'నాకు ఎంపీ పదవి సరిపోదు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో తాము రాయల తెలంగాణ కోరామని... కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇవ్వలేదని టీడీపీ నాయకుడు, అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. ఓ వేళ రాయల తెలంగాణ ఇచ్చి ఉంటే ... అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ... జానారెడ్డి సీఎం అయ్యేవారన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి జేసీ వచ్చారు. అసెంబ్లీ ఛాంబర్లోని పాత మిత్రుడు జానారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య అసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ప్రాంతీయ పార్టీల్లో ఉండదన్నారు. అందుకే టీడీపీలో తాను స్వేచ్ఛగా లేనన్నారు. ఎంపీ పదవి తనకు సరిపోదన్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఓవర్ లోడ్ అయ్యిందని చెప్పారు. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలకు ఇప్పుడు బీజేపీ వేదిక అవుతోందని అన్నారు. ఇందిరా కన్నా మోడీ పవర్పుల్ పీఎం అని చెప్పారు. ఎన్నికల ముందు మోడీ వేరు... ప్రధాని పదవి చేపట్టాక మోడీ వేరని తెలిపారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోతే రైతులు రోడ్డెక్కుతారని తెలిపారు. టీడీపీ, టీఆర్ఎస్.... ఏ ప్రభుత్వంపైన అయిన ఏడాది తర్వాతే కామెంట్ చేయాలని జేసీ అభిప్రాయపడ్డారు.