సాక్షి, హైదరాబాద్: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలో సీనియర్ నేతల నడుమ జరుగుతున్న మాటల యుద్ధంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం మధ్యాహ్నాం ప్రగతి భవన్‌లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కేటీఆర్ సమావేశమై ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించారు.
గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్ కడియం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయపరంగానే కాదు.. వ్యక్తిగత విమర్శలకు సైతం ఇద్దరూ వెనుకాడడం లేదు. ఈ తరుణంలో పార్టీ పరువును బజారుకీడ్చడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఇవాళ్టి భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంలో.. రాజయ్యను మందలించిన ఆయన.. ఇంకోసారి అలాంటి పని చేయొద్దని వారించినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ‘‘ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఇంతటితో ఈ వివాదం ముగించాలని, ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని.. లేకుంటే తీవ పరిణామాలు ఉంటాయ’’ని కేటీఆర్ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు ఆయన కడియంతోనూ భేటీ కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కడియం-రాజయ్య వైరం ఈనాటిది కాదు!
మాజీ ఉపముఖ్యమంత్రులైన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు.. మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆధిపత్య పోరు సహజంగానే కొనసాగుతూ వస్తోంది. 2019 సెప్టెంబర్‌లో వేర్వేరుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన యాత్ర రెండు వర్గాల మధ్య విభేదాలకు ఆజ్యం పోయగా.. ఆ తర్వాత పరిణామాలు కూడా మరింత దూరం పెంచాయి. ఎవరికీ వారుగా నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
ఫ్లెక్సీలు, ప్రొటోకాల్ వివాదం.. అంటూ ఇరువర్గాల మధ్యన తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 20 రోజుల వరకు కూడా పరోక్షంగా ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు.. ఈ మధ్య కాస్త దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్వరం మరింత పెంచుకోవడంతో.. అధిష్టానం ఈ విమర్శలను తీవ్రంగా పరిగణించింది.
ఇదీ చదవండి: నేను నోరు విప్పితే రాజయ్య కుటుంబం సూసైడ్ చేస్కోవాలి-కడియం
Comments
Please login to add a commentAdd a comment