచీ ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వెళ్లారు. అయితే, స్థానికేతరుడన్న కారణంతో మొదట ఇక్కడి నాయకత్వం ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. కానీ, అప్పటికి ఆపద్ధర్మ మంత్రిగా ఉండిన జి.జగదీశ్‌రెడ్డి చొరవతో ఈ గొడవ సద్దుమణిగింది. నోముల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నాయకులందరితో మాట్లాడిన జగదీశ్‌రెడ్డి వారి చేతులు కలిపించారు. ఫలితంగా నాయకులంతా ఏకతాటిపై నిలబడి అభ్యర్థి విజయం కోసం పనిచేశారు. అయితే.. ఇక్కడే అనుకోని ఓ పరి ణామం చోటు చేసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏం జరిగింది..?
అభ్యర్థులకు చేదోడు వాదోడుగా ఉంటారని కొందరు సీనియర్ నాయకులకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. ఇలా కొద్ది రోజులపాటు ఎన్నికల వ్యవహారాలు చూసిన ఓ నాయకుడి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన అభ్యర్థి, ఇతర నేతలు.. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో ఆయనను ఆ బాధ్యతలనుంచి తప్పించి, శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్‌కు సాగర్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ విషయాలన్నీ బయటకు కనిపించినవే, కార్యకర్తలు అందరికీ తెలిసినవే. అయితే.. ఆ నాయకుడు ఏకంగా ఎదుటి పక్షానికి తమ సొంతింటి సమాచారం, ఎప్పటికప్పుడు.. ఏం జరుగుతుందో చేరవేశాడన్నది ప్రధాన అభియోగం.
దీంతోపాటు అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం అప్పజెప్పిన బడ్జెట్‌లో కొంత చేతివాటం కూడా ప్రదర్శించారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పిన సమయంలోనే, ఎన్నికల ఖర్చుల డబ్బులు కూడా అప్పజెప్పాలని చూసినా, డబ్బుల వ్యవహారం చూసే బాధ్యత తనకు వద్దని, అభ్యర్థికే ఆ డబ్బులు ఇవ్వాలనడంతో పార్టీ అభ్యర్థి నోములకే ఇచ్చారని తెలుస్తోంది. అయితే, ఎంత ఖర్చయ్యింది..? మిగిలింది ఎంత..? ఎంత అప్పజెబుతున్నారో లెక్కలు తీస్తే కనీసం రూ.50లక్షల తేడా కొట్టిందని, ఈ మొత్తం సదరు నాయకుడి చేతివాటం ఫలితమే అన్న నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. ఈ విషయం మొత్తాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక, హుజూర్‌నగర్ నియోజకవర్గంలోనూ ఓ నాయకుడు అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి దగ్గర ఖర్చుల పేర ప్రతి రోజూ కొంత లెక్క తేడా చూపించారని పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
నకిరేకల్‌లోనూ తెరవెనుక మంత్రాంగం
ఈ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. పార్టీ గుర్తు కారును పోలిన ట్రక్ చేసిన నష్టం వల్లే ఓడిపోయినట్లు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినా, దానికంటే కొందరు టీఆర్‌ఎస్ నాయకులే లోపాయికారీగా, తెరవెనుక చేసిన మంత్రాంగం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్న అభిప్రాయం బలం గా ఉంది. నాగార్జునసాగర్ లో టీఆర్‌ఎస్ విజయం సాధించినా, అక్కడా ట్రక్ గుర్తు 9,818 ఓట్లు చీల్చింది. దీంతో టీఆర్‌ఎస్ మెజారిటీ తగ్గింది.
తుంగతుర్తి నియోజకవర్గంలో ట్రక్ 3,729 ఓట్లు చీల్చినా అక్కడా అభ్యర్థి విజయం సాధించారు. కానీ, నకిరేకల్ నియోజకవర్గంలో ట్రక్ 10,383 ఓట్లు చీల్చడంతోపాటు కొందరు నాయకుల సహాయ నిరాకరణ, తమ అనుచరులను కాంగ్రెస్‌కు పనిచేయాలని పురమాయించడం వంటి చర్యలు దెబ్బకొట్టాయన్న నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన తమ పార్టీ అభ్యర్థులకు జరిగిన కోవర్ట్ రాజకీయంపై, సదరు నాయకులపై పార్టీ అధినాయకత్వం తీవ్రంగానే ఆలోచిస్తోందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment