మిషన్ కాకతీయ భేష్!
శాసన మండలిలో ‘చెరువుల’ పథకానికి ప్రశంసల జల్లు
- ఈ యజ్ఞాన్ని అందరం కలసి చేద్దామన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి
- మిషన్ కాకతీయ ఫలితాలు కనబడుతున్నాయన్న పూల రవీందర్
- చెరువుల్లో చేపలు వేయడం అభినందనీయం: షబ్బీర్ అలీ
- చెరువులు నిండిన ఆనందం నా జీవితంలో ఎప్పుడూ కలగలేదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’పథకంపై శాసన మండలి ప్రశంసల జల్లు కురిపించింది. చెరువుల పునరుద్ధరణ అద్భుత యజ్ఞమని అన్ని పక్షాల సభ్యులూ అభినందించారు. మిషన్ కాకతీయతోనే ఈ ఏడాది భూగర్భ జలమట్టం పెరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. చెరువులు నిండి పంట పొలాలకు నీళ్లు పారుతున్నప్పుడు తనకు కలిగిన ఆనందం జీవితంలో ఇంతకుముందెప్పుడూ కలగలేదని మంత్రి హరీశ్‌రావు పేర్కొనగా.. ఈ యజ్ఞాన్ని అందరం కలసి కొనసాగిద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం శాసనమండలిలో మిషన్ కాకతీయపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తొలుత చర్చను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు.. మిషన్ కాకతీయ అమలుపై మండలి సభ్యులకు వివరణ ఇచ్చారు. ఆదిలాబాద్ బోథ్‌లోని కరక్వాడలో 4,900 ఎకరాల ఆయకట్టున్న చెరువు తెగిపోతే అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదని.. మిషన్ కాకతీయ తొలి దశలో 13.17 కోట్లతో ఆ చెరువుకు మరమ్మతు చేయించామన్నారు. ఇప్పుడు ఆ చెరువు నుంచి 5,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని, బజార్‌హత్నూర్‌లోనూ అంతే పెద్ద చెరువును పునరుద్ధరించి వినియోగంలోకి తెచ్చామన్నారు.
ఉత్తమ పథకమిది
పునరుద్ధరణతో చెరువులు నీటితో నిం డాయని.. వాటిలో 100 శాతం సబ్సిడీతో చేప విత్తనాలు వేయడం అభినందనీయమని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మత్స్యకార సొసైటీలకు వలలు, అమ్ముకునేందుకు మహిళలకు స్కూటీ వాహనాలు, నిల్వ చేసుకునేందుకు ఐస్‌డబ్బాలను ఇవ్వాలని సూచించారు. మిషన్ కాకతీయ పథకాన్ని మెచ్చుకున్న నీతి ఆయోగ్ కూడా రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సూచిం చిందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి చెప్పారు. ఈ పథకంలో అవకతవకలు జరగకుండా విజిలెన్స్, పర్యవేక్షక విభాగాలను బలోపేతం చేయాలని సూచిం చారు. ఇక టీఆర్‌ఎస్ సభ్యుడు నారదాసు లక్ష్మణరావు ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల పరిస్థితిని వివరిస్తూ.. ‘తలాపునా పారుతుంది గోదారి’అనే పాట వినిపించారు.
మిషన్ కాకతీయ అద్భుత పథకమని, మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంతో రైతాంగం చాలా సంతోషపడుతోందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని బీజేపీ సభ్యుడు రాంచందర్‌రావు చెప్పారు. మరో సభ్యుడు పూల రవీందర్ మాట్లాడుతూ.. చెరువుల పునరుద్ధరణ ద్వారా తెలంగాణ రైతాంగం గుండెల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని అభినందించారు. వేలకోట్లు వెచ్చించి లిఫ్ట్ పథకాలు ఏర్పాటు చేయడం కన్నా, మిషన్ కాకతీయ గొప్ప పథకమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకం నిరంతరం కొనసాగాలని ఎంఐఏం ఎమ్మెల్సీ అల్తాఫ్ రజ్వీ సూచించారు.
అందరి సహకారంతోనే..
గ్రామీణ ప్రాంత ప్రజల సహకారంతోనే మిషన్ కాకతీ య విజయవంతమైందని హరీశ్‌రావు చెప్పారు. ‘‘మండుటెండలో ఎమ్మెల్యేలు, అధికారులు కష్టపడి పనిచేశారు. ప్రజా ఉద్యమంలా కార్యక్రమం సాగింది. రాష్ట్రానికి గొప్ప సంపదగా ఉన్న చెరువులను భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించాలనే ఆలోచనతో 43వేల చెరువులను జియో ట్యాగింగ్ చేశాం. భవిష్యత్తులో వాటిని కబ్జా చేసే అవకాశం కూడా ఉండదు’’అని తెలిపారు.
అంతా అవినీతే..అవును అది మీ హయాంలోనే..
కోమటిరెడ్డి, హరీశ్‌ల మధ్య ఆసక్తికర చర్చ
‘మిషన్ కాకతీయ’పై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, హరీశ్‌రావుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తొలుత కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత అవినీతికర శాఖ ఏదైనా ఉందంటే అది చిన్న నీటిపారుదల శాఖ మాత్రమేనని, అక్కడ పర్సంటేజీలు లేకుండా ఎలాంటి పనులూ జరగవని ఆరోపించారు. అసలు పనులు చేయకుండానే అధికారులు, కాంట్రాక్టర్లు ఎంబీలు చేసుకుని, బిల్లులు తీసుకుంటారని విమర్శించారు. స్పందించిన హరీశ్‌రావు.. ‘‘మీ ప్రభుత్వాల హయాంలో అలా ఉంటేది. మీరు ఎంపీగా ఉన్నప్పుడు బాగా తన్లాడినట్టున్నరు. ఆ అనుభవంతోనే చెప్తున్నట్టున్నారు. ఈ మధ్య మీరు క్షేత్రస్థాయి పర్యటనలు చేసినట్టు లేరు..’’అంటూ దీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ హయాం లో అధికారులంతా బాగా పనిచేస్తున్నారని చెప్పారు.