రాష్ట్రానికి కాపలా ఉంటా!
* పునర్విభజన చట్టం హక్కుల కోసం పోరాడుతాం: జానా
* సీఎల్పీ పదవి ఎవరడిగినా ఇచ్చేస్తా.. 2019 ఎన్నికల నాటికి రిటైర్ అవుతా
* అంతా కోరుకుంటే.. ఎమ్మెల్యే కాకున్నా, సీఎం కాలేనా? అని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వచ్చే కష్టాలేమిటో తమకు తెలుసని, అందుకే పునర్విభజన చట్టంలో అన్ని హక్కులు కల్పించామని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి రానంత మాత్రాన తమ బాధ్యతల నుంచి పారిపోబోమని, ఆ హక్కులను సాధించేందుకు పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, వారి ప్రయోజనాల కోసం రాష్ట్రానికి కాపలాగా ఉంటానని జానారెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం సుదీర్ఘంగా ప్రసంగించిన జానారెడ్డి.. అనంతరం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు.
తీర్మానంలో మా ప్రమేయం లేదు
సభలో ఒకరిది పైచేయి అంటూ ఏమీ ఉండదని, తమకు ప్రభుత్వం పట్ల మెతక వైఖరి ఏమీ లేదని జానారెడ్డి చెప్పారు. ‘‘ఏది పడితే అది మాట్లాడను. అవసరమైనప్పుడే మాట్లాడతా. విద్యుత్ తీర్మానంలో మా ప్రమేయం లేదు. మేం ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్‌కు కాదు.. ప్రజలకు మద్దతుగా వారి పక్షాన ఉంటాం. ముందు లెక్కలు తేల్చండి. ఏపీ ఎంత వాడింది..? తెలంగాణ ఎంత వాడిందీ తెలిస్తే.. నిజంగా ఏపీ కరెంటును దొంగిలిస్తే తప్పకుండా మద్దతుగా ఉంటాం. తెలంగాణ భవిష్యత్ కోసం పునర్విభజన చట్టం కల్పించిన హక్కులను సాధించుకోవాల్సిందే. విద్యుత్ సమస్యను ఊహించే కదా 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు హామీ ఇచ్చింది. అన్నీ సాధించాలి. ఈ విషయంలో ప్రభుత్వానికీ అండగా ఉంటాం’’ అని జానా పేర్కొన్నారు.
ఇక రిటైర్ అవుతా...
ఇక తాను రిటైర్ అవుతావుతానని, 2019లో పోటీ చేయకపోవచ్చని జానారెడ్డి చెప్పారు. ‘‘రిటైర్ అయినా, పార్టీకి సేవలు అందిస్తా. సీఎల్పీ పదవి అంటారా? ఎవరడిగినా ఇచ్చేస్తా. ఈ పదవిలో ఉండడమే కష్టం. ఇన్నాళ్లూ రాజులా బతికాం. ఇప్పడు బంటు పని చేస్తున్నాం. మేం ధర్నాలు చేయబట్టే కదా ప్రభుత్వంలో ఇంతైనా స్పందన వచ్చింది. అయినా సీఎం పదవిలో ఏం ఉంది..? రసం లేదు.. పస లేదు. ఎమ్మెల్యే కాకపోయినా, అంతా కోరుకుంటే నేను సీఎం కాలేనా..?’’ అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా కు కృతజ్ఞతగా, పార్టీకి కాపలా ఉండాలనే సీఎల్పీ పదవిలో ఉన్నానన్నారు. తెలంగాణ ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నానని, రాష్ట్రా నికి కాపలా ఉంటానని జానారెడ్డి అన్నారు.