రైల్రోకో చేస్తే కఠిన చర్యలు : డీజీపీ
హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ దినేష్ రెడ్డి గురువారం డీజీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైల్రోకో చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉద్యమకారులను ఆయన హెచ్చరించారు. రైళ్లను ఆపినా, రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినా నాన్బెయిల్బుల్ కేసులు నమోదు చేస్తామని డీజీపీ వెల్లడించారు. రైల్రోకో కార్యక్రమాలను ఆషామాషీగా తీసుకోవద్దని ఆయన అన్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కఠిన చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైల్రోకోలపై నిషేధం ఉందన్ని....నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలిపితే ఎలాంటి అభ్యంతరం లేదని డీజీపీ అన్నారు. రైల్రోకోలను నిరోధించేందుకు తగినంత భద్రత ఉందని డీజీపీ తెలిపారు.
జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసినవారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరికలు చేశారు. ఆందోళనలను వీడియో తీస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో సమైక్యాంధ్ర ఉద్యమాలకు అనుమతి లేదని డీజీపీ తెలిపారు. నిరసన తెలపాలనుకుంటున్న ఉద్యోగులు పికెటింగ్లు చేయరాదన్నారు. అలాగే హైదరాబాద్ లో ర్యాలీలకు అనుమతి లేదన్నారు.