విభజనపై వెనుకడుగు లేదు: జానారెడ్డి
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వెనుకడుగు వేయదన్న నమ్మకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డి వ్యక్తం చేశారు. తెలంగాణకు అనులకూలంగా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన అసాధ్యమని ఆయన తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రజలను చైతన్య వంతులను చేసిన పాత్రికేయులను ఆయన అభినందించారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరికీ నష్టం వాటిల్లకుండా రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆకాంక్షించారు. నదీ జలాలు, ఆస్తులు, ఉద్యోగాల పంపకం న్యాయబద్దంగా జరగాలన్నారు. సీమాంధ్ర సోదరులు ఆవేశంతో ఆందోళన చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణేతరులు నిశ్చితంగా ఉండొచ్చని, వారికి అన్యాయం జరిగే పరిస్థితులు వస్తే అండగా నిలబడతానని హామీయిచ్చారు. ప్రజల కోసం అవసరమయితే పార్టీయే కాదు రాజకీయాలను వీడేందుకు వెనుకాడబోనని చెప్పారు.
సీమాంధ్ర విద్యార్థి, ఉద్యోగులకు నష్టం జరుగుతున్న అంశాలపై చర్చకు సిద్ధమన్నారు. ఉద్యమించకుండా సీమాంధ్ర ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. అవాంఛనీయ పరిణామాలు జరిగితే తెలుగు ప్రజలు మధ్య సామర్యస్యత శాశ్వతంగా దెబ్బతింటుందని గ్రహించాలన్నారు. శాంతి భద్రత పరిరక్షణలో పార్టీలు, ప్రజలు సహకరించాలన్నారు. 4 ఏళ్లుగా రెండు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పుడు రెండు రాష్ట్రాలు దేశం గర్వించేలా అభివృద్ధి చెందాల్సివుందన్నారు. రెండు ప్రాంతాల ఉద్యోగులు, మేధావులు, నాయకులు, విద్యార్థులు అభివృద్ధిపైనే దృష్టిసారించాలని జానారెడ్డి సూచించారు.