
నేను చంద్రుడిని.. నా నుంచి ఎండరాదు: కె.జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘చంద్రుడు చల్లని వెన్నెలను, సూర్యుడు ఎండను ఇస్తారు. చల్లని వెన్నెలను ఇచ్చే చంద్రుడి నుంచి ఎండ వేడిమిని ఆశించలేం, అలాగే సూర్యుడి నుంచి కూడా వెన్నెల రాదు. నేను చంద్రుడి లాంటి వాడిని. నా నుంచి చల్లని వెన్నెల మాత్రమే వస్తుంది. నా పనితీరు ఇంతే. నా నుంచి వేడి రాదు’ అని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్‌పీ) నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సీఎల్పీ నేతగా పనితీరు, పార్టీలో అంతర్గత వైరుధ్యాలు వంటి వాటిపై మీడియాతో అభిప్రాయాలను పంచుకున్నారు.
మల్లెపూవు నుంచి సువాసన గుబాళించినట్టుగా మరోపూవు నుంచి రాదని, మరోపూవు వాసన ఇవ్వడం మల్లెపూవు వల్ల కూడా కాదన్నారు. తన పనితీరు మార్చుకోవాలని చెబుతున్నవారు, తనలా పనిచేయలేరని జానారెడ్డి వివరించారు. ‘మా పార్టీలో వేడి పుట్టించే రంగయ్యలు ఉన్నారు. మీరేది అడిగితే అది చెప్పడం ఆ రంగయ్యలకు సాధ్యం. నా గురించి ఎవరో రంగయ్య ఏదో అన్నాడని నాకు చెప్పడం, దానిపై నేనేదో మాట్లాడితే ఆ రంగయ్యలకు చెప్పడం, దానికి రంగయ్య ఏదో అనడం ఇవన్నీ అవసరమా? ఇవన్నీ మీకు వార్తలు కావొచ్చు, కానీ అవన్నీ నాకు సాధ్యం కాదు. లేని వేడిని పుట్టించాలనుకుంటున్న మా పార్టీలో రంగయ్యను అడగండి’ అని పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్దేశించి జానారెడ్డి వ్యాఖ్యానించారు.