నిజామాబాద్ జిల్లా సదాశివపేటలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్
46 వేల చెరువుల పునరుద్ధరణ లక్ష్యం
6 వేలకు పైగా చెరువుల్లో కొనసాగుతున్న పనులు
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు పూర్వ వైభవం తెచ్చిపెట్టేదిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణను చేపట్టింది. కృష్ణా, గోదావరిల కింద 262 టీఎంసీల నీటిని వినియోగించుకుని.. చెరువుల కింద ఉన్న ప్రతి ఎకరాన్ని తడపడమే లక్ష్యంగా.. ‘మిషన్ కాకతీయ’ ప్రాజెక్టును చేపట్టింది. ఏటా 9 వేల చెరువుల చొప్పున ఐదేళ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరించి.. 20.09 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తీసుకురానుంది. మహాయజ్ఞంలా మొదలైన ఈ కార్యక్రమంపై రాష్ట్ర రైతాంగంలో భారీ ఆశలున్నాయి. ఈ పథకానికి చిన్నచిన్న అవాంతరాలు ఎదురవుతున్నా.. పనులు మాత్రం ఆశించిన స్థాయిలోనే జరుగుతున్నాయి. ‘మిషన్ కాకతీయ’కు మొత్తంగా రూ.20 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. తొలిఏడాది రూ.2 వేల కోట్లు కేటాయించిన సర్కారు.. 9,627 చెరువుల పునరుద్ధరణకు నిర్ణయించింది. నాబార్డు, జైకా, ప్రపంచ బ్యాంకుల ద్వారా మరో రూ.4 వేల కోట్ల వరకు సమీకరించే పనిలో పడింది. ఇక ఇప్పటికే ఎన్నారైలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల నుంచి రూ.43 కోట్ల మేర విరాళాలు అందాయి.
సమస్యలు ఎన్నో..: చెరువుల పనులకు సంబంధించిన టెండర్ల నుంచే వివాదాలు ముసురుకున్నా వాటిని అడ్డుకోవడంలో ప్రభుత్వం కొంత సఫలమైంది. అయితే శాఖల మధ్య ఇంకా పూర్తిస్థాయిలో సమన్వయం సాధించాల్సి ఉంది. కబ్జాల నివారణకు రెవెన్యూ సహకారం, అటవీ భూముల్లో పనులకు ఆ శాఖ మద్దతు, పూడిక తరలింపునకు వ్యయసాయశాఖ సహకారం వంటివి ఇంకా పూర్తిస్థాయిలో అందడం లేదు. ముఖ్యంగా చెరువుల ఎఫ్‌ఆర్‌ఎల్‌లను గుర్తించడంలో, శిఖం కబ్జాలను గుర్తించి అడ్డుకోవడంలో రెవెన్యూ శాఖ నుంచి సహకారం లేదు. దీనికితోడు పరిపాలనా అనుమతులు, టెండర్లలో జాప్యంతో ఈ ఏడాది నిర్ణీత లక్ష్యాలను చేరుకోలేకపోయారు. వచ్చే ఏడాదైనా ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, డిసెంబర్‌లోనే పనులు మొదలుపెడితే ప్రయోజనం ఉంటుంది. పునరుద్ధరిస్తున్న చెరువులను రక్షించుకునేందుకు కబ్జా కాకుండా చర్యలు, హద్దుల నిర్ణయం, రాజకీయ జోక్యాన్ని తగ్గించడం వంటివాటిపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సి ఉంది.