గెటవుట్.. జేసీ దివాకర్‌రెడ్డి చిందులు | JC Diwakar Reddy Ready Quit MP Post | Sakshi
Sakshi News home page

‘రాజీ’నామా డ్రామా!

Published Thu, Jul 19 2018 9:02 PM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

JC Diwakar Reddy Ready Quit MP Post - Sakshi

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

సాక్షి, అనంతపురం: బెదిరింపు రాజకీయాలతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రోజంతా పొలిటికల్‌ డ్రామాను రక్తి కట్టించారు. తనకు అలవాటైన విద్యను ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్‌లో మీడియా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో రేపు చర్చ జరగనున్న నేపథ్యంలో జేసీ రచ్చ కెక్కారు. టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్టుగా మీడియాకు లీకులు ఇచ్చారు.

పార్టీ విప్‌ జారీ చేసినా పార్లమెంట్‌ సమావేశాలకు వెళ్లబోనంటూ నిన్నటి నుంచి ఊదరగొట్టారు. కానీ ఈరోజు సాయంత్రానికి ప్లేటు ఫిరాయించారు. రేపు ఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతానని, అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొంటానని ముక్తాయించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి మేరకు నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పుకొచ్చారు. తాను బెదిరింపు రాజకీయాలకు పాల్పడటం లేదని చిర్రుబుర్రులాడారు. బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారన్న ఓ మీడియా ప్రతినిధిని ‘గేటవుట్’  అంటూ కసిరారు. పనిలో పనిగా మరో ‘డ్రామా’కు తెరతీశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. రాజీనామాపై తన నిర్ణయాన్ని శుక్రవారం సాయంత్రం తర్వాత ప్రకటిస్తానని తెలిపారు.

రోజంతా రాజకీయ డ్రామా...
రెండో రోజూ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకాకుండా జేసీ దివాకర్‌రెడ్డి తనదైన శైలిలో నాటకాన్ని రక్తి కట్టించారు. టీడీపీలో తన మాట చెల్లుబాటు కానందున పార్లమెంట్‌కు హాజరుకాబోనని లీకులు వదిలారు. సొంత పార్టీలో తన ప్రత్యర్థి ఎమ్మెల్యే ప్రభా​కర్‌ చౌదరికి చెక్‌ పెట్టేందుకు ఈ సందర్భాన్ని బాగా వాడుకున్నారు. జేసీని బుజ్జగించేందుకు ప్రభాకర్‌ చౌదరిని తన దగ్గరకు పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడారు. వీరిద్దరి సమావేశం ముగియగానే జేసీ పట్టుసడలించారు. మరోవైపు అనంతపురంలో రోడ్ల వెడల్పునకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై విడుదల చేయడంతో జేసీ పూర్తిగా దిగివచ్చారు. చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేయడంతో రేపు పార్లమెంట్‌కు హాజరవుతానని ప్రకటించారు. అయితే రాజీనామా అస్త్రంతో రాజకీయ డ్రామాను ఆయన కొనసాగించడం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement