
'లోకేశ్ కు ఏ పదవి ఉందని...'
వరంగల్: కేసీఆర్ కుటుంబం ఏనాడు నేరుగా పదవులు తీసుకోలేదని, ఉద్యమాలు చేసి ప్రజల దీవెనెలతో పదవులు తీసుకుందని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... దేశం, రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు లేవా అని ఆమె ప్రశ్నించారు. కేవలం తమ కుటుంబంపై అక్కసు ఎందుకు అని అన్నారు. తల్లి జాతీయ అధ్యక్షురాలు, కొడుకు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. నారా లోకేశ్ కు ఏ పదవి ఉందని అమరావతి శంకుస్థాపనలో ఉన్నారని ప్రశ్నించారు.
జానారెడ్డి, జైపాల్ రెడ్డి విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం తెచ్చేవారు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థుల చావులకు కారణం కాంగ్రెస్సే అని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాలపై కూడా దృష్టి సారిస్తున్నట్టు కవిత చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ఫలితాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రెఫరెండంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.