‘నా పదవిపై ఆసక్తి ఉంటే చెప్పొచ్చు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటికి భోజనానికి వస్తే జొన్న అన్నం పెడతానని తెలంగాణ సీఎల్పీ నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో సరదాగా ముచ్చటించారు. తన ఇంటికి భోజనానికి సీఎం కేసీఆర్ వస్తానన్నారు కానీ, వస్తున్నట్టుగా ఇంకా చెప్పలేదని చమత్కరించారు. తన పనితీరు బాగోలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ తనతో అనలేదని తెలిపారు. సీఎల్పీ నాయకుడి పదవిపై ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పాలని ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను సూచించానని జానారెడ్డి వెల్లడించారు.
జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లాలని తన మనసులో ఎప్పటి నుంచో ఉందని కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. ప్రతిపక్షనేత ఇంటికి భోజనానికి వెళ్లే సాంప్రదాయం గతంలో ఉండేదని, సంజీవరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సుందరయ్య ఇంటికి భోజనానికి వెళ్లేవారని గుర్తు చేశారు. మళ్లీ అటువంటి సాంప్రదాయం రావాలని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్తానని... ఆయన పప్పు పెట్టినా, పులుసు పోసినా తిని వస్తానని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.