
రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయం వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్న సమయంలో అక్కడకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వచ్చారు. అనుకోకుండా తారసపడ్డ ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. వీరిద్దరూ చేతులు కలపడంతో మీడియా ప్రతినిధులు వారిని చుట్టుముట్టారు.
ఫొటోలకు ఫోజులి వ్వాలని కోరడంతో ఇద్దరు నేతలు నవ్వుతూ సీఎల్పీ కార్యాలయం లోపల ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఇద్దరూ కూర్చుని కొద్దిసేపు మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘జగ్గన్నదీ... నాదీ ఒక్కటే సిలబస్. మీడియా వాళ్లకే ఇది అర్థం కావడం లేదు. జెమిని సినిమాలో హీరో, విలన్ పాత్రల్లాంటివే మా పాత్రలు కూడా. మేమిద్దరం ఒకటే.’అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఇరువురు ఒకేపార్టీ నేతలు కలిసినా హల్‌చల్ అ య్యే పరిస్థితి అని విలేకరులు వ్యాఖ్యానించారు. దీం తో రేవంత్ స్పందిస్తూ ఇది మీడియా చేసిన పనేనన్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ..తామింకా విడాకు లు తీసుకోలేదని, విడాకులు తీసుకున్న తర్వాత కలి స్తే తప్పని, ఇప్పుడేం ఉంటుందని సరదాగా అన్నా రు. ఆ తర్వాత ఇద్దరు ఏకాంతంగా 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన గురించి మాట్లాడుకున్నామని చెప్పినా అంతర్గతంగా పలు రాజకీయ అంశాలు మాట్లాడుకున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇద్దరు నేతలూ నోరు విప్పలేదు.