
సాగర్ ఉప ఎన్నిక బరిలో నిలిచిన మహ్మద్ నెహెమ్యా..!
నిడమనూరు : గజినీ మహ్మద్ ఈ పేరు అందరికీ సుపరిచితమే.. భారతదేశంపై పలుమార్లు దండయాత్ర చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినా, ఆయన మరోమారు యుద్ధభేరి మోగించి విజయం సాధించారని పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. అదే కోవలోకి వస్తారు.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మర్రి నెహెమ్యా. ఎన్నికలు ఏవైనా నేనున్నాంటూ బరిలో నిలిచేందుకు ముందుకొస్తారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఇప్పటికి కౌన్సిలర్ నుంచి శాసనసభ, లోక్‌సభ స్థానాలకు 11సార్లు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 72ఏళ్ల వయసులో కూడా ఆయన మరో మారు సాగర్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
బుధవారం ఆయన నిడమనూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు వచ్చి ‘సాక్షి’తో ముచ్చటించారు. 1984నుంచి తుంగతుర్తి, సూర్యాపేట, చలకుర్తి, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ శాసన సభ, మిర్యాలగూడ, నల్లగొండ లోక్ సభ స్థానాలకు పోటీచేసి ఓడిపోయినట్లు తెలిపారు. 2014లో నిర్వహించిన నల్లగొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి 56వేల ఓట్లు సాధించానని తెలిపారు. తనను గెలిపించే వరకు ఎన్నికల బరిలో నిలుస్తూనే ఉంటానని నెహెమ్యా పేర్కొనడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment