గాంధీ భవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు( అంతర్ చిత్రంలో సర్వే సత్యనారాయణ)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఆదివారం గాంధీ భవన్‌లో జరిగిన సమావేశంలో కొట్లాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఇతర నేతలతో వాగ్వాదానికి దిగడంతోపాటు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఓ నేతపై దాడికి దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి. కుంతియాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనను అడ్డుకోబోయిన పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై దాడికి పాల్పడ్డారు. ఆయనపై వాటర్ బాటిల్ విసిరారు. దీంతో ఆగ్రహించిన కిషన్... సర్వేతో బాహాబాహీకి సిద్ధమవగా ఇతర నేతలు వారిని నిలువరించి సర్వేను సమావేశం నుంచి బయటకు పంపారు.
అనంతరం ఆయనపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. ఉత్తమ్ అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల సమావేశం జరిగింది. ఈ భేటీకి కుంతియాతోపాటు ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణ, పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు. టీపీసీసీ వర్గాల ప్రకారం... ఈ సమావేశంలో సర్వే హల్‌చల్ చేశారు. పార్టీ ఓటమిపై సమీక్షించే హక్కు కుంతియా, ఉత్తమ్‌లకు లేదని మండిపడ్డారు.
కుంతియా టికెట్లు అమ్ముకున్నారని, పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం విషయంలోనూ నష్టం చేశారని ఆరోపించారు. ఆయన కారణంగానే పార్టీ ఓడిపోతే మళ్లీ ఆయనే సమీక్షలు నిర్వహించడమేంటని నిలదీశా>రు. అలాగే ఉత్తమ్ వైఖరి కూడా ఓటమికి కారణమైందన్నారు. ఈ సందర్భంగా కుంతియానుద్దేశించి పరుష పదజాలంతో దూషణలకు దిగారు. దీంతో ఆయన్ను అడ్డుకునేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ ప్రయత్నించగా తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌తో కిషన్‌పై సర్వే దాడి చేశారు. ఈ సమయంలో మరో ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించినా సర్వే శాంతించలేదు. ఈ పరిస్థితుల్లో కిషన్, సర్వేలు పరస్పరం దాడి చేసుకునే వరకు పరిస్థితి రావడంతో నేతలు వారించి సర్వేను సమావేశం నుంచి బయటకు పంపారు.
ఘర్షణకు దిగినందుకే క్రమశిక్షణ చర్యలు...
ఈ పరిణామం అనంతరం సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. కుంతియా, ఉత్తమ్‌లపై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేశారని, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై దాడికి పాల్పడ్డారని, సమావేశంలో సంబంధం లేని అంశాలు మాట్లాడుతూ నేతలను నిందించి ఘర్షణకు దిగినందుకు ఆయన్ను క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసినట్లు తెలిపాయి. అధిష్టానం ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి.
వారిద్దరూ టీఆర్‌ఎస్ కోవర్టులు: సర్వే
కాంగ్రెస్ నుంచి తనను సస్పెండ్ చేయడంపై సర్వే సత్యనారాయణ మండిపడ్డారు. తనను సస్పెండ్ చేసే అధికారం టీపీసీసీలో ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఏఐసీసీ సభ్యుడైన తాను కేంద్ర మంత్రిగా పనిచేశానని, సోనియాకు మాత్రమే తాను విధేయుడినని చెప్పారు. మాజీ మంత్రి డి.కె.అరుణ ఇచ్చిన విందుకు హాజరైన సర్వే అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్, కుంతియాల వల్లే పార్టీ ఓడిపోయిందని, పార్టీ ఓటమిపై మళ్లీ వారే సమీక్ష చేయడాన్ని ప్రశ్నించానన్నారు. దీంతో వారే తనపై రౌడీ మూకలను ఎగదోశారని, వారికి గట్టిగానే సమాధానం చెప్పానన్నారు.
అసలు సమీక్షలు చేయాలని అధిష్టానం వారికి చెప్పలేదన్నారు. పోటీ చేయని వాళ్లు సమీక్షలో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ఉత్తమ్, కుంతియాలు టికెట్లు అమ్ముకున్నారని, టీఆర్‌ఎస్‌కు కోవర్టులుగా పనిచేశారని, పూర్తి ఆధారాలతో ఒకట్రెండు రోజుల్లో అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రేపటి నుంచి వారి భరతం పడతానని, పదవులు ఊడపీకిస్తానని సర్వే హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment