
జానారెడ్డి
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డికి ఒక కుంట వ్యవసాయ భూమి కూడా లేదు.
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డికి ఒక కుంట వ్యవసాయ భూమి కూడా లేదు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటున్న, అత్యధిక మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించి, ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి పేరున సొంత వాహనం కూడా లేదు. నివాస భవనాలూ లేకపోగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో 600 గజాల స్థలం (విలువ రూ.2,73,80,000) ఉంది. అలాగే ఆయన వద్ద రెండు లైసెన్స్‌డ్ తుపాకులు.. 32 బోర్ రివాల్వర్, 0.25 పిస్టల్ ఉన్నాయి.
జానాకు రూ.36,21,930 విలువైన చరాస్తి, రూ.33,46,000 విలువైన స్థిరాస్తి ఉంది. ఆయన భార్య సుమతికి ఏకంగా రూ. 5,13,16,724 విలువైన చరాస్తి ఉండగా, రూ.9,88,96,260 విలువైన స్థిరాస్తి ఉంది. జానా చేతిలో రూ.3,45,000 నగదు ఉండగా ఆయన భార్య చేతిలో రూ.2,75,000 నగదు ఉంది. జానాకు ఎస్‌బీఐ సెక్రటేరియట్ బ్రాంచ్‌లో రూ.4,89,626, యూకో బ్యాంక్, హైదరాబాద్‌లో రూ.1,67,776 నగదు ఉన్నాయి. భార్య పేరున యూకో బ్యాంక్, హైదరాబాద్‌లో రూ.6,81,012, ఎస్‌బీఐ సెక్రటేరియట్ శాఖలో రూ.8,83,336 నగదు ఉన్నాయి.
భారీ మొత్తంలో షేర్లు
జానారెడ్డి పేరిట ఆరతి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.21,70,000 విలువైన ఈక్విటీ షేర్లు ఉండగా భార్య పేరున ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.3,85,74,560 విలువైన షేర్లు, ఆరతి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.34,26,640 విలువైన షేర్లు, తరండా హైడ్రో పవర్ ప్రైవేట్‌లిమిటెడ్‌లో రూ.35,90,000 విలువైన షేర్లు ఉన్నట్లు జానా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
నోముల భగత్ ఆస్తుల వివరాలివీ..
టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఆయన భార్య భవాని పేరిట పేరిట రూ.84.52 లక్షల అప్పులు ఉన్నాయి. భగత్ పేరిట రూ.55,33,719 విలువైన చరాస్తి, రూ.30,32,000 విలువైన స్థిరాస్తి ఉండగా, ఆయన భార్య పేరిట రూ.71,84,650 విలువైన చరాస్తి, రూ.1,75,000 విలువైన స్థిరాస్తి ఉంది. భగత్ చేతిలో రూ.19,000 నగదు ఉండగా ఆయన భార్య వద్ద రూ. 15,000 నగదు ఉంది. భగత్ పేరిట ఎస్‌బీఐ నకిరేకల్‌లో రూ.1,85,307, యాక్సిస్ బ్యాంక్, ఎల్బీ నగర్‌లో రూ.1,63,217 ఉన్నాయి.
ఆయన భార్య పేరిట ఎస్‌బీఐ చౌటుప్పల్‌లో రూ.15,97,221, యాక్సిక్ బ్యాంక్, ఎల్బీ నగర్‌లో రూ.72,420 ఉన్నాయి. భగత్ పేరిట రెండు వాహనాలు, భార్య పేరిట ఒక వాహనం ఉన్నాయి. భగత్ పేరిట 16.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆయన భార్యకు అర ఎకరం ఉంది. భగత్‌కు వ్యవసాయేతర భూములు, నివాస భవనాలు కూడా ఉన్నాయి.