
ఆ సవాల్ కు కట్టుబడే ఉన్నా: జానారెడ్డి
హైదరాబాద్: వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తమ పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత వహిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వరంగల్ ప్రజలు కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మలేదని అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు వెళతామని చెప్పారు. కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని భరోసాయిచ్చారు.
2019 ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పొత్తులైనా ఉండొచ్చని జానారెడ్డి అన్నారు.
మూడేళ్లలో ప్రాజెక్టుల ద్వారా రెండో పంటకు నీళ్లిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను ప్రచార సారథిగా పనిచేస్తానన్న సవాల్ కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, జానారెడ్డి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలని నిన్న కేసీఆర్ వ్యాఖ్యానించారు.