
మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు మావే: జానారెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో విజయం కాంగ్రెస్‌దే విజయమని మాజీ మంత్రి కె.జానారెడ్డి అన్నారు. మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌కు ప్రజా ఆదరణ ఉన్నప్పటికీ మెజార్టీ స్థానాలు గెలుచుకునేంతగా ఆ పార్టీ బలపడలేదని విశ్లేషించారు.
ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని టీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఎవరు పైరవీలు చేసినా ప్రయోజనం ఉండదని జానారెడ్డి అన్నారు.
సీఎంగా జానారెడ్డి అన్ని అర్హతలు ఉన్నాయని దామోదర్‌రెడ్డి అన్నారు. మంత్రిగా పలు శాఖలు నిర్వహించారని, నవ తెలంగాణ నిర్మాణానికి జానారెడ్డి సేవలు అవసరమని చెప్పారు.