warangal by poll
-
ఆ సవాల్ కు కట్టుబడే ఉన్నా: జానారెడ్డి
హైదరాబాద్: వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తమ పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత వహిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వరంగల్ ప్రజలు కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మలేదని అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు వెళతామని చెప్పారు. కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని భరోసాయిచ్చారు. 2019 ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పొత్తులైనా ఉండొచ్చని జానారెడ్డి అన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టుల ద్వారా రెండో పంటకు నీళ్లిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను ప్రచార సారథిగా పనిచేస్తానన్న సవాల్ కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, జానారెడ్డి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలని నిన్న కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
రికార్డు ఆధిక్యం దిశగా టీఆర్ఎస్
-
'లోకేశ్ కు ఏ పదవి ఉందని...'
వరంగల్: కేసీఆర్ కుటుంబం ఏనాడు నేరుగా పదవులు తీసుకోలేదని, ఉద్యమాలు చేసి ప్రజల దీవెనెలతో పదవులు తీసుకుందని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... దేశం, రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు లేవా అని ఆమె ప్రశ్నించారు. కేవలం తమ కుటుంబంపై అక్కసు ఎందుకు అని అన్నారు. తల్లి జాతీయ అధ్యక్షురాలు, కొడుకు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. నారా లోకేశ్ కు ఏ పదవి ఉందని అమరావతి శంకుస్థాపనలో ఉన్నారని ప్రశ్నించారు. జానారెడ్డి, జైపాల్ రెడ్డి విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం తెచ్చేవారు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థుల చావులకు కారణం కాంగ్రెస్సే అని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాలపై కూడా దృష్టి సారిస్తున్నట్టు కవిత చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ఫలితాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రెఫరెండంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. -
నాలాంటి సీఎం ఎవరూ లేరు: కేసీఆర్
వరంగల్: పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... 2018 నాటికి రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తామని హామీ యిచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. తామే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. తర్వాత దశలో రూ. 4 వేల కోట్లతో 60 వేల ఇళ్లు కట్టించనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. అలాగే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, అంగన్ వాడీ కార్మికులకు జీతాలు పెంచామని గుర్తు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగనని చెప్పిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ లేరని కేసీఆర్ అన్నారు. రెండున్నరేళ్లలో వాటర్ గ్రిడ్ పథకాన్ని పూర్తి చేసి తెలంగాణ ఆడపడుచుల పాదాలు కడుగుతామన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష నాయకులు నోటికి తాళం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. అడ్డం, పొడవు మాట్లాడే పార్టీలకు శిక్ష వేయాలని వరంగల్ ప్రజలను ఆయన కోరారు. ప్రతిపక్షాలకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలని, తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఇదా ప్రభుత్వాన్ని నడిపించే పద్ధతి
-
కేసీఆర్ ను గట్టిగా నిలదీయండి
-
కేసీఆర్ ను గట్టిగా నిలదీయండి: వైఎస్ జగన్
పరకాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా రెండో రోజు వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పరకాలలో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ మోజుతోనే వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. ఎంపీకి మంత్రి పదవి ఇచ్చి ఉప ఎన్నిక తెచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ 18 నెలల పరిపాలనలో ఎన్నికల హామీలను నెరవేర్చలేదని వైఎస్ జగన్ విమర్శించారు. రైతు కష్టాలు, అన్నదాతల ఆత్మహత్యలపై కేసీఆర్ ను నిలదీయాలని ప్రజలకు సూచించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో రైతులు, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ 5 ఏళ్లలో 45 లక్షల ఇళ్లు కట్టిస్తే... కేసీఆర్ 18 నెలల పాలనలో 396 ఇళ్లు మాత్రమే కట్టించారని తెలిపారు. వరంగల్ లో టీఆర్ఎస్ గెలిస్తే తన పాలన అంతా బాగుందని కేసీఆర్ భావిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దన్నారు. టీడీపీ ఓటు అడిగే అధికారం లేదన్నారు. ఎన్నికల హామీలపై బీజేపీని నిలదీయాలని సూచించారు. ఓటు అడిగే అధికారం తమ పార్టీకే ఉందని వైఎస్ జగన్ అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఇవాళ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయన్నది ప్రజలు తమను తాము ప్రశ్నించుకోవాలి ఒక సవాలు విసిరి ఎన్నికలు జరిపి ఉంటే శభాష్ ముఖ్యమంత్రి అనేవాళ్లం కానీ ఓ ఎంపీతో రాజీనామా చేయించడం వల్ల ఈ ఎన్నికలు వచ్చాయి. మంత్రి పదవి కోసం వరంగల్ జిల్లాలోనే ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా వారికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎంపీని రాజీనామా చేయించి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. అందుకే ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేసీఆర్ పాలనలో కొచ్చిన 18 నెలల్లో ఒక్క వరంగల్ జిల్లాలోనే 158 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పత్తిరైతుల బాధను సీఎం కేసీఆర్ ఒక్కసారైనా ఆలకించారా? పత్తి క్వింటాలుకు రూ. 4,500 మద్దతు ధర అని చెప్పి.. రూ 3,500లకు కూడా పత్తి కొనడం లేదు దివంగత నేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు పత్తి క్వింటాలుకు రూ. 6,500 దాకా పలికింది. కేసీఆర్ 18 నెలల పాలనలో ఎన్ని ఎకరాల భూమిని దళితులకు పంచారు? ఈ 18 నెలల పాలనలో 1600 ఎకరాలు కూడా పంచలేదు అదే వైఎస్ఆర్ హయాంలో 20లక్షల 60 వేల ఎకరాల భూమిని పేదలకు పంచారు పేదవాళ్లు ఎందుకు అప్పులపాలు అవుతారని ఎప్పుడైనా కేసీఆర్ గారు ఆలోచించారా? అనారోగ్యం, రోగాల చికిత్స కోసం వడ్డీలకు అప్పులు తేవడం వల్లే పేదవాళ్లు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు అందుకే పేదలందరినీ ఆదుకునేందుకు దివంగత నేత వైఎస్ఆర్ 108 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. కుయ్యికుయ్యిమని అంబులెన్స్ వచ్చేలా ఏర్పాటు చూశారు. ఒక్కపైసా ఖర్చు లేకుండా పెద్దాస్పత్రుల్లో వైద్యం చేసేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ పాలనలో ఒక్క కొత్త అంబులెన్సును కూడా కొనలేదు. 8, 9 ఏళ్లుగా వాడుతున్న పాత అంబులెన్సులనే తిప్పుతున్నారు. ఈ రోజు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేరు మీ పాలనలో ఎందుకీ పరిస్థితి అని కేసీఆర్‌గారిని ప్రజలు ప్రశ్నించాలి చదువుల కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాలు కాకూడదని దివంగత నేత వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ సంవత్సరం మొదలై ఆరు నెలలైంది. విద్యార్థులు కూడా కాలేజీలకు కూడా వెళుతున్నారు. అయినా గత సంవత్సరం ఫీజు బాకాయిలనే ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. ఫీజులు, స్కాలర్షిప్పులు విడుదల చేయడం లేదు. ఇదా ప్రభుత్వాన్ని నడిపించే పద్ధతి అని కేసీఆర్‌ను నిలదీయండి మార్కెట్‌కు ఎప్పుడైనా వెళ్లారా? ఎప్పుడైనా కందిపప్పు కొన్నారా? కేసీఆర్ గారు? అని అడుగండి. కందిపప్పు ధర ఇప్పుడు రూ. 200 దాటింది. ఈనాడు నిత్యావసర వస్తువుల రేట్లని ఆకాశాన్నంటుతున్నాయి. ఎలా సరుకులు కొనాలి? వరి కనీస మద్దతు ధర కన్నా తక్కువకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారికి ఓటు వేసినా, వేయకపోయినా.. కేసీఆర్ ప్రభుత్వం పడిపోదు. కానీ పొరపాటున కేసీఆర్ పార్టీ గెలిస్తే మాత్రం తమ ప్రభుత్వ పాలన బాగుందని ఆయన ప్రజలను మరింతగా పట్టించుకోకుండా వదిలేసే అవకాశం ఉంది. 18 నెలల పాలనలో అది హైదరాబాద్‌లో మాత్రమే అక్షరాల 3,090 డబుల్ బెడ్ రూం ఇళ్లను మాత్రమే ప్రారంభించారు. ఇన్ని రోజుల పాలనలో మీరు కట్టించిన కొత్త ఇళ్లు ఎన్ని అని కేసీఆర్ గారు నిలదీయండి దివంగత నేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఈ ఉప ఎన్నికలో ఓడిపోతేనే కేసీర్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. కేసీఆర్‌ది చేతగాని పాలన కాంగ్రెస్ అంత అధ్వాన్న పార్టీ దేశంలోనే ఉంది. బతికున్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడ్డారు. ఆయన బ్రతికున్నంతకాలం మంచివారిగా పేర్కొన్న కాంగ్రెస్‌కు ఆయన చనిపోగానే చెడ్డనేతగా మారారు చంద్రబాబు ప్రభుత్వం కేసీఆర్ కన్నా దారుణమైన అబద్ధాలు చెపుతున్నది చంద్రబాబు ప్రభుత్వం మోసం, దారుణం తప్ప మరేమీ కాదు రాష్ట్రాన్ని విభజన సమయంలో బీజేపీ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈ ఉప ఎన్నికలో ఓట్లు అడిగే నైతిక అర్హత, విలువలు గల ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమే. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓట్లు వేసి.. అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఫ్యాన్ గుర్తుకు ప్రజలు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా. -
జననేతకు బ్రహ్మరథం పట్టిన ఓరుగల్లు
-
జననేతకు బ్రహ్మరథం పట్టిన ఓరుగల్లు
తొర్రూర్: వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తొలిరోజు ఆయన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. హైదరాబాద్ నుంచి పాలకుర్తి చేరుకున్న జననేతకు ఘన స్వాగతం లభించింది. తర్వాత భారీ జనసందోహం నడుమ ఆయన రోడ్ షో నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జఫర్ గఢ్ నుంచి వర్ధన్నపేట మండలంలోకి ప్రవేశించారు. దమ్మన్నపేట వద్ద పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, మహిళలతో ఆయన మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్డిపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో మాట్లాడారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో తొర్రూర్ చేరుకున్నారు. జననేత సభకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్ ప్రసంగానికి అద్భుత స్పందన వచ్చింది. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు హర్షధ్వానాలు మిన్నంటాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడాన్ని ఎత్తిచూపారు. కాంగ్రెస్ పార్టీ కపట కుట్రలపై ధ్వజమెత్తారు. ఓటు అడిగే హక్కు తమ పార్టీకే ఉందని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ గుర్తు 'సీలింగ్ ఫ్యాన్'కు ఓటు వేయాలని ఓరుగల్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
సోనియమ్మ ఫోన్ చేస్తేనే...
పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నది సామెత... వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అక్షరాలా ఈ అనుభవమే ఎదురైంది. వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకుని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు కబురు చేసింది. సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. అంతకు ముందు టికెట్ ఇవ్వండంటూ సర్వే కోరినా పట్టించుకోని కాంగ్రెస్ అవసరానికి కాళ్ల బేరానికి వచ్చింది. సర్వే మాత్రం తక్కువ తిన్నాడా మరి కొద్ది గంటల్లో నామినేషన్ల గడువు ముగుస్తున్న దశలో పార్టీ అధినేత సోనియాగాంధీ ఫోన్ చేస్తే తప్ప తాను నామినేషన్ వేయనని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ గంట సేపు నానా హైరానా పడ్డారట. ఈ విషయాన్ని ఢిల్లీకి చేరవేశారు గానీ సోనియమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుందో తెలియక పార్టీ నేతల్లో కంగారు...నేతలు కంగారు పడుతుండగానే సర్వేకు సోనియా ఫోన్ చేసి పోటీ చేయమని చెప్పడం, నేతలకు సమాచారం ఇచ్చేలోపే ఆయన వరంగల్ పయనం కావడం అన్నీ రెండు గంటల్లో జరిగిపోయాయి. అప్పుడు గానీ కాంగ్రెస్ నేతల ఉత్కంఠకు తెరపడలేదు. -
కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే
♦ రాజయ్య నివాసంలో ఘటనతో మార్పు ♦ పార్టీకి నష్టం కలుగుతుందనే భావనతో టీపీసీసీ చర్యలు ♦ ఖాళీ బి-ఫారంతో వరంగల్‌కు ఉత్తమ్ ♦ ముందుగా ముగ్గురు అభ్యర్థులతో నామినేషన్ ♦ అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం సర్వేకు అవకాశం సాక్షి, వరంగల్, హైదరాబాద్: అనూహ్య పరిణామాల నేపథ్యంలో వరంగల్ లోక్‌సభ స్థానంలో తమ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ మార్చింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను రంగంలోకి దించింది. తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న సిరిసిల్ల రాజయ్య నివాసంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు పిల్లలు సజీవ దహనమైన నేపథ్యంలో ఈ పరిణామాలు జరిగాయి. ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో కూడా ఉండే పరిస్థితి లేదని, రాజయ్యకు అనుకూలంగా ఓట్లు అడిగే నైతికత కూడా ఉండదని టీపీసీసీ నేతలు తీవ్ర ఆందోళన చెందారు. సిరిసిల్ల రాజయ్యను అభ్యర్థిగా కొనసాగిస్తే పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో అభ్యర్థిని మార్చారు. ఉత్తమ్ బిజీ బిజీ... సిరిసిల్ల రాజయ్యను మార్చాలన్న నిర్ణయానికి అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ అందిన వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లకు గడువు ఉండడంతో అవకాశం ఉన్న పార్టీ నేతలతో నామినేషన్ వేయించాలని జిల్లా నేతలకు సూచించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి జి.విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సమయంలో ఉత్తమ్ వరంగల్‌కు ప్రయాణిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోనూ, జిల్లా నేతలు, పార్టీ అభ్యర్థులతో ఫోన్ల ద్వారా సమన్వయం చేశారు. నామినేషన్ కేంద్రానికి 5 నిమిషాలు ముందుగా చేరుకుని సర్వే సత్యనారాయణకు బీ-ఫారాన్ని అందించారు. అంతకుముందు సిరిసిల్ల రాజయ్యకు జారీచేసిన బీ-ఫారాన్ని ఉపసంహరించుకున్నారు. సర్వే సత్యనారాయణ 1985లో హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో సిద్ధిపేట ఎంపీగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆ నియోజకవర్గం రద్దయింది. దాంతో 2009లో రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలో పోటీ చేసి గెలిచి.. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా అనూహ్య పరిణామాల మధ్య వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కి నష్టం కలిగించదు: జానారెడ్డి రాజయ్య నివాసంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, దానివల్ల పార్టీకి నష్టమేమీ ఉండదని సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి అన్నారు. ఆ దుర్ఘటనతో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారన్నారు. ప్రమాదానికి కారణాలు, వాస్తవాలన్నీ పోలీసులు, కోర్టు విచారణలో తేలుతుందని... ఆ అంశాలపై తాము మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని, అభ్యర్థులపై అభియోగాలు ఉండటం సహజమేనని వ్యాఖ్యానించారు. కోలుకున్నాం.. కొట్లాడుతాం: ఉత్తమ్ రాజయ్య నివాసంలో జరిగిన ఘటనతో కాంగ్రెస్‌కు నష్టమేనని, అభ్యర్థి మార్పు ద్వారా ఆ నష్టాన్ని అధిగమించామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాజయ్య నివాసంలో జరిగిన దుర్ఘటన బాధాకరమన్నారు. అయితే అది రాజయ్య వ్యక్తిగత అంశమని.. దాని ప్రభావం పార్టీ శ్రేణులపై, ప్రజలపై ఉండదని చెప్పారు. టీఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ఓడించి, ఘన విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. -
వరంగల్ టిక్కెట్ దక్కించుకున్న సర్వే
-
టీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనం
-
'టీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనం'
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు. హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. మంగళవారం తెలంగాణ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ క్యాసినో పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఎవరూ చేయనన్ని వాగ్దానాలు ఆయన చేశారని, రాజకీయాల్లో ఇన్ని హామీలు ఇచ్చిన వారిని తాను చూడలేదని జైపాల్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు, రుణమాఫీ, పేదలకు ఇళ్లు విషయంలో హేతుబద్దత లేకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
కడియం వర్సెస్ రాజయ్య
పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఒకరినొకరు కౌగిలించుకుని నవ్వులు చిందించారు. ఆ మరుసటి రోజే స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన పార్టీ నియోజకవర్గ సమావేశంలో వారి అనుచరులు ఘర్షణ పడ్డారు. సమావేశంలో రాజయ్య కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరు న్నికల వేళ అధికార పార్టీకి ఇబ్బందులు వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్కు.. ఆ పార్టీ కీలక నేతలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య ఆధిపత్యపోరు ఇబ్బందికరంగా మారుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న వర్గపోరు ప్రస్తుత ఉప ఎన్నిక తరుణంలో మరింత పెరుగుతోంది. ఉప ఎన్నిక ప్రచారానికి టీఆర్ఎస్ శ్రేణులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సెగ్మెంట్లో ప్రతిపక్ష పార్టీలతో కంటే సొంత పార్టీలోని వర్గాలతోనే పోటీ పడాల్సిన పరిస్థితి ఉందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక రావడానికి కారణమైన ఇద్దరి మధ్య వర్గపోరు పార్టీకి నష్టం చేసేలా ఉందని అంటున్నారు. పదవుల్లో ఉన్న ఇద్దరు కీలక నేతలు ఇప్పటికైనా వర్గపోరుకు తెరవేయకుంటే ఉప ఎన్నికలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అంటున్నారు. మొదటి నుంచీ ఆధిపత్యపోరు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మధ్య మొదటి నుంచీ ఆధిపత్యపోరు ఉంది. వీరిద్దరు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందినవారే. వేర్వేరు పార్టీల్లో ఉన్న ఈ ఇద్దరు నేతలు టీఆర్ఎస్లోకి వచ్చారు. అయినా పంచారుుతీ మాత్రం ఆగకుండా కొనసాగుతూనే ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి, కాంగ్రెస్ తరుపున తాటికొండ రాజయ్య 1999, 2008, 2009, 2012 ఎన్నికల్లో తలపడ్డారు. చెరి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ టీఆర్ఎస్లో చేరారు. సాధారణ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇద్దరు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. తమ నేత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే డిమాండ్లతో రెండు వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరిగాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల సమయంలోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. గత సాధారణ ఎన్నికల్లో కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా, తాటికొండ రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్గానికి చెక్ పెట్టేందుకు రాజయ్య వ్యూహం రచించారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ కమిటీలు, ఎంపీపీ ఎన్నికలు... అన్ని విషయాల్లోనూ తమ వర్గమే ఉండేలా చేశారు. కడియం శ్రీహరి వర్గీయులు సైతం దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. మారిన రాజకీయ పరిస్థితులలో టి.రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ పరిణామంలో కడియం వర్గీయులు ఆధిపత్యం కోసం.. దీన్ని నిలువరించేందుకు రాజయ్య వర్గీయులు ప్రయత్నిస్తునే ఉన్నారు. -
కేసీఆర్‌ది రాజకీయ జూదం: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజకీయ జూదంవల్లనే వరంగల్‌కు ఉప ఎన్నిక జరుగుతోందని, ఈ ఎన్నికలో కేసీఆర్‌ను ప్రజలే బర్తరఫ్ చేయాలని పీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను అకారణంగా, ఏకపక్షంగా బర్తరఫ్ చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధిచెప్పాలన్నారు. కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణను ఎందుకు దాస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సోమేశ్ కుమార్ బలిపశువు అయ్యారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను నమ్ముకున్న వారికి ఇదే గతి పడుతుందని గుర్తుంచుకోవాలని శ్రవణ్ హెచ్చరించారు. ఇందిరకు నివాళి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్‌పటేల్ జయంతి కార్యక్రమాలను గాంధీభవన్‌లో శనివారం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు డి.శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆకుల లలిత తదితరులు నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు.