లగ్జరీని వదల్లేకే బాబు సీమాంధ్రకు రావట్లేదా?
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక కార్యదర్శి కత్తి పద్మారావు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. సీఎంగా బాబు హైదరాబాద్ నుంచి పాలన సాగించడమేంటని ఆయన ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నంబూరులో ఆయన నిన్న మాట్లాడుతూ హైదరాబాద్లో అలవాటైన లగ్జరీని వదిలి ముఖ్యమంత్రి సీమాంధ్రకు రాలేకపోతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తినే సీఎంగా ఎన్నుకోవాలన్నారు.
85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే సీమాంధ్రలో ఉన్నారని వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత మహాసభ తీర్మానించిందని, విగ్రహం ఏర్పాటుకు వర్సిటీలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్నారు.