పదవుల కోసం పాకులాట ఎందుకు: వీరశివారెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మల్యే వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. విభజన జరుగుతుందని తెలిసినా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు మిన్నకుండిపోయారని ఆయన బుధవారమిక్కడ ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలు నేతలకు పట్టవా అని ప్రశ్నించిన ఆయన రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడేవారిని ప్రజలు క్షమించరని వీరశివారెడ్డి అన్నారు. నాలుగు నెలల మంత్రి పదవుల కోసం పాకులాట ఎందుకని ఆయన మండిపడ్డడారు.
పనిలో పనిగా వీరశివారెడ్డి టీఆర్ఎస్ పార్టీపై శివాలెత్తారు. కేసీఆర్పై భౌతిక దాడి చేయాల్సిన పని రాష్ట్రంలో ఎవరికి లేదన్నారు. రాజకీయ వారసత్వం, ఆస్తుల కోసమో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో, లేక పార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేకేలకే ఈ ఆలోచన ఉండొచ్చని ఆరోపించారు. విజయశాంతి ఇప్పటికే ఆ పార్టీకి గుడ్బై చెప్పారని, మరో ఎనిమిది మంది కాంగ్రెస్లో చేరుతారనే ఆందోళనలతోనే టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ను హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని వీరశివరెడ్డి ఎద్దేవా చేశారు.