జననేతకు బ్రహ్మరథం పట్టిన ఓరుగల్లు
తొర్రూర్: వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తొలిరోజు ఆయన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. హైదరాబాద్ నుంచి పాలకుర్తి చేరుకున్న జననేతకు ఘన స్వాగతం లభించింది. తర్వాత భారీ జనసందోహం నడుమ ఆయన రోడ్ షో నిర్వహించారు.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జఫర్ గఢ్ నుంచి వర్ధన్నపేట మండలంలోకి ప్రవేశించారు. దమ్మన్నపేట వద్ద పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, మహిళలతో ఆయన మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్డిపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో మాట్లాడారు.
రాత్రి 7 గంటల ప్రాంతంలో తొర్రూర్ చేరుకున్నారు. జననేత సభకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్ ప్రసంగానికి అద్భుత స్పందన వచ్చింది. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు హర్షధ్వానాలు మిన్నంటాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడాన్ని ఎత్తిచూపారు. కాంగ్రెస్ పార్టీ కపట కుట్రలపై ధ్వజమెత్తారు. ఓటు అడిగే హక్కు తమ పార్టీకే ఉందని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ గుర్తు 'సీలింగ్ ఫ్యాన్'కు ఓటు వేయాలని ఓరుగల్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.