K Jana Reddy
-
మంత్రిగా పనిచేశాడు.. సొంత వాహనం కూడా లేదు!
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డికి ఒక కుంట వ్యవసాయ భూమి కూడా లేదు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటున్న, అత్యధిక మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించి, ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి పేరున సొంత వాహనం కూడా లేదు. నివాస భవనాలూ లేకపోగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో 600 గజాల స్థలం (విలువ రూ.2,73,80,000) ఉంది. అలాగే ఆయన వద్ద రెండు లైసెన్స్డ్ తుపాకులు.. 32 బోర్ రివాల్వర్, 0.25 పిస్టల్ ఉన్నాయి. జానాకు రూ.36,21,930 విలువైన చరాస్తి, రూ.33,46,000 విలువైన స్థిరాస్తి ఉంది. ఆయన భార్య సుమతికి ఏకంగా రూ. 5,13,16,724 విలువైన చరాస్తి ఉండగా, రూ.9,88,96,260 విలువైన స్థిరాస్తి ఉంది. జానా చేతిలో రూ.3,45,000 నగదు ఉండగా ఆయన భార్య చేతిలో రూ.2,75,000 నగదు ఉంది. జానాకు ఎస్బీఐ సెక్రటేరియట్ బ్రాంచ్‌లో రూ.4,89,626, యూకో బ్యాంక్, హైదరాబాద్‌లో రూ.1,67,776 నగదు ఉన్నాయి. భార్య పేరున యూకో బ్యాంక్, హైదరాబాద్‌లో రూ.6,81,012, ఎస్బీఐ సెక్రటేరియట్ శాఖలో రూ.8,83,336 నగదు ఉన్నాయి. భారీ మొత్తంలో షేర్లు జానారెడ్డి పేరిట ఆరతి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.21,70,000 విలువైన ఈక్విటీ షేర్లు ఉండగా భార్య పేరున ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.3,85,74,560 విలువైన షేర్లు, ఆరతి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.34,26,640 విలువైన షేర్లు, తరండా హైడ్రో పవర్ ప్రైవేట్‌లిమిటెడ్‌లో రూ.35,90,000 విలువైన షేర్లు ఉన్నట్లు జానా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. నోముల భగత్ ఆస్తుల వివరాలివీ.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఆయన భార్య భవాని పేరిట పేరిట రూ.84.52 లక్షల అప్పులు ఉన్నాయి. భగత్ పేరిట రూ.55,33,719 విలువైన చరాస్తి, రూ.30,32,000 విలువైన స్థిరాస్తి ఉండగా, ఆయన భార్య పేరిట రూ.71,84,650 విలువైన చరాస్తి, రూ.1,75,000 విలువైన స్థిరాస్తి ఉంది. భగత్ చేతిలో రూ.19,000 నగదు ఉండగా ఆయన భార్య వద్ద రూ. 15,000 నగదు ఉంది. భగత్ పేరిట ఎస్బీఐ నకిరేకల్‌లో రూ.1,85,307, యాక్సిస్ బ్యాంక్, ఎల్బీ నగర్లో రూ.1,63,217 ఉన్నాయి. ఆయన భార్య పేరిట ఎస్బీఐ చౌటుప్పల్‌లో రూ.15,97,221, యాక్సిక్ బ్యాంక్, ఎల్బీ నగర్లో రూ.72,420 ఉన్నాయి. భగత్ పేరిట రెండు వాహనాలు, భార్య పేరిట ఒక వాహనం ఉన్నాయి. భగత్ పేరిట 16.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆయన భార్యకు అర ఎకరం ఉంది. భగత్‌కు వ్యవసాయేతర భూములు, నివాస భవనాలు కూడా ఉన్నాయి. -
టీఆర్ఎస్లో.. కొత్త ముచ్చట!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభకు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్లో ఇప్పుడో కొత్త ముచ్చట నడుస్తోంది. ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన వారెవరు, కోవర్టు రాజకీయాలకు పాల్పడిన వారెవరన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో ఆ పార్టీ మంచి విజయాలను సొంతం చేసుకున్నా.. గెలిచిన చోట కూడా అభ్యర్థులకు సహకరించని వారు, ఇబ్బందుల పాలు చేసిన సంఘటనలు తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఓటమి పాలైన నకిరేకల్ నియోజకవర్గంలో కొందరు నాయకులు పార్టీ అభ్యర్థి విజయం కోసం ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే.. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ వర్గాలు హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఈ సారి ఎనిమిదో విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్కే చెందిన ఓ నాయకుడు కాంగ్రెస్ శిబిరానికి లోపాయికారీగా సహకారం అందించారని, గులాబీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సిం హయ్య గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందునుంచీ ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వెళ్లారు. అయితే, స్థానికేతరుడన్న కారణంతో మొదట ఇక్కడి నాయకత్వం ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. కానీ, అప్పటికి ఆపద్ధర్మ మంత్రిగా ఉండిన జి.జగదీశ్‌రెడ్డి చొరవతో ఈ గొడవ సద్దుమణిగింది. నోముల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నాయకులందరితో మాట్లాడిన జగదీశ్‌రెడ్డి వారి చేతులు కలిపించారు. ఫలితంగా నాయకులంతా ఏకతాటిపై నిలబడి అభ్యర్థి విజయం కోసం పనిచేశారు. అయితే.. ఇక్కడే అనుకోని ఓ పరి ణామం చోటు చేసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరిగింది..? అభ్యర్థులకు చేదోడు వాదోడుగా ఉంటారని కొందరు సీనియర్ నాయకులకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. ఇలా కొద్ది రోజులపాటు ఎన్నికల వ్యవహారాలు చూసిన ఓ నాయకుడి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన అభ్యర్థి, ఇతర నేతలు.. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో ఆయనను ఆ బాధ్యతలనుంచి తప్పించి, శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్‌కు సాగర్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ విషయాలన్నీ బయటకు కనిపించినవే, కార్యకర్తలు అందరికీ తెలిసినవే. అయితే.. ఆ నాయకుడు ఏకంగా ఎదుటి పక్షానికి తమ సొంతింటి సమాచారం, ఎప్పటికప్పుడు.. ఏం జరుగుతుందో చేరవేశాడన్నది ప్రధాన అభియోగం. దీంతోపాటు అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం అప్పజెప్పిన బడ్జెట్లో కొంత చేతివాటం కూడా ప్రదర్శించారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పిన సమయంలోనే, ఎన్నికల ఖర్చుల డబ్బులు కూడా అప్పజెప్పాలని చూసినా, డబ్బుల వ్యవహారం చూసే బాధ్యత తనకు వద్దని, అభ్యర్థికే ఆ డబ్బులు ఇవ్వాలనడంతో పార్టీ అభ్యర్థి నోములకే ఇచ్చారని తెలుస్తోంది. అయితే, ఎంత ఖర్చయ్యింది..? మిగిలింది ఎంత..? ఎంత అప్పజెబుతున్నారో లెక్కలు తీస్తే కనీసం రూ.50లక్షల తేడా కొట్టిందని, ఈ మొత్తం సదరు నాయకుడి చేతివాటం ఫలితమే అన్న నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. ఈ విషయం మొత్తాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక, హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ ఓ నాయకుడు అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి దగ్గర ఖర్చుల పేర ప్రతి రోజూ కొంత లెక్క తేడా చూపించారని పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నకిరేకల్‌లోనూ తెరవెనుక మంత్రాంగం ఈ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. పార్టీ గుర్తు కారును పోలిన ట్రక్ చేసిన నష్టం వల్లే ఓడిపోయినట్లు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినా, దానికంటే కొందరు టీఆర్ఎస్ నాయకులే లోపాయికారీగా, తెరవెనుక చేసిన మంత్రాంగం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్న అభిప్రాయం బలం గా ఉంది. నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించినా, అక్కడా ట్రక్ గుర్తు 9,818 ఓట్లు చీల్చింది. దీంతో టీఆర్ఎస్ మెజారిటీ తగ్గింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ట్రక్ 3,729 ఓట్లు చీల్చినా అక్కడా అభ్యర్థి విజయం సాధించారు. కానీ, నకిరేకల్ నియోజకవర్గంలో ట్రక్ 10,383 ఓట్లు చీల్చడంతోపాటు కొందరు నాయకుల సహాయ నిరాకరణ, తమ అనుచరులను కాంగ్రెస్‌కు పనిచేయాలని పురమాయించడం వంటి చర్యలు దెబ్బకొట్టాయన్న నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన తమ పార్టీ అభ్యర్థులకు జరిగిన కోవర్ట్ రాజకీయంపై, సదరు నాయకులపై పార్టీ అధినాయకత్వం తీవ్రంగానే ఆలోచిస్తోందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. -
కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు
అవతలివారితో తప్ప ఆయనలో కన్ఫూజన్ ఉండదు. చెప్పాల్సింది విడమరిచి చెప్పేస్తారు. అజానుబాహుడు. ఆజాతశత్రువు... రాజకీయాల్లో పెద్దాయన. ఆయన వద్ద కంటెంట్‌కు కొదవలేదు. ఎదైన విషయం చెప్పల్సివచ్చినా, వ్యవహారం తేల్చుకోలేకపోయినా పార్టీ ఆయనకే మైక్ ఇస్తుంది. అటూ, ఇటూ తేల్చకుండా వెరైటిగా చెప్పడంలో ఆయన ఎక్స్పర్ట్. అర్థం చేసుకోవాలంటే తల కిందులుగా తపస్సు చేయాల్సిందేనని మీడియా ప్రతినిధులు చెబుతుంటారు. అదే విషయాన్ని ఆయన్ని అడిగితే అందులో కన్ఫూజన్ ఏమీ లేదంటూ మళ్లీ చెబుతారు. నిండుకుండలా తొణక్కుండా ఉండటం ఆయనకే సాధ్యం. ఉద్యమ సమయంలో ఆయన వైఖరే కాస్తో, కూస్తో కాంగ్రెస్‌కి కలిసి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన రికార్డ్ ఆయన సొంతం. వైరం లేకుండా ఉండి, లౌక్యంగా వ్యవహారం నడిపే జానారెడ్డికి పోటీ లేదు.నల్గొండలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు. పార్టీ వారితోనే కాదు... పౌరహాక్కుల నేతలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. జేఏసీ ఏర్పాటులో కీలకపాత్ర, ఇప్పటికీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కయ్యాడు. ఒక్క1994లో తప్ప వరుసగా ఎమ్యెల్యేగా గెలిచిన రికార్డు ఆయనది. చలకుర్తి నియోజకవర్గం ఆయన కంచుకోట. కమ్యూనిస్టు కోటలో కాంగ్రెస్ నేతగా ఎదిగారు. దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి రికార్డునూ బ్రెక్ చేశారు. వైఎస్ హాయంలో హోం శాఖలను నిర్వహించారు. తెలంగాణలో కీలక నేతగా ఎదిగిన జానారెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా జానారెడ్డి ఏ మాత్రం తన ప్రాభవాన్ని ప్రభావాన్ని కోల్పోలేదు. పూర్తి పేరు : కుందూరు జానా రెడ్డి తండ్రి : కే. వీరా రెడ్డి పుట్టిన తేది : 20 జూన్ 1946 స్వగ్రామం : అనుముల గ్రామం, (చలకుర్తి) నాగార్జున్ సాగర్, నల్గొండ కుటుంబం : భార్య సుమతీ సంతానం : రఘవీర్ రెడ్డి, జయ వీర్ రెడ్డి చదువు : హెచ్ ఎస్సీ అలవాట్లు : పున్తకాలు చదవటం నేపథ్యం : ఉపాధ్యయుడిగా మొదలు పెట్టిన ప్రస్థానం, ఎక్కువ కాలం మంత్రిగా ఆల్ టైం రికార్డు సొంతం చేసుకున్నారు.1973లో మొదలైన రాజకీయ ప్రస్థానం, మఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మినహా అన్ని పదవులు చేపట్టారు. ►1983 లో తొలిసారి ఇండిపెండెంట్‌గా గెలిచారు ►1985 లొ చలకుర్తి నియోజకవర్గం టీడీపీ తరపున గెలిచారు ► 1988 లో మంత్రివర్గం రద్దుతో ఎన్టీఆర్‌తో విభేదించి 'తెలుగు మహానాడు'పేరుతో పార్టీని స్థాపించాడు.తరువాత రాజీవ్‌గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో విలీనం చెశారు. ► 1994 లో తప్ప వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు ► 2004 లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ► 2009-2014 వరకు పంచాయితీ గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు - జీ. రేణుక -
ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వాలు చేస్తున్న పని ప్రజలకు తెలియజేస్తూ.. ప్రజల వద్దకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల కోసం ప్రభుత్వాలను ప్రశ్నిస్తామన్నారు. 70 సంవత్సరాలుగా సామరస్యం కాపాడుతూ.. ప్రజల అవసరాల కోసం చట్టాలు చేస్తూ సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందనిచెప్పుకొచ్చారు. ఆర్థికంగా,రాజకీయంగా అన్ని కులాలను బలోపేతం చేసే లక్ష్యంతో తమ పార్టీ ముందుకు సాగుతోందన్నారు. మానవ హక్కులను కాపాడటానికి అధికారంలో ఉన్నా లేకున్నా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.అన్ని వర్గాలకు ఆత్మబంధువుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. -
‘పునర్విభజన’ ఇప్పట్లో సాధ్యం కాదు: జానా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీలోని తన చాంబర్లో విలేకరులతో మాట్లా డుతూ కేంద్రం కచ్చితంగా అనుకుని, పట్టుబట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చునన్నారు. అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులు, వివిధ కారణాలతో పునర్విభజన జరిగే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీ సీట్లను 2026 దాకా పెంచేది లేదని పునర్విభజన చట్టంలో ఉందని, దానికి లోబడి సీట్లు పెంచుకోవచ్చని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని వివరించారు. పార్లమెంటులో దీనికోసం సవరణ చేయాలని, ఆ సవరణ చేస్తే దేశం మొత్తానికి చుట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పుడా సమయం కూడా లేదన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి డబ్బా కొట్టకపోతే ఆశ్చర్యపోవాలని, డబ్బా కొడితే అందులో ఆశ్చర్యం ఏముందని జానారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికంటే ముందుగా కలవడానికి వచ్చే పార్టీ ఎంఐఎం అని జానారెడ్డి పేర్కొన్నారు. జానారెడ్డి చాంబర్లో వాస్తు మార్పులు జానారెడ్డి చాంబర్లో గురువారం కొన్ని వాస్తు మార్పులను చేశారు. వాస్తుశాస్త్ర నిపుణులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు చేసిన సూచనల మేరకు ఈ మార్పులు చేశారు. వృత్తిరీత్యా ఆర్కిటెక్చర్లో నిపుణురాలు అయిన కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి దగ్గరుండి ఈ మార్పులను చేయించారు. దక్షిణానికి అభిముఖంగా ఉన్న జానారెడ్డి కుర్చీని తూర్పునకు మార్చారు. జానారెడ్డికోసం వచ్చే ఎమ్మెల్యేలు, సందర్శకులకోసం ఏర్పాటు చేసిన కుర్చీలను కూడా మార్చారు. -
‘వాయిదా తీర్మానం’పై వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో వాయిదా తీర్మానాల అంశం మూడో రోజు సమావేశాల్లో వేడి పుట్టించింది. ప్రశ్నో త్తరాలకు ముందే తామిచ్చిన వాయిదా తీర్మానాలపై నిరసన తెలిపే అవకాశమివ్వాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి పట్టుబట్టగా.. స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. అటు మంత్రి హరీశ్‌రావు కూడా కల్పించుకుని.. బీఏసీలో నిర్ణయించాక ఇప్పుడు వాయిదా తీర్మానాలపై నిరసన ఏమిటని ప్రశ్నించడం తో.. సభలో అధికార, విపక్షాల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. మూడున్నరేళ్లుగా ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాల అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్.. ఇప్పుడు భిన్నంగా వ్యవహరించడ మేమిటంటూ ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ చురకలు వేయడం మరింత వేడి పెంచింది. మైక్ ఇవ్వకపోవడంపై జానా ఆగ్రహం మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే వెంటనే ప్రతిపక్ష నేత జానారెడ్డి లేచి.. వాయిదా తీర్మానం అంశంపై నిరసన తెలుపుతామని కోరారు. కానీ ఆయన మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇవ్వలేదు. బీఏసీలో చేసిన నిర్ణయం మేరకు ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాల సంగతి చూద్దామన్నారు. మళ్లీ మళ్లీ కోరినా స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో జానా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన స్థానం నుంచి లేచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో స్పీకర్ తీరుపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో... సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. చివరికి స్పీకర్ మైక్ ఇవ్వడంతో జానారెడ్డి మాట్లాడారు. ‘‘వాయిదా తీర్మానాన్ని అంగీకరించండి, అంగీకరించకండి.. అది మీ ఇష్టం. కానీ మేం ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత. దాన్ని కూడా వినడానికి లేకుండా ఉల్లంఘిస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం..’’ అని ప్రశ్నించారు. వాయిదా తీర్మానాలు ఇస్తామని తమ పార్టీ బీఏసీలో కూడా స్పష్టం చేసిందని, వాయిదా తీర్మానంపై అనుమతి ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమయంలో మంత్రి హరీశ్‌రావు కల్పించుకుని.. ‘‘వాయిదా తీర్మానాలపై స్పీకర్ తన నిర్ణయం తెలపక ముందే వాకౌట్ చేస్తామంటే ఎలా?’’ అని ప్రశించారు. దాంతో జానారెడ్డి.. ఈ అంశంపై అన్ని పార్టీల అభిప్రాయం చెప్పేవరకు నిరసన విరమించుకుని కూర్చుంటానంటూ తిరిగి తన స్థానంలోకి వచ్చారు. ఆ సంప్రదాయం ఉందన్న బీజేపీ వాయిదా తీర్మానాల అంశంపై బీజేపీపక్ష నేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని అన్ని శాసనసభల్లో ప్రశ్నోత్తరాలకు ముందు వాయిదా తీర్మానాలు ఇచ్చే సంప్రదాయం ఉందని చెప్పారు. గతంలో టీఆర్ఎస్ సైతం ఇలా ఇచ్చిందని, వాయిదా తీర్మానాలు ఇచ్చే హక్కు ప్రతిపక్షాలకు ఉందని స్పష్టం చేశారు. జానా నిర్ణయాన్ని కాంగ్రెస్ వారే గౌరవించరు: అక్బరుద్దీన్ కిషన్‌రెడ్డి అనంతరం ఈ అంశంపై అక్బరుద్దీన్ మాట్లాడారు. ‘‘నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన 1999 నుంచి వాయిదా తీర్మానాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. కానీ లైవ్ టెలికాస్ట్‌లు వచ్చాక సభలో తమాషాలు ఎక్కువయ్యాయి. దాంతో అన్ని పార్టీల ముఖ్యమంత్రులు కూడా వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాల తర్వాత చేపట్టాలని కోరుతూ వచ్చారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలు ఇవ్వాలని బీఏసీల్లో నిర్ణయిస్తూ వచ్చారు. దీనిని మూడున్నరేళ్లు గౌరవించిన కాంగ్రెస్.. ఇప్పుడే దాన్ని మార్చాలని కోరడం ఎందుకు?.’’ అని నిలదీశారు. జానారెడ్డి సోమవారం సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోతే.. మిగతా సభ్యులు ఆయన నిర్ణయాన్ని గౌరవించకుండా ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. ఇక వాయిదా తీర్మానాలపై తర్వాత చర్చిద్దామన్న స్పీకర్.. ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దాంతో జానారెడ్డి సహా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం గ్రూప్–1 ఫలితాలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని, జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్, మంచినీటి, తదితర సమస్యలపై బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. -
‘అహంకారం, అహంభావంతో టీఆర్ఎస్ పాలన’
కరీంనగర్: రాజకీయ బిక్ష పెట్టిన కరీంనగర్‌ను కాదని సిద్ధిపేటకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ ఇవ్వడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పొన్నం ఆమరణ దీక్షకు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి సంఘీభావం తెలిపారు. టీఆర్ఎస్ అహంకారం, అహంభావంతో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మూడేళ్లు గడిచినా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఆమరణ దీక్ష కాకుండా.. గ్రామ స్థాయిలో నిరవధిక దీక్ష చేపట్టాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఇవ్వకుంటే తాము అధికారంలోకి వచ్చాక కరీంనగర్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పొన్నం ప్రభాకర్‌తో పాటు దీక్షలో డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం చేపట్టిన ఈ దీక్షకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. -
కేసీఆర్‌కు జొన్నన్నం పెడతా..
- సీఎం భోజనానికి వస్తానన్నది సరదాకే..: జానారెడ్డి - కేసీఆర్ నా దగ్గరకొచ్చే ధైర్యం చేయరు: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షనేత ఇంటికి భోజనానికి వెళ్లి.. పప్పు పెట్టినా, పులుసు పెట్టినా తిని రావాలని ఉందంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు బుధవారం అసెంబ్లీ లాబీల్లో సరదా సంభాషణలకు కారణమయ్యాయి. దీనిపై ప్రతిపక్షనేత కె.జానారెడ్డిని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మా ఇంటికి భోజనానికి రావాలనే కోరిక ఉన్నట్టు కేసీఆర్ చెప్పారు. కానీ వస్తున్నట్టుగా చెప్పలేదు. అయినా అది సరదాకు చేసిన వ్యాఖ్య. దానిలో రాజకీయం ఉందనుకోవడం లేదు. ఒకవేళ కేసీఆర్ మా ఇంటికి వస్తే జొన్న అన్నం పెడతా. కేసీఆర్‌తో నేను కలిస్తే కాంగ్రెస్ పార్టీకి లాభమా, నష్టమా అనేది కలిసిన తర్వాత విశ్లేషించుకోవచ్చు..’’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోనూ ప్రస్తావించగా ఘాటుగా స్పందించారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామికంగా, హుందాగా వ్యవహరించడం లేదని ఉత్తమ్ విమర్శించారు. ప్రతిపక్షపార్టీల నేతలను గౌరవించాలనే సంస్కారం లేని కేసీఆర్‌కు తనతో కలసి భోజనం చేసే ధైర్యం చేయరని వ్యాఖ్యానించారు. -
‘నా పదవిపై ఆసక్తి ఉంటే చెప్పొచ్చు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటికి భోజనానికి వస్తే జొన్న అన్నం పెడతానని తెలంగాణ సీఎల్పీ నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో సరదాగా ముచ్చటించారు. తన ఇంటికి భోజనానికి సీఎం కేసీఆర్ వస్తానన్నారు కానీ, వస్తున్నట్టుగా ఇంకా చెప్పలేదని చమత్కరించారు. తన పనితీరు బాగోలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ తనతో అనలేదని తెలిపారు. సీఎల్పీ నాయకుడి పదవిపై ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పాలని ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను సూచించానని జానారెడ్డి వెల్లడించారు. జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లాలని తన మనసులో ఎప్పటి నుంచో ఉందని కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. ప్రతిపక్షనేత ఇంటికి భోజనానికి వెళ్లే సాంప్రదాయం గతంలో ఉండేదని, సంజీవరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సుందరయ్య ఇంటికి భోజనానికి వెళ్లేవారని గుర్తు చేశారు. మళ్లీ అటువంటి సాంప్రదాయం రావాలని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్తానని... ఆయన పప్పు పెట్టినా, పులుసు పోసినా తిని వస్తానని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. -
'అప్పుడే నయీంని పట్టుకోవాలని ఆదేశించా'
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలపై సిట్ విచారణ మంచిదనని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. సిట్ విచారణలో వాస్తవాలు బయటకు రాకపోతే... అప్పుడు సీబీఐ విచారణ గురించి ఆలోచించాలన్నారు. శనివారం హైదరాబాద్‌లో కె.జానారెడ్డి మాట్లాడుతూ... నేను హోం మంత్రిగా ఉన్నప్పుడు నయీం గురించి కొందరు సమాచారం ఇచ్చారన్నారు. అయితే లిఖిత పూర్వకంగా మాత్రం ఎవరూ ఇవ్వలేదని చెప్పారు. నయీంను పట్టుకోవాల్సిందిగా నేను పోలీసులను ఆదేశించానని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ అతడి ఆచూకీ దొరకడం లేదని నాకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హోం మంత్రిగా నేను చేసిన కృషే కారణమని జానారెడ్డి పేర్కొన్నారు. -
'పాలేరు ప్రజా తీర్పు.. గౌరవిస్తున్నాం'
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో స్పందించారు. ప్రాలేరు ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఏదో చేస్తుందని భ్రమపడ్డారని... అందువల్లే ఆ పార్టీని గెలిపించారని చెప్పారు. పార్టీ ఓటమికి కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని విశ్లేషించుకుంటామని జానారెడ్డి వెల్లడించారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చంపేస్తారా ?
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ శాసనసభలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి శనివారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అని టీఆర్ఎస్ ప్రభుత్వన్ని నిలదీశారు. చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా అధికార టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ అక్రమాలను అన్ని ప్రజాస్వామిక వేదికలపైనా ఎండగట్టాం, ఫిర్యాదు చేశామని జానారెడ్డి గుర్తు చేశారు. ఇక అంతిమంగా ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ ఆగడాలను ఎండగడతామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో టీఆర్ఎస్ నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యన్ని రక్షించకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఇతర పార్టీ నేతలను ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలవడం అనైతికం, అక్రమం అని జానారెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని పదవులకు రాజీనామా చేయించాలని టీఆర్ఎస్ నేతలకు జానారెడ్డి సవాల్ విసిరారు. అయితే టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే చంపేస్తామంటూ తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీకి శుక్రవారం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కె. జానారెడ్డిపై విధంగా స్పందించారు. -
ఆ సవాల్ కు కట్టుబడే ఉన్నా: జానారెడ్డి
హైదరాబాద్: వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తమ పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత వహిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వరంగల్ ప్రజలు కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మలేదని అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు వెళతామని చెప్పారు. కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని భరోసాయిచ్చారు. 2019 ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పొత్తులైనా ఉండొచ్చని జానారెడ్డి అన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టుల ద్వారా రెండో పంటకు నీళ్లిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను ప్రచార సారథిగా పనిచేస్తానన్న సవాల్ కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, జానారెడ్డి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలని నిన్న కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
'ఎంతటి వారినైనా శిక్షించాల్సిందే'
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపి ఏసీబీకి దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటు నోటు వ్యవహారంలో ఎంతటి వారినైనా శిక్షించాల్సిందేనని సీఎల్పీ నేత కె. జానారెడ్డి తెలిపారు. స్టీఫెన్సన్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన ఫోన్ సంభాషణలు ఆయన వాయిస్ లానే అనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఎవరు ఎవరు వేధించాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా జానారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు కొంత రాజీ అవసరమని భావించి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా అంగీకరించాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాధ్యమైందన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు. కాంగ్రెస్ ను విమర్శించి పబ్బం గడుపుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి నేను ధూషణలకు పాల్పడలేనని.. హుందాగానే వ్యవహరిస్తానని జానారెడ్డి పేర్కొన్నారు. -
'రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రోత్సహిస్తా?'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీఎల్పీ నేత కె. జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. తన తరువాత.. తమ పార్టీ నేతను వారసుడిగా ఎన్నుకుంటాం కానీ... మరో పార్టీ నేతను ఎలా వారసుడిగా ప్రకటిస్తామని ఆయన ప్రశ్నించారు. మంగళవారం జానారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చర్యలు మాదిరిగానే ఆయన తనపై చేసిన వ్యాఖ్యలు కూడా అనాలోచితంగా ఉన్నాయన్నారు. తాను రిటైరయితే కాంగ్రెస్ నేతలను ప్రమోట్ చేస్తానే కానీ, రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రోత్సహిస్తానని జానారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్, టీడీపీ పార్టీలు ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నాయని, రాజకీయాలు కలుషితమయ్యాయని ఆయన అన్నారు. ఈ అనూహ్య పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయని, రాజకీయంగా కొనసాగి ఈ పరిస్థితులపై పోరాడాలా లేక విశ్రాంతి తీసుకోవాలా అని ఆలోచిస్తున్నానని జానారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత తెలంగాణ సీఎం కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్ పాలన ఆశించిన విధంగా లేదంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారని జానారెడ్డి వ్యాఖ్యానించారు. -
'నాది మెతక వైఖరి అనడం సరికాదు'
హైదరాబాద్: తనది మెతక వైఖరి అనడం సరికాదని... ఎవరి శైలి వారిదేనని తెలంగాణ సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో హుందాగా తన శైలికి తగ్గట్లుగా వ్యవహరిస్తున్నాని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎందుకు ఎండగట్టంలేదంటూ పార్టీ పెద్దలను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై మెతక వైఖరి సరికాదని పలువురు హస్తం నేతలు అభిప్రాయపడ్డారు. దీన్ని కాంగ్రెస్ అసమర్థగా ప్రజలు భావిస్తున్నారని సదరు పార్టీ పెద్దల వద్ద నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌లను టార్గెట్ చేయాల్సిందే నంటూ నేతలు పార్టీ పెద్దలకు సూచించారు. దీంతో అక్కడే ఉన్న కె.జానారెడ్డి.. నేతల వ్యాఖ్యాలపై పైవిధంగా స్పందించారు. అదికాక కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా కె.జానారెడ్డి అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టకుండ... ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. -
నేను చంద్రుడిని.. నా నుంచి ఎండరాదు: కె.జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘చంద్రుడు చల్లని వెన్నెలను, సూర్యుడు ఎండను ఇస్తారు. చల్లని వెన్నెలను ఇచ్చే చంద్రుడి నుంచి ఎండ వేడిమిని ఆశించలేం, అలాగే సూర్యుడి నుంచి కూడా వెన్నెల రాదు. నేను చంద్రుడి లాంటి వాడిని. నా నుంచి చల్లని వెన్నెల మాత్రమే వస్తుంది. నా పనితీరు ఇంతే. నా నుంచి వేడి రాదు’ అని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సీఎల్పీ నేతగా పనితీరు, పార్టీలో అంతర్గత వైరుధ్యాలు వంటి వాటిపై మీడియాతో అభిప్రాయాలను పంచుకున్నారు. మల్లెపూవు నుంచి సువాసన గుబాళించినట్టుగా మరోపూవు నుంచి రాదని, మరోపూవు వాసన ఇవ్వడం మల్లెపూవు వల్ల కూడా కాదన్నారు. తన పనితీరు మార్చుకోవాలని చెబుతున్నవారు, తనలా పనిచేయలేరని జానారెడ్డి వివరించారు. ‘మా పార్టీలో వేడి పుట్టించే రంగయ్యలు ఉన్నారు. మీరేది అడిగితే అది చెప్పడం ఆ రంగయ్యలకు సాధ్యం. నా గురించి ఎవరో రంగయ్య ఏదో అన్నాడని నాకు చెప్పడం, దానిపై నేనేదో మాట్లాడితే ఆ రంగయ్యలకు చెప్పడం, దానికి రంగయ్య ఏదో అనడం ఇవన్నీ అవసరమా? ఇవన్నీ మీకు వార్తలు కావొచ్చు, కానీ అవన్నీ నాకు సాధ్యం కాదు. లేని వేడిని పుట్టించాలనుకుంటున్న మా పార్టీలో రంగయ్యను అడగండి’ అని పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్దేశించి జానారెడ్డి వ్యాఖ్యానించారు. -
'నాకు ఎంపీ పదవి సరిపోదు'
-
'నాకు ఎంపీ పదవి సరిపోదు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో తాము రాయల తెలంగాణ కోరామని... కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇవ్వలేదని టీడీపీ నాయకుడు, అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. ఓ వేళ రాయల తెలంగాణ ఇచ్చి ఉంటే ... అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ... జానారెడ్డి సీఎం అయ్యేవారన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి జేసీ వచ్చారు. అసెంబ్లీ ఛాంబర్లోని పాత మిత్రుడు జానారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య అసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ప్రాంతీయ పార్టీల్లో ఉండదన్నారు. అందుకే టీడీపీలో తాను స్వేచ్ఛగా లేనన్నారు. ఎంపీ పదవి తనకు సరిపోదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఓవర్ లోడ్ అయ్యిందని చెప్పారు. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలకు ఇప్పుడు బీజేపీ వేదిక అవుతోందని అన్నారు. ఇందిరా కన్నా మోడీ పవర్‌పుల్ పీఎం అని చెప్పారు. ఎన్నికల ముందు మోడీ వేరు... ప్రధాని పదవి చేపట్టాక మోడీ వేరని తెలిపారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోతే రైతులు రోడ్డెక్కుతారని తెలిపారు. టీడీపీ, టీఆర్ఎస్.... ఏ ప్రభుత్వంపైన అయిన ఏడాది తర్వాతే కామెంట్ చేయాలని జేసీ అభిప్రాయపడ్డారు. -
రాష్ట్రానికి కాపలా ఉంటా!
* పునర్విభజన చట్టం హక్కుల కోసం పోరాడుతాం: జానా * సీఎల్పీ పదవి ఎవరడిగినా ఇచ్చేస్తా.. 2019 ఎన్నికల నాటికి రిటైర్ అవుతా * అంతా కోరుకుంటే.. ఎమ్మెల్యే కాకున్నా, సీఎం కాలేనా? అని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వచ్చే కష్టాలేమిటో తమకు తెలుసని, అందుకే పునర్విభజన చట్టంలో అన్ని హక్కులు కల్పించామని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి రానంత మాత్రాన తమ బాధ్యతల నుంచి పారిపోబోమని, ఆ హక్కులను సాధించేందుకు పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, వారి ప్రయోజనాల కోసం రాష్ట్రానికి కాపలాగా ఉంటానని జానారెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం సుదీర్ఘంగా ప్రసంగించిన జానారెడ్డి.. అనంతరం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. తీర్మానంలో మా ప్రమేయం లేదు సభలో ఒకరిది పైచేయి అంటూ ఏమీ ఉండదని, తమకు ప్రభుత్వం పట్ల మెతక వైఖరి ఏమీ లేదని జానారెడ్డి చెప్పారు. ‘‘ఏది పడితే అది మాట్లాడను. అవసరమైనప్పుడే మాట్లాడతా. విద్యుత్ తీర్మానంలో మా ప్రమేయం లేదు. మేం ప్రభుత్వానికి, టీఆర్ఎస్కు కాదు.. ప్రజలకు మద్దతుగా వారి పక్షాన ఉంటాం. ముందు లెక్కలు తేల్చండి. ఏపీ ఎంత వాడింది..? తెలంగాణ ఎంత వాడిందీ తెలిస్తే.. నిజంగా ఏపీ కరెంటును దొంగిలిస్తే తప్పకుండా మద్దతుగా ఉంటాం. తెలంగాణ భవిష్యత్ కోసం పునర్విభజన చట్టం కల్పించిన హక్కులను సాధించుకోవాల్సిందే. విద్యుత్ సమస్యను ఊహించే కదా 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు హామీ ఇచ్చింది. అన్నీ సాధించాలి. ఈ విషయంలో ప్రభుత్వానికీ అండగా ఉంటాం’’ అని జానా పేర్కొన్నారు. ఇక రిటైర్ అవుతా... ఇక తాను రిటైర్ అవుతావుతానని, 2019లో పోటీ చేయకపోవచ్చని జానారెడ్డి చెప్పారు. ‘‘రిటైర్ అయినా, పార్టీకి సేవలు అందిస్తా. సీఎల్పీ పదవి అంటారా? ఎవరడిగినా ఇచ్చేస్తా. ఈ పదవిలో ఉండడమే కష్టం. ఇన్నాళ్లూ రాజులా బతికాం. ఇప్పడు బంటు పని చేస్తున్నాం. మేం ధర్నాలు చేయబట్టే కదా ప్రభుత్వంలో ఇంతైనా స్పందన వచ్చింది. అయినా సీఎం పదవిలో ఏం ఉంది..? రసం లేదు.. పస లేదు. ఎమ్మెల్యే కాకపోయినా, అంతా కోరుకుంటే నేను సీఎం కాలేనా..?’’ అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా కు కృతజ్ఞతగా, పార్టీకి కాపలా ఉండాలనే సీఎల్పీ పదవిలో ఉన్నానన్నారు. తెలంగాణ ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నానని, రాష్ట్రా నికి కాపలా ఉంటానని జానారెడ్డి అన్నారు. -
ఊహలతో అద్భుతాలా?
* బడ్జెట్‌పై సర్కారుకు జానారెడ్డి ప్రశ్నల పరంపర * భూములమ్మి 3 నెలల్లో 6,500కోట్ల ఆదాయమెలా తెస్తారు? * ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లలో రూ. 10 వేల కోట్లు కూడా రాని విషయం తెలియదా? * 4.7% లోటును ఎలా పూడుస్తారు? * కేంద్రం నుంచి రూ. 21 వేల కోట్ల గ్రాంట్ తేవడం ఎలా సాధ్యం? * ఏ అంచనాలతో ఈ బడ్జెట్‌ను పెట్టారు.. మేమెలా నమ్మాలి? * అద్భుత, విచిత్ర బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ వ్యంగ్యాస్త్రాలు * మున్ముందు 100% అద్భుతాలు జరుగుతాయన్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ పూర్తిగా ఊహాజనితంగా ఉందని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్ హామీల అమలు ఏ మేరకు సాధ్యమన్న అంశంపై ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శించారు. ఊహాజనిత అంచనాలతో అద్భుతాలను ఎలా సృష్టిస్తారని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా జానారెడ్డి రెండు గంటల పాటు మాట్లాడారు. తన ప్రసంగంలో గత ప్రభుత్వాల్లో ఆదాయం, వృద్ధి రేటు మొదలుకొని.. ప్రస్తుత బడ్జెట్లో ప్రస్తావించిన లోటు భర్తీ, భూముల అమ్మకం, భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణం, రుణమాఫీ, గృహ నిర్మాణం, పరిశ్రమలు, విద్యుత్ వంటి అంశాలను ప్రస్తావించారు. వీటన్నింటికీ నిధులు ఎలా తెస్తారంటూ ప్రశ్నాస్త్రాలు, వ్యంగ్యోక్తులు విసిరారు. జానా చురకలపై మధ్యమధ్యలో ముఖ్యమంత్రి సహా మంత్రులు పలువురు కల్పించుకున్నా ఆయన మాత్రం తనదైన శైలిలో ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా, ప్రత్యేక హోదా దక్కేలా ఐక్యంగా పోరాడదామని ప్రభుత్వానికి సూచించారు. ఇదో అద్భుత, విచిత్ర బడ్జెట్.. చర్చను ప్రారంభిస్తూ... సరైన అధ్యయనం లేకుండా బడ్జెట్‌ను రూపొందించినట్టుగా ఉందని జానారెడ్డి అన్నారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,545 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. పది నెలల కోసం పెట్టిన ఈ బడ్జెట్లో విచిత్రకరం, అద్భుతమైన అంశం ఏంటంటే 17,318 కోట్ల ఆర్థిక లోటును అంచనా వేశారు. 4.7 శాతం లోటుకు సరిపడా నిధులు కేంద్ర ప్రభుత్వ నుంచి, అదనపు లభ్యతల నుంచి వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. ఏ అంచనాల ఆధారాలతో పెట్టారు. మేం దీన్ని ఎలా నమ్మాలి. ఆశల పల్లకిలో అంచనాలు, ఆధారాలు లేని అద్భుతమైన, విచిత్రమైన బడ్జెట్ పెట్టారు’’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. జానా వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. ‘‘మున్ముందు మీకు అద్భుతాలు, విచిత్రాలు కనిపిస్తాయి. వందశాతం తెలంగాణ ప్రజలు అద్భుతంగా పైకి రావాలనే కొట్లాడారు. 100 శాతం అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు చూసి మీరు మమ్ముల్ని పొగిడే రోజు వస్తుంది’’ అని అన్నారు. ఇందుకు జానా స్పందిస్తూ... అద్భుతాలు జరగడానికి ఇదేమీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదంటూ చురకంటించారు. ‘‘అద్భుతాలు చేస్తామంటే సహకరిస్తాం. అంతేకానీ ఆ అద్భుతాలతో ప్రజలను గందరగోళ పరచొద్దు’’ అని అన్నారు. అనంతరం లోటుపై జానా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘4.79 శాతం లోటు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఎఫ్ఆర్బీఎం చట్టం మాత్రం లోటులో 3 శాతం మాత్రమే అప్పు తేవాలని చెబుతోంది. ఇలాంటప్పుడు రూ.6,700 కోట్ల మొత్తాన్ని ఎక్కడ్నుంచి తెస్తారో ప్రభుత్వం చెప్పాలి’’ అని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి మరోమారు స్పందిస్తూ... ‘‘ఎఫ్ఆర్బీఎం ప్రకారం రూ.11 వేల కోట్లు మాత్రమే తీసుకుంటాం. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి 3 శాతాన్ని పెంచాలని ఇటీవలే ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థికమంత్రిని కోరా. ఈ ఎఫ్ఆర్బీఎంను పెంచే అవకాశం ఉంది. ఇక ఎస్‌ఓటీఆర్, ఎస్టీఆర్ ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు రుణాలు 90 శాతం వరకు తీసుకునే అవకాశం ఉంది’’ అని వివరించారు. దీనిపై జానా స్పందిస్తూ.. ‘‘మీరు సాధించవచ్చు. కానీ మాకు నమ్మకం లేదు’’ అని అన్నారు. అనంతరం భూముల అమ్మకాలపై మాట్లాడుతూ ‘‘భూములు అమ్మితే రూ.6,500 కోట్లు వస్తాయని అన్నారు. వైఎస్ హయాంలో భూములు అమ్మితే పదేళ్ల కాలంలో రూ.10 వేల కోట్లు ఉమ్మడి రాష్ట్రానికే రాలేదు. ఈ మార్చిలోగా రూ.6,500 కోట్లు ఒక్క తెలంగాణలో ఎలా తెస్తారు? అందుకు భూములు ఎక్కడున్నాయి? ఎవరి భూములు అమ్ముతారు.. ఎంత భూమిని అమ్ముతారు?’’ అని ప్రశ్నలు గుప్పించారు. ‘‘మీరు ఊహించి, నమ్మి, ఆశించిన దాన్ని మమ్ముల్ని నమ్మి, ఆశించాలని అంటే ఎలా’’ అని అన్నారు. రూ.21 వేల కోట్ల గ్రాంట్ ఎలా తెస్తారు? గ్రాంట్ ఇన్ ఎయిడ్పై జానారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ 2012-13లో రూ.7 వేల కోట్లు, 2013-14లో రూ.8,991 కోట్లు వచ్చింది. ఈ లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం రూ.21 వేల కోట్ల గ్రాంట్ తేవడం ఎలా సాధ్యం’’ అని అడిగారు. ఇదే సందర్భంలో ఉమ్మడి ఏపీ బడ్జెట్‌ను, ప్రస్తుత తెలంగాణ బడ్జెట్‌ను పోల్చుతూ చలోక్తులు విసిరారు. ‘‘ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఉమ్మడి ఏపీలో 2012-13 బడ్జెట్ రూ.1.20 లక్షల కోట్లు, 2013-14లో రూ.1.40 లక్షల కోట్లు పెడితే అది 2014-15కు రూ.1.60 లక్షల కోట్ల వరకు ఉండేది. మరి ఏపీ రూ.1.10 లక్షల కోట్లు, తెలంగాణ రూ.1.06 లక్ష కోట్లు బడ్జెట్ పెడితే అదనంగా ఉన్న రూ.50 వేల కోట్లు ఎలా వస్తాయి? ఇదో ఊహాజనిత, అద్భుత, విచిత్రమైన బడ్జెట్. ఏపీ పెట్టిందని వారికి పోటీగా పెట్టారా?’’ అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. ప్రజలకు ద్రోహం చేయకండి.. రుణమాఫీపై మాట్లాడుతూ.. ‘‘రుణమాఫీ గందరగోళంగా ఉంది. మాఫీ చేస్తామని చెప్పాక రైతులు బ్యాంకులకు చెల్లింపులు చేయలేదు. దీంతో వడ్డీలు పెరిగాయి. ఇప్పుడేమో మీరు రుణమాఫీ వల్ల 50 శాతం రుణాలు ఇచ్చారని అంటున్నారు. మిగతా 50 శాతం రైతులు ప్రైవేటు అప్పులు తెచ్చుకోవాల్సిందే. వాటికి 2 శాతం వడ్డీ కట్టినా నాలుగేళ్లలో తడిపి మోపెడవుతుంది. అప్పుడు రుణమాఫీతో లాభం ఏంటీ?’’ అని జానారెడ్డి ప్రశ్నించారు. ‘‘మమ్మల్ని మీరు ద్రోహులని తిట్టినా, తెలంగాణ ప్రజలకు మాత్రం ద్రోహం చేయకండి’’ అని అన్నారు. దీనిపై ఈటెల స్పందిస్తూ.. ‘‘ద్రోహం చేయకండి అనడం అసమంజసం. రైతుల కష్టాలు, నష్టాలు మాకు తెలుసు. మీరెన్ని రకాలుగా దెప్పిపొడిచినా రైతులకు మేలు చేసి మీతోనే భేష్ అనిపించుకుంటాం’’ అని అన్నారు. తర్వాత జానారెడ్డి భూపంపిణీపై మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఉన్న 18 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో 10 లక్షల మందికైనా 3 ఎకరాల చొప్పున భూములివ్వాలంటే ఎకరాకు కనీసం రూ.4 లక్షలు వేసినా రూ.2 లక్షల కోట్లు అవుతుంది. ఇది జరగాలంటే టీఆర్ఎస్ మూడు పర్యాయాలు అధికారంలోకి రావాలి. అది జరగదు. ప్రస్తుతం బడ్జెట్లో కేటాయించిన రూ.వెయ్యి కోట్లతో కేవలం 8,300 మందికే భూములు ఇవ్వొచ్చు’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల కలుగజేసుకొని.. ‘‘ప్రస్తుత కేటాయింపులు గతంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ఇచ్చాం. డబుల్ బెడ్ రూమ్‌లకు తర్వాత కేటాయింపులు జరుపుతాం’’ అని సమాధానమిచ్చారు. -
'పండుగ వేళ చావుడప్పు మోగడం బాధాకరం'
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగడం విషాదమని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి అన్నారు. రుణాలు లభించకపోవడం, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోవడంతో ఇప్పటివరకు 200 మందిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపారు. పండుగ వేళ రైతుల ముంగిట్లో చావుడప్పు మోగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆత్మహత్యలు నివారించేలా అన్నదాతలకు భరోసా ఇవ్వాలన్నారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25 శాతం రుణమాఫీ బ్యాంకుల్లో జమ అయినా కొత్త రుణాలు రావడం లేదని ఆరోపించారు. రుణమాఫీ జాప్యం కావడంతో రైతులు పంటబీమా అవకాశం కోల్పోతున్నారని పొన్నాల, జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
'జానారెడ్డిది సీటు కోసం ఆరాటం'
వికారాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత జానారెడ్డి పదవుల కోసం పాకులాడుతున్నారని మంత్రులు హరీష్‌రావు, మహేందర్ రెడ్డి విమర్శించారు. పొన్నాలది పదవి కోసం ఆరాటం, జానారెడ్డి సీటు కోసం ఆరాటం అంటూ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో రైతు బజార్ ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సర్వే జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రతీ కార్యకర్తను ఆదుకుంటామని మంత్రులు హామీయిచ్చారు. -
హామీల అమలుపై కార్యాచరణ ప్రకటించాలి: జానా
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని సీఎ ల్పీ నాయకుడు కె.జానారెడ్డి డిమాండ్ చేశా రు. రైతుల రుణమాఫీ అమలుకు నెల రోజు ల్లోగా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు కాలపరిమితి విధించి, చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లోగా ఎన్ని చేయగలుగుతారో పేర్కొని, మిగిలినవాటిని శీతాకాల సమావేశాల్లోగా పూర్తిచేయాలని, ఈ మేరకు ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. కొత్తరుణాలు అందక ఒకవైపు, విద్యుత్ కోతలతో మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పక్కరాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసైనా వ్యవసాయానికి ఏడుగంటల కరెంట్ ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి కేంద్రం ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలన్నారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేశారు. -
‘స్థానికత’తో తంటాలు
* తెలంగాణవారిమేనని నిరూపించుకోవడం కష్టమనే భావన * లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్న కాంగ్రెస్ నేతలు 1956కు ముందు నుంచీ ఆధారాలెలా చూపాలంటూ ప్రశ్న * ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వలస వెళ్లిన కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరం * స్థానికంగా ఉండనందున ‘ధ్రువీకరణ’ ఇవ్వలేమని తేల్చిచెబుతున్న మండలాధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులు ‘ఫీజు’ కోసం.. వారి కుటుంబం 1956 నవంబర్ 1వ తేదీకి ముందు నుంచీ ఇక్కడే నివసిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాము తెలంగాణ ప్ర జలమే అని నిరూపించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుం దనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1956కు పూర్వం నుంచి తెలంగాణలో ఉన్నట్లు ఆధారాలు చూపితేనే ‘స్థానికత’ సర్టిఫికెట్లు ఇస్తామని రెవెన్యూ అధికారులు తెగేసి చెబుతుండటం తో... ఆ ఆధారాలు ఎలా సేకరించాలంటూ ప్రజలు స్థానిక ప్ర జాప్రతినిధులు, ఎమ్మెల్యే నివాసాలకు క్యూ కడుతున్నారు. ‘ఫీజు’పై ప్రభుత్వ నిర్ణయం వల్ల ఒక్క నల్లగొండ జిల్లాలోనే దాదా పు 5 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడిందని ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి నియోజకవర్గమైన నాగార్జునసాగర్‌లో దాదాపు 70 శాతం మందికి స్థానికత సర్టిఫికెట్లు వచ్చే అవకాశమే లేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అభిప్రాయపడ్డారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జిల్లాలోని ముంపు బాధితులంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ నియోజకవర్గంలో స్థిరపడ్డారని.. వారంతా తెలంగాణ బిడ్డలేనని నిరూపించుకోవడం సాధ్యమయ్యే పనికాదని చెప్పారు. గురువారం అసెంబ్లీ వద్ద భాస్కర్‌రావు మాట్లాడుతూ... తన నియోజకవర్గం మిర్యాలగూడలోనూ దాదాపు ఇదే పరిస్థితి కన్పిస్తోందని, తమకు స్థానిక ధ్రువపత్రాలు ఇప్పించాలంటూ నిత్యం వందలాది మంది తనవద్దకు వస్తున్నారని చెప్పారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో సగం మందికి ‘స్థానికత’ను నిరూపించుకునే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. పోలవరం ముంపు గ్రామాలు మినహా భద్రాచలం డివిజన్లోని నాలుగు మండలాలు తెలంగాణలో ఉన్నాయని, ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆ మండలాల ప్రజలంతా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనర్హులవుతారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తెలంగాణలో పుడితే చాలు: జానారెడ్డి ‘‘తల్లిదండ్రులు స్థానికులైతే ఆయా కుటుంబాలన్నీ ప్రభుత్వమిచ్చే రాయితీలకు అర్హులేనని తమిళనాడు ప్రభుత్వం నిబంధన పెట్టింది. తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా 1956 నవంబర్ 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించడంవల్ల తెలంగాణ స్థానికతను నిరూపించేందుకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.’’ అని జానారెడ్డి పేర్కొన్నారు. ‘‘నల్లగొండ జిల్లా మునగాల, చిలుకూరు, నడిగూడం, కోదాడ మండలాలకు చెందిన ప్రజలెవరికీ స్థానిక ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకూడదని మండలాధికారులు నిర్ణయించారు. ఎందుకంటే మునగాల పరగణాలో ఉన్న ఈ ప్రాంతమంతా 1956కు పూర్వం సీమాంధ్రలో కలిసి ఉండటమే కారణం. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన పోలవరం ముంపు గ్రామాలు మినహా భద్రాచలం డివిజన్ ప్రజలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి..’’ ‘‘ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సురేష్ కుటుంబం 1956కు పూర్వం నుంచీ అక్కడే ఉంటోంది. అయితే వారికి ఆస్తిపాస్తులేమీ లేకపోవడంతో ఆ కుటుంబం అద్దె ఇళ్లలో నివసిస్తోంది. 1956కు పూర్వం ఇక్కడున్నట్లు ఏ ఆధారం లేనందున ఇప్పుడు వారికి స్థానిక ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు..’’ ‘‘నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాజేష్ కుటుంబం.. ఊరిలోని ఇల్లు, ఆస్తులన్నీ అమ్మేసుకుని పాతికేళ్ల కింద హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. రాజేష్ తండ్రి, తాత ముత్తాతలంతా మిర్యాలగూడకు చెందిన వారే. ఇంజనీరింగ్ చదువుతున్న రాజేష్ కుమారుడికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించాలంటే 1956కు పూర్వం నుంచే తమ కుటుంబం తెలంగాణలో నివసిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రం కావాలి. కానీ మిర్యాలగూడ తహసీల్దార్ మాత్రం రాజేష్ కుటుంబం స్థానికంగా ఉన్నట్లు ఆధారాల్లేనందున స్థానిక ధ్రువీకరణ పత్రం ఇవ్వలేమని తేల్చి చెప్పారు..’’ -
మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు మావే: జానారెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో విజయం కాంగ్రెస్‌దే విజయమని మాజీ మంత్రి కె.జానారెడ్డి అన్నారు. మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు ప్రజా ఆదరణ ఉన్నప్పటికీ మెజార్టీ స్థానాలు గెలుచుకునేంతగా ఆ పార్టీ బలపడలేదని విశ్లేషించారు. ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని టీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఎవరు పైరవీలు చేసినా ప్రయోజనం ఉండదని జానారెడ్డి అన్నారు. సీఎంగా జానారెడ్డి అన్ని అర్హతలు ఉన్నాయని దామోదర్‌రెడ్డి అన్నారు. మంత్రిగా పలు శాఖలు నిర్వహించారని, నవ తెలంగాణ నిర్మాణానికి జానారెడ్డి సేవలు అవసరమని చెప్పారు. -
'కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు అండగా నిలవాలి'
హైదరాబాద్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినందుకు సోనియా, ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర కేబినెట్ భేటీ ముగియగానే జానా రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. విశ్వసనీయతకు కాంగ్రెస్ మారు పేరు అని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పెట్టని కోటగా నిలవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నించారని జానారెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ కావాలంటూనే కాంగ్రెస్ ను విమర్శించి రాజకీయ లబ్దికి యత్నించారన్నారు. జేఏసీ మిత్రులు కూడా తమను అనుమానించారన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొన్నారని తెలిపారు. -
వచ్చారు.. వెళుతున్నారు!
-
వచ్చారు.. వెళుతున్నారు!
* ఢిల్లీ వచ్చి ఎవరినీ కలవకుండానే తిరుగుముఖం పట్టిన టీ-కాంగ్రెస్ నేతలు * జీవోఎం సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో జానారెడ్డి సహా పలువురు నేతల తిరుగుపయనం న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. కేంద్ర మంత్రివర్గ బృంద(జీవోఎం) సభ్యులతోపాటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని శుక్రవారం ఢిల్లీ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరినీ కలవకుండానే తిరుగుముఖం పట్టారు. హైకమాండ్ పెద్దలు, జీవోఎం సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడం, ఆదివారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలియడంతో చేసేదేమీలేక వెళ్లిపోయారు. వాస్తవానికి తెలంగాణ బిల్లుకు తుది రూపం ఇచ్చే పనిలో జీవోఎం నిమగ్నమై ఉండటంతో సదరు బిల్లులో ఏకే ఆంటోనీ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా ఒత్తిడి తేవాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రజాప్రతినిధులంతా నిర్ణయించారు. దీంతోపాటు సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించాలని భావించారు. అందులో భాగంగా మూడు రోజులపాటు హస్తినలో మకాం వేసి జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని షెడ్యూల్ రూపొందించుకుని పనులన్నీ వాయిదా వేసుకుని మరీ ఢిల్లీ వచ్చారు. జైపాల్‌రెడ్డి ఇంట్లో భేటీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె.జానారెడ్డి, డీకే అరుణ, పి.సుదర్శన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి పి.బలరాం నాయక్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటర మణారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్, భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ సహా పలువురు నేతలు శుక్రవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు. వారంతా నేరుగా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ కేంద్ర మంత్రులతో జీవోఎం సమావేశం కానున్న నేపథ్యంలో ఏయే అంశాలను ప్రస్తావించాలనే దానిపై కొద్దిసేపు చర్చించారు. తర్వాత జీవోఎం సభ్యులతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ఇతర హైకమాండ్ పెద్దలను కలిసేందుకు ఫోన్లో ప్రయత్నించగా, వారెవరూ ఢిల్లీలో అందుబాటులో లేరని తెలిసింది. దీంతో ఆయా నేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ఉన్నారని తెలియడంతో కనీసం ఆయననైనా కలవాలనే ఉద్దేశంతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. మరోవైపు శని, ఆది వారాల్లో కూడా జీవోఎం సభ్యులు, హైకమాండ్ పెద్దలు హస్తినలో అందుబాటులో ఉండే అవకాశాల్లేవని తేల డంతో ఇక అక్కడ ఉండటం అనవసరమనే భావనకు వచ్చా రు. జానారెడ్డి, డీకే అరుణ, సుదర్శన్‌రెడ్డి, భిక్షమయ్య గౌడ్ సహా పలువురు నేతలు సాయంత్రమే హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జీవోఎంకు నివేదిక అందజేసే బాధ్యతను జైపాల్‌రెడ్డి, రాజనర్సింహకు అప్పగించినట్లు సమాచారం. అహ్మద్‌పటేల్ అపాయింట్మెంట్ కోసం యత్నం.. కొందరు నేతలు మాత్రం పనులన్నీ వాయిదా వేసుకుని ఎలాగూ ఢిల్లీ వచ్చామని, రెండ్రోజులు ఇక్కడే ఉండి సొంత పనులు చక్కదిద్దుకుంటామని చెప్పారు. సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ ఢిల్లీలోనే ఉన్నారని సమాచారం ఉండటంతో ఆయన అపాయింట్మెంట్ కోసం యత్నిస్తున్నారు. మంత్రులంతా హైదరాబాద్ వెళ్లిన తరువాత పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో ఢిల్లీకి రావడం గమనార్హం. మరోవైపు హస్తినలోనే ఉండిపోయిన నేతలకు కేంద్ర మంత్రి బలరాం నాయక్ విందునిచ్చారు. నేడు రాహుల్‌తో డిప్యూటీ సీఎం భేటీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు శనివారం రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. -
రాజ్యాధికారంలో బీసీలకు భాగం కావాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: అన్ని రంగాల్లో వెనుకబడిన మేరు కులస్తులను ఆదుకునేందుకు పార్టీలకు అతీతంగా నేతలందరూ ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన 12వ మేరు మహా సభకు జానారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజ్యాధికారంలో బీసీల భాగస్వామ్యం ఉండాలని అన్నారు. మేరు సంఘం ప్రతిపాదించిన డిమాండ్లను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి బసవరాజు సారయ్య మాట్లాడుతూ... వెనుకబడిన తరగతులకు రావాల్సిన హక్కులు అడుక్కుంటే రావని, పోరాడి సాధించుకోవాలని సూచించారు... మేరు కులస్తుల ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించాలని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, శంకర్రావు, కేవీ కేశవులు, మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కీర్తి ప్రభాకర్, దక్షిణ భారత బీసీ కమీషన్ చైర్మన్ కేసీ కాలప్ప తదితరులు పాల్గొన్నారు. -
విద్వేషాలు పెంచే నిర్ణయాలు తగవు
సాక్షి, హైదరాబాద్: విద్వేషాలు పెంచేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండకూడదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈ నెల 7వ తేదీన ఉద్యోగ సంఘాలు సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వరాదని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. సున్నితమైన ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో లేదా సహచర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చినందుకు జానారెడ్డి పరోక్షంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై మండిపడ్డారు. గతంలో టీ జాక్ సమావేశాలకు అనుమతి ఇవ్వకుంటే.. మంత్రులపై ఒత్తిడి తెచ్చి ఒకటి రెండుసార్లు అనుమతి తీసుకున్నారని, ఇప్పుడు అనుమతి ఎలా వచ్చిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. నేడు ఢిల్లీకి జానారెడ్డి జానారెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఢిల్లీలో కొనసాగుతున్న పరిణామాలు, ఏపీ ఎన్జీఓల బహిరంగసభకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తదితర అంశాలపై అధిష్టానం పెద్దల వద్ద మాట్లాడనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తరువాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఫిర్యాదుచేసే అవకాశముందని తెలుస్తోంది. -
సిమాంధ్రుల భద్రతకు హామీ ఇస్తున్నాం-జానారెడ్డి
-
ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలి:జానారెడ్డి
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవో సంఘం చేపట్టిన సమ్మెను వెంటనే విరమించాలని రాష్ట మంత్రి కే.జానారెడ్డి ఆ సంఘం నేతలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయనతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు మంత్రుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి ప్రసంగిస్తూ... తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండు కుటుంబాలుగా విడిపోయి అభివృద్ది చెందుదామని ఆయన సీమాంధ్ర ప్రజలకు సూచించారు. కొత్త రాష్ట్రం అభివృద్దికి తాము సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలంగాణ ప్రజాప్రతినిధుల తరపున ఆయన హామీ ఇచ్చారు. ఉద్యమంలో భాగంగా ఏటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకున్న ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట విభజనకు సహకరించాలని జానారెడ్డి ఈ సందర్భంగా సీమాంధ్ర నేతులను కోరారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ఆంటోని కమిటీని కలసి వివరిస్తామని ఆయన చెప్పారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డి.శ్రీధర్ బాబు, డీ.కే.అరుణ, సుదర్శనరెడ్డిలు ఆ సమావేశంలో పాల్గొన్నారు. -
విభజనపై వెనుకడుగు లేదు: జానారెడ్డి
-
విభజనపై వెనుకడుగు లేదు: జానారెడ్డి
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వెనుకడుగు వేయదన్న నమ్మకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డి వ్యక్తం చేశారు. తెలంగాణకు అనులకూలంగా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన అసాధ్యమని ఆయన తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రజలను చైతన్య వంతులను చేసిన పాత్రికేయులను ఆయన అభినందించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరికీ నష్టం వాటిల్లకుండా రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆకాంక్షించారు. నదీ జలాలు, ఆస్తులు, ఉద్యోగాల పంపకం న్యాయబద్దంగా జరగాలన్నారు. సీమాంధ్ర సోదరులు ఆవేశంతో ఆందోళన చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణేతరులు నిశ్చితంగా ఉండొచ్చని, వారికి అన్యాయం జరిగే పరిస్థితులు వస్తే అండగా నిలబడతానని హామీయిచ్చారు. ప్రజల కోసం అవసరమయితే పార్టీయే కాదు రాజకీయాలను వీడేందుకు వెనుకాడబోనని చెప్పారు. సీమాంధ్ర విద్యార్థి, ఉద్యోగులకు నష్టం జరుగుతున్న అంశాలపై చర్చకు సిద్ధమన్నారు. ఉద్యమించకుండా సీమాంధ్ర ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. అవాంఛనీయ పరిణామాలు జరిగితే తెలుగు ప్రజలు మధ్య సామర్యస్యత శాశ్వతంగా దెబ్బతింటుందని గ్రహించాలన్నారు. శాంతి భద్రత పరిరక్షణలో పార్టీలు, ప్రజలు సహకరించాలన్నారు. 4 ఏళ్లుగా రెండు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పుడు రెండు రాష్ట్రాలు దేశం గర్వించేలా అభివృద్ధి చెందాల్సివుందన్నారు. రెండు ప్రాంతాల ఉద్యోగులు, మేధావులు, నాయకులు, విద్యార్థులు అభివృద్ధిపైనే దృష్టిసారించాలని జానారెడ్డి సూచించారు.