
కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే
♦ రాజయ్య నివాసంలో ఘటనతో మార్పు
♦ పార్టీకి నష్టం కలుగుతుందనే భావనతో టీపీసీసీ చర్యలు
♦ ఖాళీ బి-ఫారంతో వరంగల్‌కు ఉత్తమ్
♦ ముందుగా ముగ్గురు అభ్యర్థులతో నామినేషన్
♦ అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం సర్వేకు అవకాశం
సాక్షి, వరంగల్, హైదరాబాద్: అనూహ్య పరిణామాల నేపథ్యంలో వరంగల్ లోక్‌సభ స్థానంలో తమ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ మార్చింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను రంగంలోకి దించింది. తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న సిరిసిల్ల రాజయ్య నివాసంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు పిల్లలు సజీవ దహనమైన నేపథ్యంలో ఈ పరిణామాలు జరిగాయి. ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో కూడా ఉండే పరిస్థితి లేదని, రాజయ్యకు అనుకూలంగా ఓట్లు అడిగే నైతికత కూడా ఉండదని టీపీసీసీ నేతలు తీవ్ర ఆందోళన చెందారు. సిరిసిల్ల రాజయ్యను అభ్యర్థిగా కొనసాగిస్తే పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో అభ్యర్థిని మార్చారు.
ఉత్తమ్ బిజీ బిజీ...
సిరిసిల్ల రాజయ్యను మార్చాలన్న నిర్ణయానికి అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ అందిన వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్‌కు బయలుదేరి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లకు గడువు ఉండడంతో అవకాశం ఉన్న పార్టీ నేతలతో నామినేషన్ వేయించాలని జిల్లా నేతలకు సూచించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి జి.విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సమయంలో ఉత్తమ్ వరంగల్‌కు ప్రయాణిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోనూ, జిల్లా నేతలు, పార్టీ అభ్యర్థులతో ఫోన్ల ద్వారా సమన్వయం చేశారు. నామినేషన్ కేంద్రానికి 5 నిమిషాలు ముందుగా చేరుకుని సర్వే సత్యనారాయణకు బీ-ఫారాన్ని అందించారు. అంతకుముందు సిరిసిల్ల రాజయ్యకు జారీచేసిన బీ-ఫారాన్ని ఉపసంహరించుకున్నారు. సర్వే సత్యనారాయణ 1985లో హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో సిద్ధిపేట ఎంపీగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆ నియోజకవర్గం రద్దయింది. దాంతో 2009లో రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో పోటీ చేసి గెలిచి.. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా అనూహ్య పరిణామాల మధ్య వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దిగారు.
కాంగ్రెస్‌కి నష్టం కలిగించదు: జానారెడ్డి
రాజయ్య నివాసంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, దానివల్ల పార్టీకి నష్టమేమీ ఉండదని సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి అన్నారు. ఆ దుర్ఘటనతో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారన్నారు. ప్రమాదానికి కారణాలు, వాస్తవాలన్నీ పోలీసులు, కోర్టు విచారణలో తేలుతుందని... ఆ అంశాలపై తాము మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని, అభ్యర్థులపై అభియోగాలు ఉండటం సహజమేనని వ్యాఖ్యానించారు.
కోలుకున్నాం.. కొట్లాడుతాం: ఉత్తమ్
రాజయ్య నివాసంలో జరిగిన ఘటనతో కాంగ్రెస్‌కు నష్టమేనని, అభ్యర్థి మార్పు ద్వారా ఆ నష్టాన్ని అధిగమించామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాజయ్య నివాసంలో జరిగిన దుర్ఘటన బాధాకరమన్నారు. అయితే అది రాజయ్య వ్యక్తిగత అంశమని.. దాని ప్రభావం పార్టీ శ్రేణులపై, ప్రజలపై ఉండదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికల్లో ఓడించి, ఘన విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.