సోనియమ్మ ఫోన్ చేస్తేనే...
పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నది సామెత... వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అక్షరాలా ఈ అనుభవమే ఎదురైంది. వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకుని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు కబురు చేసింది.
సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. అంతకు ముందు టికెట్ ఇవ్వండంటూ సర్వే కోరినా పట్టించుకోని కాంగ్రెస్ అవసరానికి కాళ్ల బేరానికి వచ్చింది. సర్వే మాత్రం తక్కువ తిన్నాడా మరి కొద్ది గంటల్లో నామినేషన్ల గడువు ముగుస్తున్న దశలో పార్టీ అధినేత సోనియాగాంధీ ఫోన్ చేస్తే తప్ప తాను నామినేషన్ వేయనని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ గంట సేపు నానా హైరానా పడ్డారట.
ఈ విషయాన్ని ఢిల్లీకి చేరవేశారు గానీ సోనియమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుందో తెలియక పార్టీ నేతల్లో కంగారు...నేతలు కంగారు పడుతుండగానే సర్వేకు సోనియా ఫోన్ చేసి పోటీ చేయమని చెప్పడం, నేతలకు సమాచారం ఇచ్చేలోపే ఆయన వరంగల్ పయనం కావడం అన్నీ రెండు గంటల్లో జరిగిపోయాయి. అప్పుడు గానీ కాంగ్రెస్ నేతల ఉత్కంఠకు తెరపడలేదు.