తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోంది: మందకృష్ణ
సాక్షి, హైదరాబాద్: రక్తపాతం సృష్టించైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.. సీమాంధ్ర సమ్మెకు సీఎం కిరణ్ నాయకత్వం వహిస్తుంటే, ఏపీఎన్జీవోల సభకు డీజీపీ దినేశ్‌రెడ్డి రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, నాయకుడు రాజఎల్లయ్య మాదిగలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో సభలు జరుపుకొంటామంటే అనుమతివ్వని ప్రభుత్వం ఏపీఎన్జీవోల సభకు నాలుగురోజుల ముందే అనుమతి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.
ఏపీఎన్జీవో సభను అడ్డుకొనేందుకు నలువైపుల నుంచి ప్రతిఘటన దళాలు సిద్ధంగా ఉంటాయని, ఆ ప్రతిఘటన ఏ రూపమైనా తీసుకోవచ్చని హెచ్చరించారు. ఈ నెల ఏడున తెలంగాణ ప్రజలు భారీగా తరలివచ్చి ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న కుట్రను భగ్నం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఆరు, ఏడు తేదీల్లో హైదరాబాద్‌కు ప్రయాణించవద్దని, ఒకవేళ ప్రయాణాలేవైనాఉంటే రద్దు చేసుకోవాలని కోరారు. 6న అణగారినవర్గాల సభకు అనుమతివ్వనందుకు నిరసనగా శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.