
కేసీఆర్‌ది రాజకీయ జూదం: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజకీయ జూదంవల్లనే వరంగల్‌కు ఉప ఎన్నిక జరుగుతోందని, ఈ ఎన్నికలో కేసీఆర్‌ను ప్రజలే బర్తరఫ్ చేయాలని పీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను అకారణంగా, ఏకపక్షంగా బర్తరఫ్ చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధిచెప్పాలన్నారు. కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణను ఎందుకు దాస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సోమేశ్ కుమార్ బలిపశువు అయ్యారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను నమ్ముకున్న వారికి ఇదే గతి పడుతుందని గుర్తుంచుకోవాలని శ్రవణ్ హెచ్చరించారు.
ఇందిరకు నివాళి
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్‌పటేల్ జయంతి కార్యక్రమాలను గాంధీభవన్‌లో శనివారం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు డి.శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆకుల లలిత తదితరులు నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు.