రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవో సంఘం చేపట్టిన సమ్మెను వెంటనే విరమించాలని రాష్ట మంత్రి కే.జానారెడ్డి ఆ సంఘం నేతలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయనతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు మంత్రుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జానారెడ్డి ప్రసంగిస్తూ... తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండు కుటుంబాలుగా విడిపోయి అభివృద్ది చెందుదామని ఆయన సీమాంధ్ర ప్రజలకు సూచించారు. కొత్త రాష్ట్రం అభివృద్దికి తాము సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలంగాణ ప్రజాప్రతినిధుల తరపున ఆయన హామీ ఇచ్చారు.
ఉద్యమంలో భాగంగా ఏటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకున్న ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట విభజనకు సహకరించాలని జానారెడ్డి ఈ సందర్భంగా సీమాంధ్ర నేతులను కోరారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ఆంటోని కమిటీని కలసి వివరిస్తామని ఆయన చెప్పారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డి.శ్రీధర్ బాబు, డీ.కే.అరుణ, సుదర్శనరెడ్డిలు ఆ సమావేశంలో పాల్గొన్నారు.