కడియం వర్సెస్ రాజయ్య
పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఒకరినొకరు కౌగిలించుకుని నవ్వులు చిందించారు. ఆ మరుసటి రోజే స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన పార్టీ నియోజకవర్గ సమావేశంలో వారి అనుచరులు ఘర్షణ పడ్డారు. సమావేశంలో రాజయ్య కూడా ఉన్నారు.
ఇద్దరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరు
న్నికల వేళ అధికార పార్టీకి ఇబ్బందులు
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్‌కు.. ఆ పార్టీ కీలక నేతలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య ఆధిపత్యపోరు ఇబ్బందికరంగా మారుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న వర్గపోరు ప్రస్తుత ఉప ఎన్నిక తరుణంలో మరింత పెరుగుతోంది. ఉప ఎన్నిక ప్రచారానికి టీఆర్‌ఎస్ శ్రేణులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు.
ఈ సెగ్మెంట్‌లో ప్రతిపక్ష పార్టీలతో కంటే సొంత పార్టీలోని వర్గాలతోనే పోటీ పడాల్సిన పరిస్థితి ఉందని టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక రావడానికి కారణమైన ఇద్దరి మధ్య వర్గపోరు పార్టీకి నష్టం చేసేలా ఉందని అంటున్నారు. పదవుల్లో ఉన్న ఇద్దరు కీలక నేతలు ఇప్పటికైనా వర్గపోరుకు తెరవేయకుంటే ఉప ఎన్నికలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అంటున్నారు.
మొదటి నుంచీ ఆధిపత్యపోరు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మధ్య మొదటి నుంచీ ఆధిపత్యపోరు ఉంది. వీరిద్దరు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందినవారే. వేర్వేరు పార్టీల్లో ఉన్న ఈ ఇద్దరు నేతలు టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. అయినా పంచారుుతీ మాత్రం ఆగకుండా కొనసాగుతూనే ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి, కాంగ్రెస్ తరుపున తాటికొండ రాజయ్య 1999, 2008, 2009, 2012 ఎన్నికల్లో తలపడ్డారు. చెరి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరారు.
సాధారణ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇద్దరు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. తమ నేత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే డిమాండ్లతో రెండు వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరిగాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల సమయంలోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. గత సాధారణ ఎన్నికల్లో కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా, తాటికొండ రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు.
ఆ తర్వాత రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్గానికి చెక్ పెట్టేందుకు రాజయ్య వ్యూహం రచించారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ కమిటీలు, ఎంపీపీ ఎన్నికలు... అన్ని విషయాల్లోనూ తమ వర్గమే ఉండేలా చేశారు. కడియం శ్రీహరి వర్గీయులు సైతం దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. మారిన రాజకీయ పరిస్థితులలో టి.రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ పరిణామంలో కడియం వర్గీయులు ఆధిపత్యం కోసం.. దీన్ని నిలువరించేందుకు రాజయ్య వర్గీయులు ప్రయత్నిస్తునే ఉన్నారు.