హైకోర్టు విభజన చేయకపోవడం వెనుక కుట్ర
టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ హైకోర్టును విభజించకపోవడం వెనుక కుట్ర దాగుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఆరోపించారు. వీలైనంత త్వరగా హైకోర్టును విభజిస్తామని లోక్‌సభలో మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఏడాదైనా దానిని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెట్టిన సందర్భంగా హైకోర్టు విభజనపై తాము వ్యక్తం చేసిన అనుమానాలు నిజమవుతున్నాయన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం, న్యాయవాదుల జేఏసీ బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్ మాట్లాడారు.
సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు, జేఏసీ కన్వీనర్ ఎం.రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కింది స్థాయి న్యాయ వ్యవస్థలో న్యాయాధికారుల విభజనకు సంబంధించి హైకోర్టు రూపొందిం చిన ప్రాథమిక కేటాయింపుల జాబితా వెనుక కూడా కుట్ర ఉందని వినోద్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయాధికారులను తెలంగాణకు కేటాయిస్తూ హైకోర్టు జాబితా రూపొందించిందని, ఏపీలో పెద్ద సంఖ్యలో ఖాళీలుండగా అక్కడి అధికారులను తెలంగాణకు కేటాయించడంలో ఆం తర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేటాయంపులు రాజ్యాంగ విరుద్ధమే కాక, సహజ న్యాయ సూత్రాలకు సైతం విరుద్ధంగా ఉన్నాయన్నారు. న్యాయం చేయాల్సిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మౌనంగా ఉంటున్నారని, ఇది సరికాదన్నా రు. తెలంగాణ వారికి న్యాయం చేయకుంటే ఏసీజేను నిలదీసేందుకు వెనుకాడబోమని ఈ విషయాన్ని తాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టం చేస్తున్నానని అన్నారు.
ఇరిటేట్ చేయవద్దు: తెలంగాణ న్యాయాధికారులకు హైకోర్టు అన్యాయం చేస్తే ఊరుకోబోమని వినోద్ హెచ్చరించారు. ప్రశాంతంగా వెళుతున్న తమను ఇరిటేట్ చేయవద్దన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏసీజే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీరు చెట్టు కింద కూర్చొని తీర్పునిచ్చే వారి కంటే దారుణంగా ఉం దన్నారు. ఏపీలో 30 పోస్టులు ఖాళీగా పెట్టుకుని 110 మందిని తెలంగాణకు కేటాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. హైకోర్టు చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే కేటాయింపుల జాబితాపై వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలంగాణకు ఏసీజే చేసిందేమీ లేదు: సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు మాట్లాడుతూ ప్రస్తుత ఏసీజే వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తాము కలిసిన ప్రతిసారీ తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒప్పుకునే ఏసీజే న్యాయం మాత్రం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణకు వ్యతిరేంగా నిర్ణయాలు తీసుకుంటూ, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.