సాక్షి, హైదరాబాద్: శాసనసభలో వాయిదా తీర్మానాల అంశం మూడో రోజు సమావేశాల్లో వేడి పుట్టించింది. ప్రశ్నో త్తరాలకు ముందే తామిచ్చిన వాయిదా తీర్మానాలపై నిరసన తెలిపే అవకాశమివ్వాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి పట్టుబట్టగా.. స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. అటు మంత్రి హరీశ్‌రావు కూడా కల్పించుకుని.. బీఏసీలో నిర్ణయించాక ఇప్పుడు వాయిదా తీర్మానాలపై నిరసన ఏమిటని ప్రశ్నించడం తో.. సభలో అధికార, విపక్షాల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. మూడున్నరేళ్లుగా ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాల అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్.. ఇప్పుడు భిన్నంగా వ్యవహరించడ మేమిటంటూ ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ చురకలు వేయడం మరింత వేడి పెంచింది.
మైక్ ఇవ్వకపోవడంపై జానా ఆగ్రహం
మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే వెంటనే ప్రతిపక్ష నేత జానారెడ్డి లేచి.. వాయిదా తీర్మానం అంశంపై నిరసన తెలుపుతామని కోరారు. కానీ ఆయన మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇవ్వలేదు. బీఏసీలో చేసిన నిర్ణయం మేరకు ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాల సంగతి చూద్దామన్నారు. మళ్లీ మళ్లీ కోరినా స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో జానా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన స్థానం నుంచి లేచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో స్పీకర్ తీరుపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో... సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
చివరికి స్పీకర్ మైక్ ఇవ్వడంతో జానారెడ్డి మాట్లాడారు. ‘‘వాయిదా తీర్మానాన్ని అంగీకరించండి, అంగీకరించకండి.. అది మీ ఇష్టం. కానీ మేం ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత. దాన్ని కూడా వినడానికి లేకుండా ఉల్లంఘిస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం..’’ అని ప్రశ్నించారు. వాయిదా తీర్మానాలు ఇస్తామని తమ పార్టీ బీఏసీలో కూడా స్పష్టం చేసిందని, వాయిదా తీర్మానంపై అనుమతి ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమయంలో మంత్రి హరీశ్‌రావు కల్పించుకుని.. ‘‘వాయిదా తీర్మానాలపై స్పీకర్ తన నిర్ణయం తెలపక ముందే వాకౌట్ చేస్తామంటే ఎలా?’’ అని ప్రశించారు. దాంతో జానారెడ్డి.. ఈ అంశంపై అన్ని పార్టీల అభిప్రాయం చెప్పేవరకు నిరసన విరమించుకుని కూర్చుంటానంటూ తిరిగి తన స్థానంలోకి వచ్చారు.
ఆ సంప్రదాయం ఉందన్న బీజేపీ
వాయిదా తీర్మానాల అంశంపై బీజేపీపక్ష నేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని అన్ని శాసనసభల్లో ప్రశ్నోత్తరాలకు ముందు వాయిదా తీర్మానాలు ఇచ్చే సంప్రదాయం ఉందని చెప్పారు. గతంలో టీఆర్‌ఎస్ సైతం ఇలా ఇచ్చిందని, వాయిదా తీర్మానాలు ఇచ్చే హక్కు ప్రతిపక్షాలకు ఉందని స్పష్టం చేశారు.
జానా నిర్ణయాన్ని కాంగ్రెస్ వారే గౌరవించరు: అక్బరుద్దీన్
కిషన్‌రెడ్డి అనంతరం ఈ అంశంపై అక్బరుద్దీన్ మాట్లాడారు. ‘‘నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన 1999 నుంచి వాయిదా తీర్మానాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. కానీ లైవ్ టెలికాస్ట్‌లు వచ్చాక సభలో తమాషాలు ఎక్కువయ్యాయి. దాంతో అన్ని పార్టీల ముఖ్యమంత్రులు కూడా వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాల తర్వాత చేపట్టాలని కోరుతూ వచ్చారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలు ఇవ్వాలని బీఏసీల్లో నిర్ణయిస్తూ వచ్చారు. దీనిని మూడున్నరేళ్లు గౌరవించిన కాంగ్రెస్.. ఇప్పుడే దాన్ని మార్చాలని కోరడం ఎందుకు?.’’ అని నిలదీశారు.
జానారెడ్డి సోమవారం సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోతే.. మిగతా సభ్యులు ఆయన నిర్ణయాన్ని గౌరవించకుండా ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. ఇక వాయిదా తీర్మానాలపై తర్వాత చర్చిద్దామన్న స్పీకర్.. ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దాంతో జానారెడ్డి సహా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం గ్రూప్–1 ఫలితాలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని, జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్, మంచినీటి, తదితర సమస్యలపై బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment